
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య యుద్ధం ముదురుతుండడంతో చైనా ఇండియా వైపు చూస్తోంది. వాణిజ్యాన్ని పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది. కానీ, చైనాతో ఇండియా వాణిజ్య లోటు (దిగుమతులు మైనస్ ఎగుమతులు) 100 బిలియన్ డాలర్ల (రూ.8.60 లక్షల కోట్ల) పైనే ఉంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం బలోపేతం కావడంలో ఇది అడ్డంకిగా మారింది. చైనా, యూఎస్ మధ్య 2024 లో 582 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరగగా, అమెరికా వాణిజ్య లోటు 295 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనిని తగ్గించేందుకు డొనాల్డ్ ట్రంప్ చైనీస్ ప్రొడక్ట్‌లపై 145 శాతం టారిఫ్‌లను వేస్తామని ప్రకటించారు. ఇండియాతో బంధాన్ని బలోపేతం చేసుకోవాలంటే వాణిజ్య లోటు సమస్యను చైనా పరిష్కరించాల్సి ఉంటుందని ఎనలిస్టులు భావిస్తున్నారు.
ఇందులో భాగంగా ఇండియా ప్రొడక్ట్‌లపై సుంకాలను తగ్గించాలని చైనా చూస్తోందని తెలిపారు. అంతేకాకుండా టారిఫ్ యేతర అడ్డంకులను కూడా తొలగించి, ఇండియా నుంచి దిగుమతులను పెంచుకోవాలని ప్లాన్ చేస్తోందని పేర్కొన్నారు. ఇండియన్ ప్రొడక్ట్‌ల దిగుమతులను పెంచుకోవడానికి, ఇండియన్ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడానికి సుముఖంగా ఉన్నామని చైనా రాయబారి జు ఫీహాంగ్ ట్రంప్ సుంకాల ప్రకటనకు ముందు పేర్కొనడం గమనార్హం. కానీ, బైలేటరల్ ట్రేడ్‌లో భాగంగా చైనా ప్రొడక్ట్‌లపై కూడా ఇండియా దిగుమతి సుంకాలను తగ్గించాల్సి ఉంటుంది. అలానే టారిఫ్ యేతర అడ్డంకులను తొలగించాల్సి ఉంటుంది.
సుంకాలను తగ్గిస్తే చైనా నుంచి దిగుమతులు భారీగా పెరుగుతాయని ఎనలిస్టులు చెబుతున్నారు. బైలేటరల్ ట్రేడ్‌లో చైనా ఎక్కువగా లాభపడుతుందని తెలిపారు. ఆసియాన్ బ్లాక్ వంటి వివిధ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌టీఏ) ను ఇండియా కుదుర్చుకుంది. చైనీస్ గూడ్స్ ఈ దేశాల ద్వారా ఇండియాలోకి వస్తున్నాయి. చైనా–ఇండియా మధ్య బైలేటరల్ ట్రేడ్ డీల్ కుదిరితే మరిన్ని ప్రొడక్ట్‌లు ఇండియాలోకి వస్తాయి. ప్రస్తుతం చైనా వద్ద ట్రిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు ఉంది. యూరోపియన్ యూనియన్, అమెరికా, జపాన్, ఇండియా వంటి దేశాలు చైనా వలన నష్టపోతున్నాయి. తక్కువ రేట్లకే ప్రొడక్ట్‌లను అమ్మడం, రూల్స్‌కు విరుద్ధంగా వ్యాపారం జరపడంతో చైనా వాణిజ్య మిగులు దూసుకుపోతోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.
చైనాతో వాణిజ్య లోటు పెరుగుతూనే ఉంది..
చైనాతో ఇండియా వాణిజ్య లోటు గత కొన్ని సంవత్సరాల నుంచి పెరుగుతూనే ఉంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ (డీజీసీఐఎస్) డేటా ప్రకారం, 2019–-20లో చైనాతో ఇండియా వాణిజ్య లోటు 48.65 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యింది. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో 2020--–21లో 44 బిలియన్ డాలర్లకు తగ్గింది. కానీ, 2021–-22లో 73.31 బిలియన్ డాలర్లకు, 2022–-23లో 83.2 బిలియన్ డాలర్లకు, 2023–-24లో 85.08 బిలియన్ డాలర్లకు ఎగిసింది. 2024–25 లో 100 బిలియన్ డాలర్లను టచ్ చేస్తుందని అంచనా. భారీ వాణిజ్య లోటుతో పాటు , ఇరు దేశాల మధ్య వ్యాపార ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడం కూడా సమస్యగానే ఉంది.
2024–-25లోని మొదటి 11 నెలల్లో ఇండియా నుంచి చైనాకు ఎగుమతులు 15.66 శాతం తగ్గి 12.74 బిలియన్ డాలర్లకు పడిపోగా, ఇదే టైమ్‌లో చైనా నుంచి ఇండియాకు దిగుమతులు10.41 శాతం పెరిగి 103.78 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. ఫలితంగా ఇండియా 91 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును ఎదుర్కొంటోంది. 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు 100 బిలియన్ డాలర్లను దాటొచ్చని అంచనా.
చైనా నుంచి ఎక్కువగా ఎలక్ట్రానిక్ భాగాలు, కంప్యూటర్ హార్డ్‌వేర్, టెలికాం పరికరాలు, డెయిరీ మెషినరీ, ఆర్గానిక్ కెమికల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రికల్ మెషిన్స్, ప్లాస్టిక్ ముడి పదార్థాలు, ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్‌ను ఇండియా దిగుమతి చేసుకుంటోంది. చైనాకు ఇనుము ఖనిజం, సముద్ర ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు, ఆర్గానిక్ కెమికల్స్, మసాలాలు, ఆముదం నూనె, టెలికాం ఎక్విప్‌మెంట్‌ను ఎక్కువగా ఎగుమతి చేస్తోంది.