అమెరికా, చైనా టారిఫ్​ వార్..​ వెనక్కి తగ్గమంటున్న ఇరు దేశాలు

అమెరికా, చైనా టారిఫ్​ వార్..​ వెనక్కి తగ్గమంటున్న ఇరు దేశాలు

   

  • అగ్రరాజ్యం బెదిరింపులకు భయపడేదిలేదన్న చైనా
  • ట్రంప్ తప్పు మీద తప్పు చేస్తున్నరని మండిపాటు
  • బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెయిలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పాల్పడుతున్నరని ఆగ్రహం

బీజింగ్/వాషింగ్టన్: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతున్నది. టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల విషయంలో అమెరికాతో చైనా ఢీ అంటే ఢీ అంటున్నది. చైనాపై 50% అదనపు టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వేస్తామని అమెరికా ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డొనాల్డ్ ట్రంప్ బెదిరించడంపై డ్రాగన్ దేశం మండిపడింది. అగ్రరాజ్యం బెదిరింపులకు భయపడబోమని స్పష్టంచేసింది. తమను బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నదని, కానీ తాము లొంగబోమని తేల్చి చెప్పింది. తమ దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకునేందుకు తుది వరకూ పోరాడతామని తెలిపింది. చైనాపై 20 శాతం వసూలు చేస్తున్న టారిఫ్​లకు ట్రంప్ ఇటీవల 34 శాతం ప్రతీకార టారిఫ్ విధించారు. దీనికి కౌంటర్​గా చైనా కూడా 34% ప్రతీకార సుంకాలు విధించింది. దీనిపై మండిపడ్డ ట్రంప్​.. చైనాపై అదనంగా మరో 50% శాతం టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు విధిస్తామని హెచ్చరించారు. ఇది బుధవారం నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఇది అమల్లోకి వస్తే.. చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై మొత్తం 104% పన్ను పడుతుంది.

చైనా ఏమన్నదంటే?  

అదనంగా మరో 50% టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధిస్తామని అమెరికా బెదిరించగా, చైనా అంతే దీటుగా స్పందించింది. తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని, చివరి వరకు పోరాడతామని తేల్చి చెప్పింది. అమెరికా తమను బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నదని చైనా వాణిజ్య శాఖ మండిపడింది. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాకు తలవంచబోమని స్పష్టం చేసింది. ‘‘అమెరికా తప్పు మీద తప్పు చేస్తున్నది. మరోసారి తన బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెయిలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుద్ధిని బయటపెట్టుకున్నది. టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల విషయంలో అమెరికా ఇలాగే పట్టుబడితే.. మేం చివరి వరకు పోరాడతాం. మాపై పన్నులు విధించేందుకు అమెరికా చర్యలు తీసుకుంటే.. మా దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకునేందుకు మేం ప్రతీకార సుంకాలు విధించేందుకు చర్యలు తీసుకుంటం” అని చైనా వాణిజ్య శాఖ మంగళవారం ప్రకటనలో పేర్కొంది. చైనాపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు ఏకపక్షమని మండిపడింది. తమ  దేశ సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తాము ప్రతీకార సుంకాలు విధించామని స్పష్టం చేసింది. 

అమెరికా చర్చలను కోరుకోవట్లేదు.. 

అమెరికా టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై చైనా విదేశాంగ శాఖ కూడా స్పందించింది. తమ దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ‘‘అమెరికా చర్యలను బట్టి, ఆ దేశం చర్చలను కోరుకోవట్లేదని అర్థమవుతున్నది. అమెరికా నిజంగా చర్చలను కోరుకుంటే సమానత్వం, గౌరవం, పరస్పర ప్రయోజనాల వైఖరిని ప్రదర్శించాలి. చైనాతో పాటు ప్రపంచ దేశాల ప్రయోజనాలను పట్టించుకోకుండా టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల విషయంలో అమెరికా ఇలాగే ముందుకెళ్తే.. మేం తుది వరకూ పోరాడతాం” అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు.

ఎలాన్ మస్క్ చెప్పినా వినని ట్రంప్..

చైనాపై అదనంగా విధించిన టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను రద్దు చేయాలని డోజ్ చీఫ్ ఎలన్ మస్క్ కోరినప్పటికీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వినలేదని తెలుస్తున్నది. చైనాపై అదనంగా 50 శాతం టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు విధిస్తానని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనను మస్క్ స్వయంగా కలిసి, ఆ విషయంలో వెనక్కి తగ్గాలని సూచించినట్టు ‘వాషింగ్టన్ పోస్ట్’ పేర్కొంది. అయితే అందుకు ట్రంప్ నిరాకరించినట్టు తెలిపింది.