
బీజింగ్: చైనా, అమెరికా మధ్య ప్రతీకార సుంకాల యుద్ధం మరింత ముదిరింది. చైనాపై అమెరికా 104 శాతం ప్రతీకార సుంకాలు విధించడంపై డ్రాగన్ దేశం కూడా అంతే ధీటుగా బదులిచ్చింది. అమెరికా వస్తువులపై 84 శాతం ప్రతీకార సుంకాలను చైనా తాజాగా విధించింది. ఏప్రిల్ 10 నుంచి అదనంగా విధించిన ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక శాఖ వెల్లడించింది.
చైనాపై 50% అదనపు టారిఫ్‌లు వేస్తామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బెదిరించడంపై డ్రాగన్ దేశం మండిపడిన సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం బెదిరింపులకు భయపడబోమని స్పష్టం చేసింది. తమను బ్లాక్‌మెయిల్ చేస్తున్నదని, కానీ తాము లొంగబోమని తేల్చి చెప్పింది. తమ దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకునేందుకు తుది వరకూ పోరాడతామని తెలిపింది.
చైనాపై 20 శాతం వసూలు చేస్తున్న టారిఫ్లకు ట్రంప్ ఇటీవల 34 శాతం ప్రతీకార టారిఫ్ విధించారు. దీనికి కౌంటర్‌గా చైనా కూడా 34% ప్రతీకార సుంకాలు విధించింది. దీనిపై మండిపడ్డ ట్రంప్.. చైనాపై అదనంగా మరో 50% శాతం టారిఫ్‌లు విధించారు. దీంతో.. చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై మొత్తం 104% పన్ను పడింది.
Also Read:-ఆందోళనలో 3 లక్షల భారత స్టూడెంట్స్.. వర్క్ వీసాలకు ట్రంప్ గుడ్ బై..
‘‘అమెరికా తప్పు మీద తప్పు చేస్తున్నది. మరోసారి తన బ్లాక్‌మెయిలింగ్ బుద్ధిని బయటపెట్టుకున్నది. టారిఫ్‌ల విషయంలో అమెరికా ఇలాగే పట్టుబడితే.. మేం చివరి వరకు పోరాడతాం. మాపై పన్నులు విధించేందుకు అమెరికా చర్యలు తీసుకుంటే.. మా దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకునేందుకు మేం ప్రతీకార సుంకాలు విధించేందుకు చర్యలు తీసుకుంటం” అని చైనా వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. చైనాపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు ఏకపక్షమని మండిపడింది. తమ దేశ సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తాము ప్రతీకార సుంకాలు విధించామని స్పష్టం చేసింది.