బీజింగ్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) కు తమ మద్దతు ఉంటుందని చైనా స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్ వో నుంచి వైదొలుగుతున్నామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కొవిడ్ మహమ్మారిని కట్టడి చేయడంలో డబ్ల్యూహెచ్ వో ఫెయిలైందని, అందువల్లే ఆ సంస్థ నుంచి తప్పుకోవాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో చైనా కీలక ప్రకటన చేసింది.
డబ్ల్యూహెచ్ వోకు తమ మద్దతు కొనసాగిస్తామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘డబ్ల్యూహెచ్‌వోను మరింత బలపరచాలి తప్ప, బలహీనపరచకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తన బాధ్యతలను పూర్తిచేయడంలో ఎప్పట్లాగే చైనా మద్దతు ఇస్తుంది” అని జియాకున్ అందులో పేర్కొన్నారు.