- త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే మూడు రెట్లు పెద్దది
- భారత్, చైనా బార్డర్‌కు 30 కి.మీ.దూరంలోనే నిర్మాణానికి ప్రతిపాదన
- ప్రాజెక్టు పూర్తయితే భారత్‌కు నీటి సమస్యలు
- అస్సాం, అరుణాచల్‌కు పొంచి ఉన్న ముప్పు
బీజింగ్ : భారత్, చైనా బార్డర్లో ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్నిర్మాణానికి చైనా ఆమోదం తెలిపింది. భారత సరిహద్దుకు దగ్గరగా టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై 137 బిలియన్డాలర్ల వ్యయంతో దీనిని నిర్మించనున్నట్టు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. ఈ డ్యామ్ ప్రతిసంవత్సరం 300 బిలియన్ కిలోవాట్-హవర్స్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని.. 2020లో చైనాలోని పవర్ కన్‌స్ట్రక్షన్ కార్ప్ ఆఫ్ చైనా అంచనా వేసింది. ఇది ప్రస్తుతం సెంట్రల్ చైనాలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్దదైన త్రీ గోర్జెస్ డ్యామ్ (88.2 బిలియన్ కిలోవాట్-హవర్స్) కంటే మూడు రెట్లు పెద్దది.
చైనా.. కార్బన్ పీకింగ్, కార్బన్ న్యూట్రాలిటీ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ ప్రాజెక్ట్ ప్రధాన పాత్ర పోషిస్తుందని, ఇంజినీరింగ్ వంటి పరిశ్రమలను ప్రోత్సహిస్తుందని, టిబెట్‌లో ఉద్యోగాలను సృష్టిస్తుందని జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. బ్రహ్మపుత్ర నది టిబెట్‌లో జన్మిస్తుంది. అక్కడ దానిని యార్లంగ్ జాంగ్బో అని పిలుస్తారు. టిబెట్ నుంచి భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది. యార్లంగ్ జాంగ్బో ఎగువ భాగంలో చైనా ఇప్పటికే జలవిద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది.
2015లో టిబెట్‌లో అతిపెద్దదైన 1.5 బిలియన్ డాలర్ల జామ్ జలవిద్యుత్ కేంద్రాన్ని స్టార్ట్‌చేసింది. అయితే, ప్రస్తుతం మరో కొత్త డ్యామ్ ను నిర్మిస్తే.. స్థానిక జీవావరణాన్ని మాత్రమే కాకుండా బ్రహ్మపుత్ర నది ప్రవాహం, గమనాన్ని కూడా మార్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో భారతదేశంతో పాటు బంగ్లాదేశ్ ఈ డ్యామ్ గురించి ఆందోళన లేవనెత్తుతాయి.
భారత్ కు తప్పని ఇబ్బందులు..
చైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే భారత్ కు ఇబ్బందులు తప్పవని నిపుణులు పేర్కొంటున్నారు. నీటి ప్రవాహాన్ని నియంత్రించే అధికారం చైనా కలిగి ఉంటుందని.. దీంతో అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు తీవ్ర నీటి సమస్యలను ఎదుర్కొనే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఈ డ్యామ్వల్ల రక్షణ పరంగానూ భారత్‌కు ముప్పు పొంచిఉందని సూచిస్తున్నారు.
చైనా నిర్మించతలపెట్టిన ఈ డ్యామ్ భారత్, చైనా బార్డర్‌కు కేవలం 30కిలో మీటర్ల దూరంలోనే ఉంటుందని, యుద్ధ పరిస్థితులు తలెత్తిన సమయాల్లో ఒకేసారి పెద్దమొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు ముంపునకు గురవుతాయని స్పష్టం చేస్తున్నారు.
మనకు ముప్పు ఏంటి?
- చైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే బ్రహ్మపుత్ర నది నీటి ప్రవాహాన్ని నియంత్రించే అధికారం చైనా కలిగి ఉంటుంది.
- అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు తీవ్ర నీటి సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం.
- ఈ డ్యామ్వల్ల రక్షణ పరంగానూ ఇండియాకు ముప్పు పొంచి ఉంది.
- ఈ డ్యామ్ భారత్, చైనా బార్డర్‌కు చాలా తక్కువ దూరంలోనే ఉంటుంది. యుద్ధ పరిస్థితులు తలెత్తిన సమయాల్లో ఒకేసారి పెద్దమొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు మునిగిపోతాయి.