
China Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి డ్రాగన్ దేశం చైనాకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. ముందు నుంచే సుంకాలను వ్యతిరేకిస్తూ వచ్చిన చైనా తమపై సుంకాలు ప్రకటిస్తే ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. అయితే నిన్న ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలను ప్రకటిస్తున్న క్రమంలో చైనాపై 34 శాతం సుంకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ముందే అమెరికా చైనా వస్తువులపై 20 శాతం సుంకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
చైనా నుంచి దిగుమతులపై అదనంగా విధించిన అదే 34 శాతం పన్నును ప్రస్తుతం డ్రాగన్ దేశం తిరిగి అమెరికాపై సుంకాలుగా ప్రకటించటం గమనార్హం. ఇది ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరుదేశాల నాయకులు వెనక్కి తగ్గకపోవటంతో ప్రస్తుతం పరిస్థితులు మరింత తీవ్రతరం అవుతూ దిగజారుతున్నాయి. ఖచ్చితంగా ఈ ప్రభావం అమెరికా ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సుంకాలను ప్రకటించిన చైనా వాటిని సమర్థించుకుంది. ప్రస్తుతం ప్రపంచ పెద్దన్నగా ఉన్న అమెరికా అనుసరిస్తున్న ఈ విధానం అంతర్జాతీయ వాణిజ్య నియమాలకు అనుగుణంగా లేదని ప్రతీకార సుంకాలపై చైనా స్టేట్ కౌన్సిల్ టారిఫ్ కమిషన్ కామెంట్ చేసింది. ట్రంప్ చర్యలు చైనా చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయంది. యూఎస్ అవలంభిస్తున్న ఏకపక్ష బెదిరింపు పద్ధతిని చైనా సహించబోదని పేర్కొంది.
వాస్తవానికి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చైనాపై ట్రంప్ సర్కార్ రెండు విడతలుగా 10 శాతం చొప్పున సుంకాలను విధించింది. నిన్న ప్రకటించిన సుంకాలతో మెుత్తం చైనాపై వైట్ హౌస్ 54 శాతం టారిఫ్స్ అమలు చేస్తోంది. దీని ప్రకారం చైనా నుంచి అమెరికాలోకి వచ్చే వస్తువులు 54 శాతం సుంకాలకు లోబడి ఉంటాయి. వాస్తవానికి ఇంత భారీ సుంకాలు అమెరికాలో చైనా వస్తువులను విక్రయించటాన్ని కష్టతరంగా మార్చుతుంది.
తాజా ప్రతీకార చర్యల్లో చైనా అమెరికాకు చెందిన 11 డ్రోన్ తయారీ సంస్థల పేర్లను నమ్మదగని జాబితాలోకి చేర్చింది. అలాగే 16 అమెరికా కంపెనీలపై ఎగుమతి నియంత్రణలను ప్రకటించింది. అలాగే అమెరికా, ఇండియా నుంచి చైనాలోకి దిగుమతి చేసుకున్న మెడికల్ CT ఎక్స్-రే ట్యూబ్‌లపై వాణిజ్య మంత్రిత్వ శాఖ యాంటీ-డంపింగ్ దర్యాప్తులను ప్రకటించింది. ట్రంప్ చర్యలతో ప్రపంచ వ్యాప్తంగా ఆసియా దేశాలతో చైనా వ్యాపారం దెబ్బతింటోంది.