న్యూఢిల్లీ: సిక్కిం బార్డర్ వెంట చైనా అత్యాధునిక జే 20 స్టెల్త్ ఫైటర్ జెట్లను మోహరించింది. మే 27న జియో స్పేషియల్ ఇంటెలిజెన్స్ తీసిన శాటిలైట్ ఫొటోల ద్వారా ఇది స్పష్టమవుతున్నది. ఇండియన్ ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి కేవలం 150 కిలో మీటర్ల కంటే తక్కువ దూరంలోనే ఈ అడ్వాన్స్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. మిలటరీ, అక్కడి ప్రజల సౌకర్యార్థం షిగాట్సే సిటీలో చైనా ఎయిర్‌పోర్టు నిర్మించింది. ఈ విమానాశ్రయం సముద్ర మట్టానికి 12,408 అడుగుల ఎత్తులో ఉంటుంది. టిబెట్‌లోని రెండో అతిపెద్ద సిటీగా షిగాట్సేకు పేరుంది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన విమానాశ్రయాల్లో ఇది కూడా ఒకటి. కాగా, ఈ ఎయిర్‌పోర్టులో మొత్తం ఆరు జే20 స్టెల్త్ ఫైటర్ జెట్లు ఉన్నట్టు శాటిలైట్ ఇమేజ్‌తో స్పష్టమవుతున్నది. అదేవిధంగా, జే -500 ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా స్పేషియల్ ఇంటెలిజెన్స్ రిలీజ్ చేసిన శాటిలైట్ ఫొటోల్లో కనిపిస్తున్నది. చైనా మోహరించిన జే20 స్టెల్త్ ఫైటర్ జెట్ల అంశంపై మాట్లాడేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) నిరాకరించింది. కాగా, చైనా రక్షణ వ్యవస్థలో జే20 స్టెల్త్ ఫైటర్ జెట్లు ఎంతో కీలకం. ఈ యుద్ధ విమానాలు ప్రధానంగా చైనాలోని ఈస్టర్న్ ప్రావిన్స్‌లో ఉన్నాయని సమాచారం. అయితే, అందుకు భిన్నంగా వీటిని ఇండియాలోని సిక్కిం బార్డర్ వద్ద మోహరించారని ప్రముఖ జియో స్పేషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నది.
జే20 ఫైటర్ జెట్లకు ధీటుగా మన వద్ద ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన 36 రాఫెల్ ఫైటర్స్ ఉన్నాయి. వీటిలో ఎనిమిది రాఫెల్ ఫైటర్స్ యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ (యూఎస్ఏఎఫ్)తో అధునాతన విమానాల సైనిక విన్యాసాల్లో పాల్గొనేందుకు అలస్కా వెళ్లాయి. జే20 స్టెల్త్ ఫైటర్స్ గుర్తించిన షిగాట్సే సిటీ.. వెస్ట్ బెంగాల్‌లోని హసిమారా నుంచి 290 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 16 రాఫెల్ ఫైటర్స్‌తో కూడిన రెండు స్క్వాడ్రాన్లను ఇండియా మోహరించింది. 2020, 2023లో జే20 ఫైటర్ జెట్లను చైనాలోని హోటాన్ ప్రిఫెక్చర్‌లోని జిన్జియాంగ్లో గుర్తించారు.