నేనే చరిత్ర నాతోనే చరిత్ర

నేనే చరిత్ర నాతోనే చరిత్ర

గ్రేట్  వాల్ ఆఫ్  చైనా ప్రపంచంలోని అద్భుతాల్లో ఒకటి. ఈ గోడ ఎంత పెద్దగ ఉంటదంటే.. దాని మీద సైన్యం నడుచుకుంట పోవచ్చు. గుర్రపు సవారీలు చెయ్యొచ్చు. ఒక మహల్ కో, కోట చుట్టూనో కట్టింది కాదు.. ఏకంగా ఒక దేశానికే కట్టిన గోడ. ఏకంగా ఇరవై వేల కిలోమీటర్లపైన పొడవు ఉంటది. రాళ్లు, గుట్టలు, అడవుల నుంచి, నదులు, లోయల నుంచి కట్టిన్రు. 200 BC టైంలో.. అంటే క్రీస్తు పుట్టడానికి సుమారు 200 ఏండ్ల ముందు నిర్మించిన్రు. దీని వెనుక ఎంతో ఆసక్తికరమైన కథ ఉంది. తానే చరిత్ర అని, తనతోనే చరిత్ర అని భావించిన ఓ చక్రవర్తి వ్యవహరించిన తీరు ఉంది. అదేంటో తెలుసుకుందాం..

చైనా 250 BC టైంలో ఒకే దేశంగా లేకుండేది. చిన్న చిన్న జాగీర్లు, సంస్థానాలు, రాజ్యాలు, రాష్ట్రాలుగా ఉండేది. చిన్న చిన్న పాలకులు ఉండేది. అందరు ఒకరితో ఒకరు కొట్లాడుకునేది. ఇంగ్లిష్ ల దీన్ని ‘The times of the warring states of China’ అంటరు. అప్పుడు ఒక చిన్న ‘కిన్’ అనే సంస్థానానికి చెందిన దొర చనిపోతే.. ఆయన కొడుకు ‘ఇంగ్ జెన్’ చిన్న వయసులోనే రాజు అయిండు. కానీ మెల్లమెల్లగా పక్క జాగీర్లు, సంస్థానాల మీద దాడి చేసి ఆక్రమించుకున్నడు. రాజ్యం పెద్దగ అయితున్న కొద్దీ సైన్యాన్ని పెంచుకుంటూ పోయిండు. ఆ టైంలో కిన్ కాకుండా పెద్ద రాజ్యాలు, రాజులు కేవలం ఆరుగురే ఉండేది. ఒకరి తర్వాత ఒకరిగా ఆ ఆరుగురి మీద కూడా ఇంగ్​జెన్​ దాడి చేసి జాగీర్లను, ఆస్తులను ఆక్రమించుకున్నడు. మొత్తంగా ఇప్పుడున్న చైనా ప్రాంతం మొత్తాన్ని పాలించి ఒక్క దేశంగా చేసిండు. అన్ని రాజ్యాలు ఒక్కటై.. సామ్రాజ్యంగా తయారు చేసిండు. చైనా అనే పేరు కూడా ఇంగ్​జెన్​ వల్లనే వచ్చింది. ఆయన ఏలుతున్న రాజ్యం కిన్ ను చైనాలో చిన్​ అని పలుకుతరు. అదే చైనాగా మారింది.

లోకల్​ లెవెల్లో అధికారాలు తీసేసి..

కిన్​ పాలనా విధానాన్ని కూడా మార్చిండు. లీగలిజం అనే కొత్త పద్ధతి తెచ్చిండు. మొదట్లో రాజు ఒక సామ్రాజ్యాన్ని పాలిస్తుంటే.. కింద వివిధ ప్రాంతాలను చిన్న చిన్న సంస్థాన రాజులు, లోకల్ నాయకులు చూసుకునేవాళ్లు. కిన్​ లోకల్ నాయకుల దగ్గర ఉన్న అధికారం తీసేసి.. రాజు కింద జీతంతో పనిచేసే ఆఫీసర్లను పెట్టుకున్నడు. ఇది చరిత్ర. దీనికి అన్ని ఆధారాలు ఉన్నయి. లీగలిజం లాజిక్ ఏందంటే.. ‘ప్రజలకు, లోకల్ నాయకులకు మంచి ఏదో, చెడు ఏదో తెలియదు. ప్రజలను నమ్మద్దు, లోకల్ నాయకులను నమ్మద్దు. పాలన మొత్తం నా కింద ఉన్న ఆఫీసర్లతో చేస్తే.. సామ్రాజ్యంలో పాలన మంచిగ జరుగుతది’ అని
నమ్మిండు.

ప్రజలను కల్సుడు బంద్​ పెట్టిండు

చైనా దిగువన హిమాలయ పర్వతాలు.. చల్లటి మంచు గడ్డల ఎడారులు, మంగోలియా, సైబీరియా ఉంటయి. ఓ పక్కకు మొత్తం సముద్రాలు ఉంటయి. అంటే ఆ కాలంల ప్రజలు చైనాను దాటిపోలేరు. వాళ్లకు ప్రపంచం అంటేనే చైనా.. చైనా అంటేనే ప్రపంచం అన్నట్లుండేది. కిన్ షి హుయాంగ్  ఒక దేశం, ఒక సామ్రాజ్యానికి కాదు.. ప్రపంచానికే చక్రవర్తినని అనుకునేటోడు. ఆయనకు అడ్డు ఉన్న వాళ్లందరినీ ఆక్రమించుకున్నడు. ఎవర్నీ కలిసే అవసరం లేదనుకున్నడు. ప్రజలను కల్సుడు బందు చేసిండు. సొంత మంత్రులను, నాయకులను కూడా కల్సుడు కూడా ఆపేసిండు. ఆయన పాలసీలేవైనా కేవలం కొందరు దగ్గరోళ్లకు మాత్రమే తెలిసేది.

చావు లేని సమాధి కట్టిస్తమని..

తానే దేవుడిననుకున్న కిన్​ఆరోగ్యం కొద్దిరోజుల తరువాత దెబ్బతిన్నది. వెంటనే ఆయన అడ్వైజర్లు, ఆయన వాస్తు అడ్వైజర్లు, ఆయన డాక్టర్లు ఇట్ల అన్నరు.. ‘నువ్వు దేవుడివే కానీ నీ శరీరం కొంచం పాడైపోతోంది. అందుకే నువ్వు పాదరసం గోలీలు వేస్కోవాలె’ అని పాదరసం ట్యాబ్లెట్లు ఇచ్చుకుంట వచ్చిన్రు. పాదరసం ఎస్కుంటే మరణం లేని జీవితం ఉంటదని.. పాదరసానికి చిలుం పట్టదు, ఎల్లకాలం అట్లనే ఉంటదని.. అది వేసుకున్న మనిషి కూడా అట్లనే మరణం లేకుంట ఉంటడని చెప్పిన్రు. నిజానికి పాదరసం తీసుకుంటే మనిషి ఆరోగ్యం ఇంకా కరాబైతది. అడ్వైజర్లు చెప్పినట్టు పాదరసం వేసుకున్న కిన్​ చక్రవర్తి ఆరోగ్యం అట్లనే కరాబైంది. అప్పుడు ఆయన అడ్వైజర్లకు, వాస్తు శిల్పులకు, జ్యోతిష్యులకు, డాక్టర్లకు ఏం చెయ్యాల్నో తెల్వక.. ఇంకో కొత్త ఐడియా చేసిన్రు. ‘‘మీరు నిజంగనే దేవుడు.. దాంట్ల అనుమానమే లేదు, కానీ మీ శరీరమే గిట్ల ఉన్నది. అందుకే మీకు సావు లేని సమాధి ఒకటి కట్టియ్యాలే. అది ఒక బ్రహ్మాండమైన సమాధి, ఆ సమాధిలకు పోతే మీకు సావు ఉండదు.” అని చెప్పిన్రు. చక్రవర్తికి ఎట్లా సెక్యూరిటీ గార్డ్స్, కాన్వాయ్స్ (చక్రవర్తి టూర్ కి పోయినప్పుడు కిలోమీటర్ల కాన్వాయ్ ఉండేది) ఉన్నాయో.. అట్లా సమాధిల పది వేల మంది సైనికులను బొంద పెట్టిన్రు. ఆ సమాధి ఏకంగా 500 ఎకరాలు ఉంటది. ఈజిప్టు పిరమిడ్ల కంటే వెయ్యి రెట్లు పెద్దది. పాదరసం పారుతుంటే జీవితం ఇస్తదని నమ్మి.. సమాధి లోపట పాదరసం కాల్వలు చేసిన్రు. అయితే కొన్ని రోజుల తర్వాత కిన్​ నిజంగానే చచ్చిపోయిండు.

రహస్యంగా దాచిపెట్టి..

కిన్​ చనిపోయినప్పుడు ఆయన రాజధానిల లేకుండే. గ్రామీణ ప్రాంతంల కట్టించిన భవనంల ఉండె. ఆయన చావును దేశం మొత్తం రహస్యంగా పెట్టిన్రు. కిన్​ బాడీని సమాధిలో పెట్టి. ఆ సమాధి కట్టిన వాళ్లను కూడా చంపేసిన్రు. తర్వాత కొంత కాలానికి కిన్​ చనిపోయిండని చెప్పి.. ఆయన కొడుకు కిన్ ఆర్ షిని రాజును చేసిన్రు. కిన్​ఆర్​షి రాజు కాంగనే ఎంతో మంది సొంత మనుషులు ఎదురు తిరిగిన్రు. సంస్థానాలు, లోకల్ నాయకులు కూడా మర్లవడ్డరు. ఇట్ల కొడుకు పాలనలో మొత్తం సామ్రాజ్యం పోగొట్టుకున్నరు. ఇది కిన్​షి హూయంగ్’ చరిత్ర. ఇది కిన్ షి హ్యూయాంగ్ డి చరిత్ర. ఆయన గురించి చాలా మందికి తెల్వకున్నా.. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అయితే ఇంకా ఉంది. అది ఎందుకు కట్టిండోగని ప్రజలకు ఐతే ఎందుకూ ఉపయోగపడలేదు. ఇప్పుడు ప్రపంచ
వింతగా మారింది..

మనుషులకు విలువ ఇవ్వడని..

కిన్​ అంత పెద్ద చక్రవర్తి అయినా.. ఆయన మనసులో ఏముంది, ఆలోచన ఏంది అన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నయి. కిన్​ దగ్గర ఉన్నోళ్లు, ఆయనకు ఇష్టం ఉన్నోళ్లు ఆయన ఒక గొప్ప చక్రవర్తి అనుకునేది. కానీ అప్పటి ప్రజలకు మాత్రం కిన్​ మీద మంచి అభిప్రాయం లేదు. ‘మనుషులకు విలువ ఇవ్వడు, ప్రజలకు నష్టమైనా అనుకున్నది చేస్తడు.’ అనేవాళ్లు. కిన్​గురించి ఒక చైనాకు చెందిన చరిత్రకారుడు సైమా క్విన్  ఇట్ల రాసిండు..‘‘He is someone who in difficulty will fall at feet and when in power without mercy he will eat you alive.. అంటే ఇబ్బందిలో ఉన్నప్పుడు కాళ్ల మీద పడుతడు, అదే అధికారం ఉన్నప్పుడు నిన్ను నిండా మింగేస్తడు’’ అని చెప్పిండు. అసలు ఈ కథ ఈ రోజు ఎందుకు చెప్పుకొంటున్నమంటే.. కిన్​ పుట్టినరోజు ఫిబ్రవరి 18, 259 BC. ఇయ్యాల ఆయన జన్మదినం.

పేరులోనే ‘చక్రవర్తి’ని చేర్చుకున్నడు

మొత్తం చైనా సామ్రాజ్యాన్ని ఏలేటప్పుడు మొదలు ఆయన పేరు మార్చుకున్నడు. ‘ఇంగ్ జెన్’ నుండి ‘కిన్ షి హుయాంగ్’.. కిన్ అంటే చైనా, షి అంటే మొట్టమొదటి, హూయంగ్ అంటే గొప్ప చక్రవర్తి. మొట్టమొదటి చైనా చక్రవర్తి అని ఆయన పేరు ఆయననే పెట్టుకున్నడు. కిన్ షి హూయంగ్ ఈ సామ్రాజ్యాన్ని పాలించుడు మొదలు పెట్టినంక చేసిన మొదటి పని ఈ పెద్ద సామ్రాజ్యాన్ని ఆరు ప్రాంతాలుగా చేసిండు. ప్రతీ ప్రాంతానికి ఆరు జిల్లాలు అంటే.. మొత్తం ముప్పై ఆరు కొత్త జిల్లాలు చేసిండు. ముప్పై ఆరు ఎందుకు చేసిండంటే.. 6×6=36. ఆయన లక్కీ నంబర్ కూడా 6.

చరిత్ర నాతోనే మొదలైతదని..

గ్రేట్​వాల్​ ప్రాజెక్టు కట్టడం పూర్తయినంక.. ఎటు చూసినా మైళ్ల దూరం కనబడ్డది. కిన్​ దాని మీదికి ఎక్కి ఇట్ల అంటడు.. ‘‘చైనాను సృష్టించిందే నేను, నాకంటే ముందు చైనానే లేకుండే. చరిత్ర నాతోనే మొదలు కావలె. నాకంటే ముందు వేరే చరిత్రనే ఉండొద్దు.’’ అని అందరు రచయితలను, కళాకారులను చంపేసిండు. పుస్తకాలను, పెయింటింగ్స్ ను కాల్చేసిండు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కింద కొంత మంది రచయితలు, కళాకారులను, వాళ్ల పుస్తకాలను బొంద పెట్టిండు. ఎందుకంటే కిన్​ మొండి పట్టు.. ‘ఏదేమైనా సరే అనుకున్నది కావాలె. నేను గొప్పోన్ని, చరిత్ర నాతోనే మొదలు కావాలె.’ అన్నడు. తనకంటే ముందున్న చరిత్రను నాశనం చేసిండు. పెద్ద పెద్ద కట్టడాలను కూలగొట్టిండు. ఆర్థికంగా సామ్రాజ్యం కూలిపోతుంటే ఒక ఆలోచన వచ్చింది ఆయనకు.. రెవెన్యూ సిస్టం ను మార్చేసిండు. ల్యాండ్ రికార్డ్ సిస్టం కూడా మార్చేసిండు. ఎన్నో ఇబ్బందులు మొదలైనయ్. అదే కాక భూములు లోకల్ వాళ్ల దగ్గర తీసుకొని.. నాన్ లోకల్ వాళ్లకు ఇచ్చుడు మొదలుపెట్టిండు. వ్యవసాయ రంగంల కూడా ఎన్నో మార్పులు తెచ్చిండు. రైతులు ఏ పంట పెట్టాలె, ఎప్పుడు పెట్టాలె ఇవన్నీ కూడా ప్రభుత్వమే చెప్పుడు మొదలైంది. అదే కాదు.. పొలం సైజు ఎంత ఉండాలె, దాని షేప్ ఎట్ల ఉండాలె అన్నది కూడా ప్రభుత్వమే చెప్పుడు మొదలైంది. సామాన్య ప్రజలు, రైతులు ఎంతగానో బాధ పడ్డరు. చక్రవర్తి చెప్పినవి పండిస్తే ధరలు రాకుండె.  అమ్ముడుపోక వోతుండే. ఇట్లా ఎంతో నష్టపోయిన్రు.

వాస్తు మీద నమ్మకం ఎక్కువ

కిన్​కు ‘ఫెంగ్​ షుయ్’ మీద అంటే వాస్తు మీద చానా నమ్మకం ఉండేది. ఆయనకు జ్యోతిష్యం మీద, లక్కీ నంబర్, అన్ లక్కీ నంబర్  వంటి చాలా నమ్మకాలు ఉండేవి. రాజ్యంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఒక దిక్కు అయితుంటే.. ఇంకో దిక్కు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుడు మొదలువెట్టిండు. ఆ భవనాలల్ల పెద్ద ఆడిటోరియంలు ఉన్నయి. అవన్నీ కూడా ఫెంగ్​ షుయ్ అంటే వాస్తు ప్రకారం కట్టిండు. పెద్ద పరిపాలనా భవనాలు కూడా ఫెంగ్​ షుయ్ ప్రకారమే కట్టించడం మొదలుపెట్టిండు. అదే టైంల తన కంటే ముందటి చరిత్ర ఉండొద్దను కుంట.. పాత భవనాలు, హెరిటేజ్ బిల్డింగ్​లు కూలగొట్టించిండు.

అడ్డగోలుగ ప్రాజెక్టులు మొదలుపెట్టి..

పెద్ద పెద్ద ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు మొదలుపెట్టిండు. సాగునీళ్లు, రవాణా కోసం నిర్మాణాలు చేపట్టిండు. ఆ తర్వాత రెండు పెద్ద నదులను కలిపిండు. అప్పట్లోనే యాంగ్  నదిని లీ అనే నదితో కెనాల్ ల ద్వారా కలిపిండు. ఇగ 220 BC ఏడాదిల ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టుడు మొదలుపెట్టిండు. అప్పుడాయన వయసు 27 ఏండ్లే. ఆ ప్రాజెక్టు కట్టడానికి వేల కోట్లలో సొమ్ము, లక్షల మంది లేబర్ కావాలె. జనం నుంచి వసూలు చేసిన పన్నుల పైసలు, దేశంలోని ప్రజలను వాడుకున్నడు. ప్రజల శ్రమ, చెమట, రక్తంతోని గ్రేట్​ వాల్​ను కట్టించిండు. అడ్డగోలుగ పైసలు, జనం శ్రమ వృథా అయినయి. ఇట్లా ఇష్టమొచ్చిన ప్రాజెక్టులు మొదలుపెట్టడంతో.. ధనవంతమైన సామ్రాజ్యం ఆర్థికంగా కూలిపోయింది. ఆ టైంలనే కరువు వచ్చింది. ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డరు. అయినా సరే ప్రాజెక్టు కచ్చితంగా పూర్తి చెయ్యాలని ఇంకా వేగంగా పని చేయించిండు.

రాజధాని బయటనే ఉండుకుంట..

ప్రజలను, ప్రభుత్వంలోని వాళ్లను కలుసుడు తగ్గినంక.. అసలు రాజధానిల ఉండుడు కూడా బంద్ చేసిండు. రాజధాని బయట ఒక భవనంలో ఉండుడు మొదలుపెట్టిండు. ఇట్లయినంక ఓ నిర్ణయానికి వచ్చిండు. ‘‘ఒక మనిషి వెయ్యి జన్మలల్ల సాధించలేనిది నేను ఇంత సాధించిన అంటే నేను సాధారణ ఆత్మను కాను. నేను దేవుడి లాంటి ఒక మహాత్ముడిని. నేను తప్పనిసరిగా దేవుడ్ని అయ్యి ఉండాలి” అని నిర్ణయానికి వచ్చిండు. మళ్లొక్కసారి పేరు మార్చుకున్నడు. ‘కిన్ షి హుయాంగ్’ పేరును ‘కిన్ షి హూయంగ్ డి’ అని పెట్టుకున్నడు. డి అంటే చైనీస్ ల దేవుడు అని అర్థం. అంటే తానే చైనాకు తొలి చక్రవర్తిని, దేవుడ్ని అని ప్రకటించుకున్నడు. అప్పటిసంది దేవుడ్ని అన్న ఆలోచనతోనే ఉన్నడు.

– కొండా విశ్వేశ్వర్​ రెడ్డి, మాజీ ఎంపీ