- అమెరికాతో టారిఫ్ వార్ నేపథ్యంలో డ్రాగన్ ఎత్తుగడ
- ప్రపంచ దేశాలన్నింటికీ 90% చైనా నుంచే సరఫరా
- కార్లు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్లు,వెపన్స్ తయారీ వరకూ అన్ని కంపెనీలపైనా ఎఫెక్ట్
- అమెరికాతోపాటు ఇతర దేశాలకూ తప్పని ఇబ్బందులు
బీజింగ్/వాషింగ్టన్: అమెరికాతో టారిఫ్ వార్ నేపథ్యంలో ఆధిపత్యాన్ని చాటుకునేందుకు చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకూ అమెరికాపై పోటాపోటీగా టారిఫ్లు ప్రకటించిన డ్రాగన్ కంట్రీ.. ఇప్పుడు అరుదైన మూలకాలు, లోహాలు, మ్యాగ్నెట్ల ఎగుమతులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో అమెరికన్ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రస్తుతం కార్ల నుంచి మొదలుకొని ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, మిసైల్స్, స్పేస్ క్రాఫ్ట్ ల తయారీ వరకూ అత్యంత అరుదైన లోహాలు, మ్యాగ్నెట్లు చైనా నుంచే సరఫరా అవుతున్నాయి.
ఇకపై స్పెషల్ లైసెన్స్ ఉన్న కంపెనీలకు మాత్రమే ఎగుమతులను అనుమతించేలా నిబంధనలను మార్చే పనిలో చైనా ఉన్నది. కొత్త విధానం రూపొందే వరకూ వీటి ఎగుమతులను చైనా నిలిపివేసిందని ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనంలో తెలిపింది. ఏప్రిల్ 2 నుంచే ఈ ఎగుమతులపై నిషేధం అమలులోకి వచ్చిందని.. ఇప్పటికే చైనాలోని అనేక పోర్టుల వద్ద ఈ ముడి పదార్థాల షిప్ మెంట్లు ఆగిపోయాయని వివరించింది.
కొత్త విధానం అమలులోకి వస్తే గనక.. అమెరికాలోని అనేక కంపెనీలకు ఈ అరుదైన లోహాలు, మ్యాగ్నెట్ల సరఫరా శాశ్వతంగా నిలిచిపోనుందని వెల్లడించింది. అమెరికా రక్షణ శాఖతో కాంట్రాక్టులు కుదుర్చుకుని వెపన్స్ తయారు చేసి ఇస్తున్న లాఖీడ్ మార్టిన్ తోపాటు టెస్లా, యాపిల్ వంటి కంపెనీలపైనా తీవ్ర ప్రభావం పడనుందని పేర్కొంది.
చైనా నుంచే 90 శాతం సప్లై..
భూమిలో నుంచి తవ్వి తీసే అరుదైన మూలకాలు, లోహాలతోపాటు మ్యాగ్నెట్ల ఉత్పత్తిలో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నది. అమెరికాతోపాటు ప్రపంచ దేశాలన్నింటికీ చైనా నుంచే దాదాపు 90 శాతం మేరకు ఈ మూలకాలు, లోహాలు సరఫరా అవుతున్నాయి. చైనా తర్వాత మయన్మార్, లావోస్ నుంచి కూడా ఇవి సప్లై అవుతున్నా.. ఆ సప్లై చైన్ లోనూ చైనా పాత్ర కీలకంగా ఉంది. దీంతో ఈ అరుదైన మూలకాలు, లోహాల కోసం ప్రపంచ దేశాలన్నీ చైనాపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది.
చైనా నుంచి సప్లై అయ్యే 17 అరుదైన మూలకాలను ఎలక్ట్రిక్ కార్లు, మోటార్లు, డ్రోన్లు, రోబోలు, జెట్ ఇంజిన్లు, లేజర్ పరికరాలు, కార్ హెడ్ లైట్లు, స్పార్క్ ప్లగ్ లు, కెపాసిటర్లు, కంప్యూటర్ చిప్ లు, ఏఐ సర్వర్లు, స్మార్ట్ ఫోన్ల తయారీలో ఈ అరుదైన లోహాలు, మూలకాలతోపాటు మ్యాగ్నెట్లను విస్తృతంగా వాడుతున్నారు. వీటిలో ప్రధానంగా సమారియం, గాడోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, లుటేటియం, స్కాండియం, ఎట్రియం వంటి కీలకమైన మూలకాల ఎగుమతులు ఇప్పుడు నిలిచిపోయాయి. అమెరికాలో భూమి నుంచి అరుదైన మూలకాలను తవ్వి తీసే గని ఒక్కటి మాత్రమే ఉంది. దాని నుంచి తీసే ముడి సరుకులు అక్కడి అవసరాలకు ఏమాత్రం సరిపోవని చెప్తున్నారు.