
బీజింగ్: యుద్ధనౌకలు, కొత్త తరం యుద్ధ విమానాల వేగవంతమైన అభివృద్ధితో సహా సాయుధ దళాలను ఆధునీకరించడానికి చైనా నడుం బిగించింది. ఈ నేపథ్యంలో రక్షణ బడ్జెట్‌ను 21.66 లక్షల కోట్లకు (249 బిలియన్డాలర్లు) పెంచేందుకు సిద్ధమైంది. దేశ ప్రధాన బడ్జెట్‌ను ప్రధాని లీ కియాంగ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న వేళ రక్షణ బడ్జెట్ పెంపు సమాచారం బయటకు వచ్చింది.
నిరుడు చైనా రక్షణ రంగానికి 20.19 లక్షల కోట్ల (232 బిలియన్ డాలర్లు)ను బడ్జెట్లో కేటాయించింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 7.2 శాతం అధికం. అమెరికా తర్వాత రెండో అతిపెద్ద రక్షణ రంగ బడ్జెట్ చైనాదే. ఈ దేశ రక్షణ వ్యయం భారత్‌కంటే మూడు రెట్లు అధికంగా ఉన్నది. ఈ రక్షణ వ్యయంపై నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పీసీ) అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. బలమైన శక్తితోనే శాంతిని పరిరక్షించుకోవచ్చని, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవచ్చని అన్నారు.