వైరస్ అని పేరు వినబడగానే అందరికీ గుర్తొచ్చేది.. కరోనా(Corona virus). ఈ వైరస్ బారిన పడి ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో.. ఎలాంటి కష్టాలు అనుభవించారో ఆ దృశ్యాలు కళ్ల ముందు కదలాడుతుంటాయి. ఈ మహమ్మారి తోడ బుట్టిన వారిని సైతం అంటరాని వారిని చేసింది. కుటుంబసభ్యుల రోదనలు.. చనిపోయిన వారిని మూటల్లో చుట్టి కాల్చేసే దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్నామనుకునేలోపు మరో ప్రాణాంతక వైరస్ బయటపడింది. మెదడును దెబ్బతీసే కొత్త వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
రక్తం పీల్చే పురుగుల నుంచి మనుషులకు
నాడీకణ వ్యవస్థను దెబ్బతీసే 'వెట్‌ల్యాండ్ వైరస్'(wetland virus) 'WELV' అని పిలవబడే ప్రమాదకరమైన వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది జంతువుల్లో రక్తాన్ని పీల్చే పురుగుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్నట్లు నిర్ధారించారు.
మొదటిసారి 2019లో ఈ వెట్‌ల్యాండ్ వైరస్‌ను గుర్తించారు. మంగోలియాకు చెందిన ఓ 60 ఏళ్ల వృద్ధుడు ఈ వైరల్ బారిన పడ్డారు. అనారోగ్యం బారిన పడిన అతను ఐదు రోజుల పాటు విపరీతమైన జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. ఇవి కాస్త అనుమానాస్పదంగా ఉండటంతో వైద్యులు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే అతను నివాసముంటున్న సమీప ప్రాంతాల్లోని దాదాపు 640 మంది అటవీ అధికారులకు రక్త పరీక్షలు నిర్వహించగా.. 12 మందిలో ఈ వైరస్ ఉన్నట్లు తేలింది.
ఈ వైరస్ బారిన వారు చికిత్స అనంతరం కోలుకుంటున్నప్పటికీ, ఇది నాడీకణ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్లు శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిర్ధారించారు. ముఖ్యంగా మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం ఉన్నట్లు కనుగొన్నారు.
వెట్‌ల్యాండ్ (WELV ) వైరస్.. క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ గ్రూప్‌కు చెందినది. పరాన్న జీవుల ద్వారా ఇది వ్యాపిస్తుంది. పందులు, గొర్రెలు, గుర్రాలు, ట్రాన్స్‌బైకల్ జోకర్లలో (మైయోస్పాలాక్స్ సైలరస్) ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఈ నమూనాలను చైనాలోని ఈశాన్య ప్రాంతాల నుండి సేకరించారు.
వెట్ ల్యాండ్ వైరస్ లక్షణాలు
ఈ వైరస్ బారిన పడిన వారందరిలో ఒకే విధమైన లక్షణాలను కనిపించనప్పటికీ.. జ్వరం, మైకము, తలనొప్పి, అనారోగ్యం, మైయాల్జియా, కీళ్లనొప్పులు, వెన్నునొప్పి వంటివి అందరిలోనూ ఉంటాయి. కొందరిలో చర్మం లేదా శ్లేష్మ పొరలపై గుండ్రని ఎరుపు లేదా ఊదా రంగు మచ్చలు కనిపిస్తాయి.