అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ దూకుడు అలా ఇలా లేదు.. దేశంలో అనధికారికంగా.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నోళ్లను యుద్ధ ఖైదీలుగా వెనక్కి పంపిస్తున్నారు.. బేడీలు వేసి.. యుద్ధ విమానాల్లో ఆయా దేశాలకు పంపిస్తున్నారు ట్రంప్.. ఇదే సమయంలో అమెరికాలోకి వచ్చే ఇతర దేశాల వస్తువులపై భారీగా పన్నులు వేస్తున్నారు.. దీంతో మండిన ఇతర దేశాలు కూడా అదే విధానాన్ని అమలు చేస్తున్నాయి.. మొన్నటికి మొన్న కెనడా, మెక్సికో దేశాలు అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పోటీగా అధిక ట్యాకులు విధించాయి. ఇప్పుడు అదే బాటలో చైనా దేశం.. ట్రంప్ షాక్ ఇచ్చింది. అమెరికా నుంచి చైనాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై 15 శాతం అదనంగా ట్యాక్సులు విధించింది. ట్రంప్ ఒకటి అనుకుంటే.. ఇప్పుడు మిగతా దేశాలు మరోలా స్పందిస్తుండటంతో.. అమెరికా కక్కలేక మింగలేక చస్తుంది.
అమెరికా నుంచి దిగుమతి అవుతున్న కోల్ (బొగ్గు)పై 15 శాతం, న్యాచురల్ గ్యాస్ (ద్రవ సహజవాయువు)పై 10 శాతం పన్ను విధించింది చైనా. అదే విధంగా ఇతర వ్యవసాయ పనిముట్లపై కూడా సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
అమెరికాకు కీలక ఎగుమతులను తగ్గించనున్న చైనా:
టారిఫ్ లతో పాటు అమెరికాపై గట్టి దెబ్బ కొట్టేందుకు చైనా మాస్టర్ ప్లాన్ వేసింది. చైనాలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే టంగ్ స్టన్ సంబంధిత వస్తువలను యూఎస్ భారీగా ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తోంది. టంగ్ స్టన్ ఎగుమతులను తగ్గించేలా చర్యలు మొదలు పెట్టింది.
గూగుల్ పై విచారణ:
ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై క్రమపద్ధతిలో కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైన చైనా.. గూగుల్ సంస్థపై విచారణకు సిద్ధమైంది. చైనాకు సంబంధించిన కీలక డేటాను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణతో గూగుల్ సంస్థను ఇన్వెస్టిగేట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో గూగుల్ యాజమాన్యం ట్రంప్ నిర్ణయంపై తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అగ్రరాజ్యం ఏం చేసినా చెల్లుతుంది అన్నట్లుగా ట్రంప్ ఆవేశపూరితంగా ఎడా పెడా టారిఫ్ లు విధించడం ఇప్పుడు అమెరికాకే ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. సై అంటే సై అన్నట్లుగా కెనడా, మెక్సికో ప్రతిఘటించి అమెరికాపై కూడా పన్నులు విధించడంతో కాస్త తగ్గి నెల రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ కు.. తాజాగా చైనా నిర్ణయం మరింత షాక్ ఇవ్వనుంది.
ఇప్పుడున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక దేశంపై మరో దేశం ఆధారపడిన పరిస్థితి. ఫ్రీ ట్రేడ్ కు ఆటంకం కలిగించేలా నిర్ణయం తీసుకుంటే. .అది ఇతర దేశాలతో పాటు అమెరికాను కూడా ప్రభావితం చేయక తప్పదు. చూడాలి మరి.. ట్రంప్ టారిఫ్ వార్ ను ఆపేస్తారా లేక మరింత అగ్రెస్సివ్ గా ముందుకెళ్తారా అనేది.