యాభై ఏళ్ల కిందట అమెరికాలో పిల్లాడు బ్రెడ్ ముక్క తినకపోతే తల్లి, ‘‘తినరా నాన్నా. పిల్లలకు తినడానికి చైనాలో ఈమాత్రం బ్రెడ్ ముక్కలు కూడా దొరకవు” అనేది. అయితే ఇదంతా గతం. అప్పటి చైనాకు, ఇప్పటి చైనాకు అసలు పోలికలే లేవు. పిల్లల కోసం కాసిన్ని బ్రెడ్ ముక్కలు కూడా దొరకని చైనాలో ఇప్పుడు తిండికి లోటన్నది లేనే లేదు. చాలా కాలం పాటు కష్టాలు పడ్డ చైనా ప్రజలు ఇప్పుడు విలాసాల వైపు మళ్లారు. ఇదంతా ఈ 30 ఏళ్లలో వచ్చిన మార్పు. కమ్యూనిస్టు చైనా మార్కెట్ ఎకానమీని ఆశ్రయించింది. విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచింది. ప్రైవేట్ ఫండ్లను ప్రోత్సహించింది. దీంతో చైనా రూపురేఖలే మారిపోయాయి.
1979 నుంచి విదేశీ పెట్టుబడులు
1979 తరువాత విదేశాల వాళ్లు చైనాలో పెట్టుబడులు పెట్టడానికి వీలుగా తలుపులు తెరిచింది. విదేశీ పెట్టుబడులు వరదల్లా రావడంతో పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు వచ్చాయి. గ్రామాల్లో పని కోసం వెతుక్కుంటున్న కుర్రకారు పొట్ట చేత పట్టుకుని పట్టణాలకు వచ్చి, ఫ్యాక్టరీల్లో కార్మికులుగా సెటిలయ్యారు.కొత్తగా ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినా కార్మికుల కోసం చైనా ఏరోజు ఇబ్బంది పడలేదు. వేరే దేశాల నుంచి వర్క్ ఫోర్స్ ను తీసుకురావాల్సిన అవసరం ఏర్పడలేదు. 15 నుంచి 64 ఏళ్ల వయసున్న వారంతా చైనా ఫ్యాక్టరీల్లో కార్మికులుగా చేరి, ఉత్పత్తి పెంచారు. అగ్రికల్చర్ నుంచి మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి చైనా ప్రజలు షిఫ్ట్ అయ్యారు. పొలాల్లో పనిచేసే ప్రజలు చాలా త్వరగా స్కిల్డ్ లేబర్ గా మారారు. ఇదే విశేషం. చైనాలో చోటు చేసుకున్న ఇండస్ట్రియలైజేషన్ ఫలితంగా కోట్లాది మందికి ఉద్యోగాలు దొరికాయి.
టెక్నాలజీ పై పట్టుతో కొత్త పరిశ్రమలు…..
వేరే దేశాల నుంచి అందిపుచ్చుకున్న టెక్నాలజీతో చైనా ఎన్నో కొత్త పరిశ్రమలు పెట్టింది. చిన్న చిన్న యూనిట్లు పెట్టి ఎక్కువ లాభాలు గడించింది. ఈ పద్ధతిలో యూనిట్లు నడపడానికి పెద్దగా వర్క్ ఫోర్స్ కూడా అవసరం కాలేదు. ఆన్ లైన్ రంగంలో టాప్ పొజిషన్ కు వెళ్లిన అలీబాబా వంటి సంస్థలను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మెడికల్ ఎక్విప్ మెంట్, ఎలెక్ట్రానిక్స్, ఫర్నిచర్, ఇంటీరియర్ డెకరేషన్ తదితర వాటిల్లో అలీబాబా గ్రూపు ముందంజలో ఉంది.
ప్రజల లైఫ్ స్టయిల్లో మార్పులు
ఎకానమీ పై పట్టు సాధించడంతో చైనాలో అనేక మార్పులు వచ్చాయి. ప్రజలు ఫైనాన్షియల్ గా బాగుపడ్డారు. డబ్బులకు ఎవరూ పెద్దగా ఇబ్బంది పడటం లేదు. ఈ ప్రభావం ప్రజల లైఫ్ స్టయిల్ పై కూడా పడింది.
భారీఎత్తున ప్రైవేటీకరణ
1990ల్లో ప్రభుత్వ రంగ సంస్థలను భారీగా ప్రైవేట్ఎంటర్ప్రెన్యూర్లకు అప్పగించారు. దీంతో వెయ్యికోట్లకు పైగా ఉన్న సర్కార్ ఎంటర్ప్రైజెస్ సంఖ్య 2000 సంవత్సరం నాటికి 3 లక్షలకు తగ్గింది. పట్టణాల కల్చర్ బాగా పెరిగింది. పబ్లిక్ తక్కువ ఇన్‌కం వచ్చే సాగు పనులు వదిలి టౌన్లలో ఎక్కువ రాబడి వచ్చే ఉద్యోగాల వైపు మళ్లారు. అయినా ప్రొడక్షన్లో పెరుగుదల నామమాత్రంగానే ఉంది. ‘కొత్త ప్రొడక్ట్‌లను లోకల్‌గానే కనిపెట్టాలి’ అనే కాన్సెప్ట్‌కి ఫారిన్ జాయింట్ వెంచర్లు వ్యతిరేకం. దీంతో చైనా కంపెనీలు ఇతర దేశాల నుంచి టెక్నాలజీని తెచ్చుకునే బదులు పైరసీ వెర్షన్లను దింపేస్తున్నాయి. ఇన్నోవేషన్లు, టెక్నలాజికల్ అభివృద్ధి అనేవాటికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వని కారణంగా కొంత వెనకబడుతోంది. లేబర్ ఫోర్స్‌లో క్వాలిటీ మ్యాన్ పవర్, స్కిల్డ్ వర్కర్స్ ఉంటేనే పెట్టుబడులు సరైన ఫలితాలిస్తాయి. లేకపోతే నష్టాలను కొనితెచ్చుకున్నట్లే అవుతుందన్న వాదన ఇప్పటికే ఉంది.
1978లో మార్పు మొదలు
1978 తరువాత చైనా ఫైనాన్షియల్ గా దూసుకుపోయింది. దీనికి ప్రధాన కారణం ఎకనమిక్ రిఫార్మ్స్. చైనా డెవలప్ మెంట్ లో 1978 ఏడాదిని కీలకంగా చెప్పుకోవచ్చు. 1978లో తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించాయి. భవిష్యత్తులో చైనా బలమైన ఆర్థిక వ్యవస్థ గా ఏర్పడటానికి పార్టీ ప్లీనరీ సమావేశం గ్రౌండ్ వర్క్ ను తయారు చేసి పెట్టింది. అప్పటివరకు చైనాలో కమ్యూనిస్టు సోషలిస్టు రాజకీయ వాతావరణంలో వ్యవసాయం, పరిశ్రమలు నడిచేవి. 1978 తరువాత ఈ పరిస్థితి పూర్తిగా మారింది. సోవియట్ మోడల్ వ్యవహారాలకు చైనా పుల్ స్టాప్ పెట్టింది. లిబరలైజేషన్ ను ఫాలో అయింది. నూటికి నూరు శాతం చైనా అవసరాలకు తగ్గట్లు దేశ ఎకానమీలో మార్పులు జరిగాయి. ఇందులో భాగంగా కలిసికట్టు వ్యవసాయం (కలెక్టివ్ ఫామింగ్ ) అనే కాన్సెప్ట్ కు చైనా శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టింది. రైతులకు తాము పండించిన వాటిని తామే అమ్ముకునే స్వతంత్రం వచ్చింది.
మన మార్కెట్‌నూ ముంచెత్తుతున్న చైనా వస్తువులు
ఇవాళ్టి రోజున చైనా వస్తువులు ప్రపంచ మార్కెట్ ను శాసిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. గుండుసూది నుంచి విమానం వరకు చైనా తయారు చేయని వస్తువంటూ లేదంటారు. మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో చైనా ఆ స్థాయిలో దూసుకెళ్లిందంటున్నారు నిపుణులు. టెక్నాలజీ పరంగా ‘ కాపీ’ కల్చర్ చైనాలో ఎక్కువ. ఎవరైనా చైనాలో పరిశ్రమలు పెట్టాలంటే వాళ్ల టెక్నాలజీని కూడా చైనా కు తెలియచేయాల్సి ఉంటుంది. ఈ టెక్నాలజీ ఆధారంగా చైనా తనంతట తాను కొన్ని వస్తువులను చాలా చౌకగా తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తుంది. వేరే దేశంలో పది రూపాయలకు అమ్మే పెన్ను ను చైనా‘ కాపీ ’ కల్చర్ తో మూడు రూపాయలకే తయారు చేసి, మార్కెట్ లోకి వదులుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన బ్రాండ్లను చైనా సింపుల్ గా కాపీ కొట్టేస్తుంది. ఈ క్రమంలో చైనా ఎప్పటికప్పుడు టెక్నాలజీలో అప్ డేట్ అయింది. మోడ్రన్ టెక్నాలజీని సొంతం చేసుకుంటుంది.“ చేపను ఫ్రీగా ఇవ్వడం కాదు…చేపను పట్టడం నేర్పండి ”అనే సూక్తి చైనా మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ కు కరెక్ట్ గా సరిపోతుంది. మన దేశంలో కూడా చైనా సరుకు గురించి తెలియనివారెవరు! సెల్‌ఫోన్ మొదలు టీవీల వరకు చైనావి మన మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. పటాకులు, పూజ సామగ్రి కూడా చైనా నుంచి మన మార్కెట్లోకి దిగిపోతుంది.
జనాభా ఇప్పుడు పనికొచ్చింది
జనాభా పరంగా టాప్‌లో ఉన్న చైనా ప్రస్తుతం కన్స్యూమరిజంలోనూ దూసుకెళ్తోంది. చైనాలో మావో శకం ముగిసిన తర్వాత ప్రపంచ ఎకానమీలో పెద్ద దేశాలను దాటే ప్రయత్నం చేసింది. 1978లో డెంగ్ జియావోపింగ్ హయాం మొదలయ్యాక చైనా కొత్త బాటలో నడిచింది. గడచిన 30 ఏళ్లలో చైనా టాప్–10 ఎకనామిక్ కంట్రీస్‌లో చేరింది. అమెరికా తర్వాత పొజిషన్ చైనాదే. మిక్స్డ్ ఎకానమీని కొనసాగిస్తున్నా పెట్టుబడుల పాలసీలో తన కంట్రోల్‌ని వదులుకోలేదు. చైనా 9.2 లక్షల కోట్ల డాలర్ల నామినల్ జీడీపీని సాధించి సెకండ్ ప్లేస్‌లో ఉండగా, మన దేశం 2.9 లక్షల కోట్ల డాలర్లతో ఆరో స్థానంలో ఉంది. 2024 నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవాలన్నది ఇండియా లక్ష్యం.
చైనా ఇప్పటికీ కమ్యూనిస్టు దేశమే. ప్రభుత్వమే బడా ఇండస్ట్రీలపై పెత్తనం సాగిస్తోంది. ఇంధన సెక్టార్లో పెద్దవైన పెట్రోచైనా, చైనా పెట్రోలియం అండ్ కెమికల్ కార్పొరేషన్ (సైనోపెక్), చైనా నేషనల్ ఆఫ్‌షోర్ ఆయిల్ కార్పొరేషన్ (సిఎన్వోవోసీ) ప్రభుత్వ అజమాయిషీలోనే ఉన్నాయి. ఇవి ప్రైవేటు కంపెనీలతో పోలిస్తే తక్కువ లాభాన్ని గడిస్తున్నాయి. ఈ మూడింటివల్ల 4.9 శాతం రాబడి వస్తుండగా, ప్రైవేటు కంపెనీలు 13.2 శాతం తెచ్చుకుంటున్నాయి. అయితే, హైప్రయారిటీ ప్రాజెక్ట్‌ల విషయంలో ప్రభుత్వం యాజమాన్యాన్ని వదులుకోవడం లేదు. చైనా జనాభాకి తగ్గట్టుగా తమ అమ్మకాలు పెంచుకోవాలనుకునే విదేశీ కంపెనీలు ఏవైనాగానీ, అక్కడి ప్రభుత్వం పెట్టిన షరతులకు లోబడి ఉండాల్సిందే. వాళ్లు చైనాలోనే తమ ఫ్యాక్టరీలను స్థాపించి, లోకల్ వర్కర్లకు పని కల్పించాల్సి ఉంటుంది. అలాగే, చైనీస్ కంపెనీలుకూడా తయారు చేసుకోవడానికి అనువుగా ఆయా కంపెనీలు తమ టెక్నాలజీని షేర్ చేసుకుని తీరాలి.
యువాన్ని నిలబెట్టుకుంటోంది
కరెన్సీ ఎక్చ్సేంజీలో చైనాదే పూర్తి ఆధిపత్యం. డాలర్‌తో యువాన్ మారకం రేటుని చైనా రిజర్వ్ బ్యాంకయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా కంట్రోల్ చేస్తుంది. తాజా రేటు ప్రకారం ఒక డాలర్‌కి 7.12 యువాన్లు. మన కరెన్సీ డాలర్ ఒక్కంటికీ దాదాపు 71 రూపాయలు. ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ కావడం, కాంట్రాక్ట్ పద్ధతిలో లోకల్ లేబర్ దొరకడం, వారికి చేతినిండా పని కల్పించడం లాంటి కారణాలతో చైనాలో మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ బాగా పెరిగింది. అమెరికాకి భారీగా ఎగుమతులు చేసే దేశాల్లో చైనా ముఖ్యమైనది. దాంతో చైనా తన కరెన్సీ యువాన్ని నిలబెట్టుకోగలుగుతుంది. బల్క్ డ్రగ్స్ తయారీ, అల్యూమినియం, ఉక్కు పరిశ్రమల్లో చైనాదే మోనోపలీ. ప్రపంచంలో సెల్యులర్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్‌గా హువాయి కంపెనీ ఎదిగింది. 5జీ టెక్నాలజీలో దీనికి తిరుగులేదని అంటారు. పర్సనల్ కంప్యూటర్స్ రంగంలో లెనోవా, స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో జియామీలు ఇప్పటికే దూసుకెళ్తున్నాయి.
మేడిన్ చైనా… సేల్ ఇన్ చైనా
ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ ‘బయ్ అమెరికన్, హైర్ అమెరికన్’ అనే స్లోగన్ ఇచ్చి, ప్రెసిడెంట్ కాగలిగారు. చైనాకి ఆ బెంగ లేదు. తాను తయారుచేసిన వస్తువుల్ని దేశంలో అమ్ముకోగలిగితే చాలు. ఎందుకంటే, మేడ్ ఇన్ చైనా వస్తువుల రేటు అమెరికాలో తయారయ్యే వస్తువుల కంటే చౌకగా ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చైనాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ. ప్రపంచ జనాభాలో చైనా వాటా 20 శాతం. కాబట్టి, తన దగ్గరే ఒక పెద్ద మార్కెట్టుంది. తన వస్తువులను ఎక్కడో అమ్ముకోవలసిన అవసరం చైనాకి లేదు. తన ప్రజల అవసరాలకు తగ్గట్టుగా అందుబాటు ధరలో తయారు చేయగలిగితే కన్స్యూమర్లు పెరుగుతారన్నది చైనా వ్యూహం.
‘మోడ్రన్’ లీడర్
డెంగ్ జియావో పింగ్ ‘మోడ్రన్ చైనాకి ఆర్కిటెక్ట్’గా పేరు తెచ్చుకున్నారు. చైనా ప్రస్తుతం ఎకానమీపరంగా ఇంత డెవలప్ అయిందంటే ఆయనే కారణం. పదవులు చేపట్టకపోయినా దేశంలో పవర్ఫుల్ లీడర్‌గా చక్రం తిప్పారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీలో రెండో తరం నేతల్లో ముఖ్యుడిగా నిలిచారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు. ప్రైవేట్ రంగంలో పోటీని ఎంకరేజ్ చేశారు. చైనా తిరుగులేని ఆర్థికశక్తిలా ఎదగటంలో డెంగ్ జియోవో పింగ్ చేసిన కృషి సామాన్యమైనది కాదు. దేశంలోని కోట్లాది మందికి క్వాలిటీ లైఫ్‌ని అందించిన గ్రేట్ పొలిటీషియన్‌గా ఆయన గురించి చెప్పుకుంటారు.
లైఫ్లాంగ్ ప్రెసిడెంట్
2013లో తొలిసారి చైనా ప్రెసిడెంట్ అయిన జిన్‌పింగ్ 2018లో రెండోసారి ఎన్నికయ్యారు. కొద్దికాలంలోనే బలమైన నేతగా ఎదిగారు. దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చటంలో కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయన కోసం దేశ రాజ్యాంగాన్నే మార్చేశారు. చైనా ప్రెసిడెంట్‌గా ఏ నాయకుడైనా రెండు సార్లు మాత్రమే పగ్గాలు చేపట్టాలనే కండిషన్1990ల నుంచి అమల్లో ఉంది. ఆ రూలు ప్రకారం జిన్‌పింగ్ 2023 వరకే పదవిలో ఉండాలి. అయితే.. ఆయన పర్మనెంట్ ప్రెసిడెంట్‌గా ఉండేందుకు చైనా పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించింది. దీంతో జిన్‌పింగ్ బతికున్నంతకాలం అధికారంలో కొనసాగుతారు.