భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ చైనా దూసుకుపోతోంది. తమ దేశానికంటూ ఒక ప్రత్యేక స్పేస్ స్టేషన్ ఉండాలని ఉవ్విళ్లూరుతున్న డ్రాగన్.. దాని నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ‘టియాన్ గాంగ్’ (టియాన్ హీ) పేరుతో నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు తాజాగా ముగ్గురు వ్యోమగాములను అక్కడికి పంపించింది. ‘లాంగ్ మార్చ్ 2ఎఫ్’ రాకెట్ ద్వారా ముగ్గురు వ్యోమ గాములతో కూడిన ‘షెన్ ఝౌ 14’ వ్యోమనౌకను గగనతల కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమాన్ని చైనా మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
6 నెలల పాటు..
ఇప్పటికే టియాన్ గాంగ్ స్పేస్ స్టేషన్ కక్ష్యలో ఉన్న మరో ముగ్గురు వ్యోమగాములను ఈ ముగ్గురు వెళ్లి కలుసుకుంటారు. 6 నెలల పాటు అంతరిక్ష కేంద్రం నిర్మాణ పనుల్లో నిమగ్నమవుతారు. ‘వెంతియాన్’, ‘మెంగ్ తియాన్’ అనే రెండు లేబొరేటరీ మాడ్యూల్స్ ఏర్పాటులో వీరు కీలక పాత్ర పోషించనున్నారు. లేబొరేటరీ మాడ్యూల్స్ అంటే.. వ్యోమగాములు నివసించే గృహాల సముదాయం. ‘తియాన్షె’ పేరుతో మొదటి మాడ్యూల్ నిర్మాణం ఇప్పటికే పూర్తవడంతో దాన్ని ప్రారంభించారు. జూలై లో ‘వెంతియాన్’ మాడ్యూల్ ను, అక్టోబరులో ‘మెంగ్ తియాన్’ మాడ్యూల్ ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. గతేడాది మొదలైన ఈ స్పేస్ స్టేషన్ నిర్మాణ పనులను.. ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలనే కృత నిశ్చయంతో చైనా ఉంది. ‘టియాన్ గాంగ్’ స్పేస్ స్టేషన్ 6 బెడ్ రూమ్ల ఇంటి కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది.
మరిన్ని వార్తలు..