
ప్రపంచంలోనే మొట్టమొదటి థోరియం ఆధారిత అణు రియాక్టర్‌ను చైనా విజయవంతంగాప్రారంభించింది. గన్సు ప్రావిన్స్‌లోని వుయ్ నగరంలోని మారుమూల గోబీ ఎడారిలో ఈ పయనీర్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేశారు. ముదురుతున్న జియోగ్రాఫికల్ పొలిటికల్ వివాదాలు, అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలమధ్య ప్రపంచ అణు ఆవిష్కరణలో చైనా సాహసోపేతమైన ముందుడుగు ఇది.
2 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంతో 2023 అక్టోబర్ లో థోరియం మోల్టెన్ సాల్ట్ రియాక్టర్ (TMSR) ను చైనా రూపొందించింది. 2011 నుంచి దాదాపు 444 మిలియన్ల డాలర్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు. థోరియం ఆధారిత ఈ అణుశక్తి ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదటిది.
చైనా ఇక్కడితో ఆగకుండా 2023నాటికి 10 మెగావాట్ల థోరియం రియాక్టర్ ను విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. సాంప్రదాయ యురేనియం ఇంధనానికి ప్రత్యామ్నాయంగా ఫ్యుయెల్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో చైనా చాలా కాలంగా ప్రయత్నిస్తోంది.
భారత్ కూడా..
అయితే విస్తరణలో ముందున్నప్పటికీ భారత్ కూడా దశాబ్దాలుగా థోరియం పరిశోధనలో ముందంజలో ఉంది. థోరియం నిల్వలలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్దది. ప్రపంచ థోరియం నిల్వలలో 25 శాతం భారత్ లోనే ఉన్నాయి. డాక్టర్ హోమి భాభా ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడిన దేశ అణు రోడ్‌మ్యాప్, ముఖ్యంగా భారతదేశం పరిమితమైన యురేనియం నిల్వలను దృష్టిలో ఉంచుకుని, థోరియంను ప్రధాన శక్తి వనరుగా ఉపయోగించుకోవాలని చాలా కాలంగా లక్ష్యంగా పెట్టుకుంది.
థోరియం పరిశోధన 1950లలో మూడు దశల అణు కార్యక్రమంతో ప్రారంభమైంది. చివరి దశ థోరియం-ఇంధన రియాక్టర్లపై దృష్టి పెడుతుంది. భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) వంటి సంస్థల ద్వారా దశాబ్దాలుగా నిర్మించబడిన లోతైన సాంకేతిక నైపుణ్యంలో భారతదేశం బలంగా ఉంది.
జనవరి 2025 నాటికి భారతదేశ అణు విద్యుత్ సామర్థ్యం 8,180 మెగావాట్లుగా ఉంది. 2032 నాటికి దీనిని 22,480 మెగావాట్లకు పెంచాలని ప్రణాళికలు ఉన్నాయి.
ప్రధాన కొత్త ప్రాజెక్టులు:
- కక్రాపర్ వద్ద స్వదేశీ 700 MWe PHWRలు (KAPS-3 & 4)
- అమెరికా సహకారంతో కొవ్వాడలో 6 x 1208 మెగావాట్ల ప్లాంట్
- NPCIL,NTPC మధ్య అశ్విని JV ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోని మహి-బన్స్వారా ప్రాజెక్ట్
భారతదేశం కూడా చైనా మాదిరిగానే ఉప్పు రియాక్టర్లను అన్వేషిస్తోంది. రాబోయే దశాబ్దంలో థోరియం విస్తరణ లక్ష్యంగా BARC పరిశోధన ,అభివృద్ధి ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తుంది.