- బలగాల ఉపసంహరణ ఒప్పందానికి డ్రాగన్ కంట్రీ తూట్లు
న్యూఢిల్లీ: భారత్ ను చైనా మళ్లీ రెచ్చగొడుతున్నది. ఈస్టర్న్ లద్దాఖ్ లోని ఎత్తైన ప్రాంతంలో చైనా ఆర్మీ సైనిక విన్యాసాలు నిర్వహించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఆధ్వర్యంలో ఓ రెజిమెంట్ ఈ డ్రిల్స్ ప్రదర్శించింది. ఇండియన్ ఆర్మీ ఫౌండేషన్ డే (జనవరి 15) కు రెండు రోజుల ముందు సైనిక విన్యాసాలు ప్రదర్శించి భారత్ ను మరోసారి చైనా కవ్వించింది. బలగాల ఉపసంహణ ఒప్పందాన్ని మళ్లీ ఉల్లంఘించింది.
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు నిరుడు అక్టోబరులో భారత్, చైనా.. బలగాల ఉపసంహరణ ఒప్పందం చివరి దశలో ఉన్న సమయంలోనే పీఎల్ఏ సైనిక విన్యాసాలు జరిపింది. ఆధునిక మిలిటరీ టెక్నాలజీ, ఆల్ టెరైన్ వెహికల్స్, డ్రోన్లు, మానవరహిత సిస్టమ్ లను వాడి చైనా ఆర్మీ సైనిక విన్యాసాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఎత్తైన ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు చైనా ఆర్మీ ఈ విన్యాసాలు నిర్వహించినట్లు సమాచారం. కాగా.. 2020లో ఈస్టర్న్ లద్దాఖ్ లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగాయి. ఈ కొట్లాటలో బిహార్ రెజిమెంట్ లోని 17వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఆ ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించాలని రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా దెప్ సాంగ్, దెమ్ చోక్ వంటి సున్నిత ప్రాంతాల్లో మాత్రమే గస్తీ నిర్వహించాలని భారత్, చైనా అంగీకరించాయి.
ఏం జరిగినా ఎదుర్కొంటం: ఆర్మీ చీఫ్
ఈస్టర్న్ లద్దాఖ్ లో చైనా సైనిక విన్యాసాలపై భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ స్పందించారు. ఎల్ఏసీ వద్ద పరిస్థితి స్థిరంగానే ఉందని ఆయన చెప్పారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఇండియా, చైనా మిలిటరీల మధ్య నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. దెస్ పాంగ్, దెమ్ చోక్ లో ఎప్పటికపుడు గస్తీ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.