ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ వ్యతిరేకిస్తున్నాం..వెనక్కి తీసుకోవాలి:చైనా

ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ వ్యతిరేకిస్తున్నాం..వెనక్కి తీసుకోవాలి:చైనా

బీజింగ్:  అమెరికా విధించిన రెసిప్రోకల్​ టారిఫ్స్​ను వ్యతిరేకిస్తున్నట్టు చైనా ప్రకటించింది. ట్రంప్​ ప్రకటన ఏకపక్షంగా ఉన్నదని మండిపడింది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలని, లేకుంటే తమ దేశ సొంత ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఎంతదూరమైనా వెళ్తామని ప్రకటించింది. ఈ మేరకు చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. “అమెరికా టారిఫ్స్​ అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు  అనుగుణంగా లేవు. 

ఇవి ప్రపంచ ఆర్థికాభివృద్ధితోపాటు చైనా ఎకానమీని ప్రమాదంలో పడేస్తాయి. వాటిని తక్షణమే వెనక్కి తీసుకోండి. వాణిజ్య విభేదాలను చర్చలతో పరిష్కరించుకోవాలి”అని పేర్కొంది. ఈ అంశాన్ని డబ్ల్యూటీవో​వేదికలపై సవాల్​ చేస్తామని, అమెరికా ఒత్తిడి కొనసాగిస్తే తగిన జవాబు ఇస్తామని హెచ్చరించింది. చైనా దిగుమతులపై  అమెరికా 20% ట్యాక్స్​లను విధిస్తుండగా.. దాన్ని  34%కు పెంచుతున్నట్టు ట్రంప్​ ప్రకటించారు. ఇది ఫెంటనిల్‌‌‌‌‌‌‌‌ డ్రగ్‌‌‌‌‌‌‌‌ అక్రమాలను అడ్డుకోవడానికి దోహదపడుతుందని అమెరికా అంటున్నది.

ప్రపంచ దేశాల మండిపాటు 

వివిధ దేశాలపై ట్రంప్ 10 శాతం ప్రతీకార సుంకాలు ప్రకటించడం అన్యాయం, అక్రమమని ఆయా దేశాల అధినేతలు  మండిపడుతున్నారు. ప్రతీకార సుంకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దదెబ్బ అని యూరోపియన్  కమిషన్  ప్రెసిడెంట్  ఉర్సులా వాన్ డెర్  లియెన్  అన్నారు. దీనివల్ల నిత్యావసరాలు, రవాణా, మెడిసిన్  ధరలు పెరుగుతాయన్నారు. ప్రతీకార సుంకాలు  దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని జపాన్  ప్రధాని షిగెరు ఇషిబా అన్నారు.

 టారిఫ్ లు ఎంతో చింతించదగ్గ విషయమన్నారు. టారిఫ్ లపై అత్యవసర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రపంచ దేశాలకు దక్షిణ కొరియా ప్రధాని హాన్ డక్ పిలుపునిచ్చారు. టారిఫ్​లు తమ ఆర్థిక వ్యవస్థపై భారీగా ప్రభావం చూపాయని వియత్నాం ప్రధాని ఫామ్  మిన్  చిన్  అన్నారు. తమ దేశంలోని చిన్న వ్యాపారులపై అమెరికా టారిఫ్ లు తీవ్ర ప్రభావం చూపుతాయని ఉక్రెయిన్  ఆర్థిక మంత్రి యూలియా స్వైరీడెంకో పేర్కొన్నారు.