
- 84% టారిఫ్ నేటి నుంచే అమలు
- ముదిరిన టారిఫ్ వార్
- చైనాపై అమెరికా 104% సుంకాలు అమలులోకి
- ప్రతీకారంగా 84% టారిఫ్‌లు ప్రకటించిన డ్రాగన్
- ఆధిపత్య ధోరణిని సహించబోమన్న చైనా మంత్రి
బీజింగ్/వాషింగ్టన్: అమెరికా, చైనా మధ్య టారిఫ్వార్ మరింత ముదిరింది. చైనాపై అమెరికా మరో 50% సుంకాలు విధించడం, బుధవారం నుంచి మొత్తం 104% టారిఫ్స్ అమలులోకి రావడంతో డ్రాగన్ కంట్రీ కూడా ప్రతీకార సుంకాలను ప్రకటించింది. గురువారం నుంచి అమెరికన్ వస్తువులపై టారిఫ్‌లను 84 శాతానికి పెంచుతున్నట్టు వెల్లడించింది. వాణిజ్యంలో అమెరికా ఆధిపత్యాన్ని సహించబోమని, టారిఫ్ వార్‌లో చివరిదాకా వెనక్కి తగ్గబోమని మరోసారి తేల్చిచెప్పింది.
‘‘అమెరికా నుంచి చైనాకు ఎగుమతి అయ్యే వస్తువులపై ఇప్పటివరకు 34 శాతం టారిఫ్‌లు ఉండగా, ఈ టారిఫ్‌లను మరో 50% పెంచుతున్నాం. ఏప్రిల్ 10వ తేదీ నుంచి మొత్తం 84% టారిఫ్‌లు అమలులోకి వస్తాయి” అని బుధవారం చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అమెరికా తీరు అంతర్జాతీయ వాణిజ్య చట్టాలకు వ్యతిరేకంగా ఉందని, అందుకే ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)లోనూ టారిఫ్‌లను సవాల్ చేస్తామని తెలిపింది. అమెరికా బెదిరింపులు, బ్లాక్ మెయిల్ ధోరణులకు ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచబోమని స్పష్టం చేసింది.
చైనాకు సమాన గౌరవం ఇచ్చినప్పుడే టారిఫ్‌ల అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని, ప్రస్తుతానికి బేరసారాలకు వెళ్లే ప్రసక్తే లేదని పేర్కొంది. టారిఫ్‌ల యుద్ధం అమెరికాకే బ్యాక్ ఫైర్ అవుతుందని, ఆ దేశమే ఎక్కువగా నష్టపోతుందని హెచ్చరించింది. అయితే, టారిఫ్‌ల అంశంపై చర్చించేందుకు చైనాకు ఇప్పటికీ తలుపులు తెరిచే ఉన్నాయని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘చైనా కూడా డీల్ కుదుర్చుకోవాలని అనుకుంటోంది. కానీ ఎలా మొదలుపెట్టాలన్నది వారికి తెలియడం లేదు. వారి పిలుపు కోసం మేం వెయిట్ చేస్తున్నాం” అని పేర్కొన్నారు.
పోటాపోటీగా టారిఫ్‌లు
ఏప్రిల్ 2వ తేదీ అమెరికాకు ‘లిబరేషన్ డే’ అని అభివర్ణించిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. అదే రోజున ప్రపంచ దేశాలన్నింటిపై కనీసం 10 శాతం బేస్ లైన్ టారిఫ్‌లను ప్రకటించారు. చైనా, ఇండియా, కెనడా, యూరోపియన్ యూనియన్ సహా 60 దేశాలపై మాత్రం అత్యధికంగా టారిఫ్‌లు ప్రకటించారు. ఏ దేశమైనా టారిఫ్‌లు తగ్గించుకోవాలంటే తమతో డీల్ కుదుర్చుకోవాలని, అలాకాకుండా ప్రతీకారంగా తమపై సుంకాలు పెంచితే తాము మరింత పెంచుతామని హెచ్చరించారు.
ట్రంప్ ప్రకటన తర్వాత గత శుక్రవారం చైనాపై 10% బేస్ లైన్, అంతకుముందున్న 10 శాతం టారిఫ్‌లకు, మరో 34 శాతం కలిపి 54 శాతం టారిఫ్‌లు అమలులోకి వచ్చాయి. దీనికి ప్రతీకారంగా అమెరికా నుంచి వచ్చే అన్ని వస్తువులపైనా చైనా గత శుక్రవారం 34% సుంకాలను ప్రకటించింది. దీంతో ట్రంప్ మరో 50% సుంకాలు పెంచి చైనాపై మొత్తం 104% టారిఫ్‌లు విధించారు. ఈ నెల 9 నుంచి అమలు చేస్తున్నారు. చైనా కూడా అంతే మొత్తంలో టారిఫ్‌లను పెంచింది.
ఆ దేశాలన్నీ కాళ్ల బేరానికి వస్తున్నయ్: ట్రంప్
అమెరికా టారిఫ్‌లతో అనేక దేశాలు బెంబేలెత్తుతున్నాయని, డీల్ కుదుర్చుకుందామంటూ కాళ్లబేరానికి వస్తున్నాయని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. మంగళవారం నేషనల్రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఈ దేశాలన్నీ నా వద్దకు వస్తున్నాయి. ప్లీజ్ సర్, డీల్ కుదుర్చుకుందాం. మీరు ఏం చేయమన్నా చేస్తాం సర్ అని వేడుకుంటున్నరు” అంటూ ట్రంప్ వెక్కిరింత ధోరణిలో కామెంట్స్ చేశారు. ఆయా దేశాలతో ట్రేడ్ డీల్స్ కుదర్చుకునే బాధ్యతను కాంగ్రెస్‌కు ఇవ్వాలని కొందరు రిపబ్లికన్లు అంటున్నారని, కానీ తన కంటే మంచిగా ఎవరూ బేరాలు ఆడలేరన్నారు.
ట్రేడ్ డీల్స్ కుదిర్చే బాధ్యతను కాంగ్రెస్‌కు అప్పగిస్తే అమెరికాను అమ్మడం ఖాయమన్నారు. ఫార్మా సెక్టార్‌పైనా పెద్ద ఎత్తున టారిఫ్‌లు ఉంటాయని ట్రంప్ ప్రకటించారు. ‘‘మన మందులు వేరే దేశాల్లో తయారవుతున్నయి. అవే మందులను ఇక్కడికి తెచ్చి అధిక ధరలకు అమ్ముతున్నారు. అందుకే ఫార్మా రంగంపై విధించే టారిఫ్‌లతో కంపెనీలన్నీ అమెరికాలోకి పరుగెత్తుకుంటూ వస్తాయి” అని ఆయన అన్నారు.
ఇండియా తమతో కలిసిరావాలని చైనా పిలుపు
పొరుగుదేశాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని చైనా ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్ అన్నారు. బుధవారం బీజింగ్‌లో ఆయన మాట్లాడారు. ఉమ్మడి భవిష్యత్తు కోసం పొరుగు దేశాలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. అమెరికాతో టారిఫ్ వార్ నేపథ్యంలో జిన్ పింగ్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇండియాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని ఢిల్లీలోని చైనీస్ ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ కూడా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ‘‘ఇండియా, చైనా సంబంధాలు రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయి. అమెరికా టారిఫ్‌ల వల్ల గ్లోబల్ సౌత్ దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ కష్టకాలంలో ఇండియా, చైనా కలిసికట్టుగా ముందుకు నడవాలి” అని ఆమె కోరారు.