ఏదైనా ఏరియాలో డామినేషన్ చేయాలంటే అక్కడి లీడర్లను దారిలోకి తెచ్చుకోవాలి. ఒకరిద్దరు ఎదురు తిరిగితే వాళ్లతో నేరుగా పెట్టుకోకూడదు. పక్కనున్నోళ్లను మచ్చిక చేసుకోవాలి. నలుగురినీ వెంటేసుకొని వాళ్ల పనిపట్టాలి. ఆసియాలో ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్న చైనా ఈ ఎత్తుగడే అనుసరిస్తోంది. అందుకే బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును పట్టించుకోని ఇండియాని ఒంటరి చేయటానికి పాకిస్తాన్, శ్రీలంక, భూటాన్ మాదిరిగానే నేపాల్‌ని కూడా దగ్గరికి తీస్తోంది. బీఆర్ఐలో భాగంగా రైల్వే లైన్ నిర్మాణానికి ఆ దేశాన్ని మోటివేట్ చేసింది.
ఇండియాని టార్గెట్ చేస్తూ చైనా ప్రెస్టేజీగా ప్రారంభించిన ప్రాజెక్టు ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’(బీఆర్ఐ). ఇందులో భాగంగా దక్షిణ టిబెట్‌లోని కెరుంగ్ సిటీ నుంచి నేపాల్ రాజధాని కాఠ్మండు వరకు రైల్వే లైన్ వేస్తారు. రసువా జిల్లా మీదుగా నేపాల్‌లోకి వస్తే అక్కడి నుంచి ఇండియాలోకి రావటం ఈజీ అని భావించి ఈ స్కెచ్ గీసింది. నేపాల్‌లో రైల్వే లైన్ నిర్మాణానికి వీలుందా లేదా తెలుసుకోవటానికి గతేడాది స్టడీ చేసింది. అయితే ఇది చాలా హార్డ్ ప్రాజెక్టని, టెక్నికల్‌గా ప్రపంచంలోనే అత్యంత కష్టమైందని తేలింది. చైనా నుంచి నేపాల్‌లోకి రైల్వే ప్రాజెక్టు నిర్మించాలంటే 98 శాతం సొరంగాలు, బ్రిడ్జ్లే కట్టాలి. ఈ రెండు దేశాల మధ్య హిమాలయ పర్వతాలు ఉండటంతో రైల్వే ట్రాక్‌లను నిటారుగా ఉండే నేలపై నిర్మించాల్సి ఉంటుంది. కఠ్మాండులో 1400 మీటర్ల ఎత్తులో, టిబెట్‌లో ఏకంగా 4000 మీటర్ల హైట్‌లో రైల్వే లైన్ కట్టాలి. అంత ఎత్తులో కట్టడానికి అనుకూలంగా లేని చోట్ల కిలోమీటర్ల పొడవున టన్నెల్స్ తవ్వాలి. అండర్ గ్రౌండ్లో రైల్వే ట్రాక్ వేయాలి.
ఎంత డబ్బు కావాలి?
దాదాపు 170 కిలోమీటర్ల పొడవున రైల్వే లైన్‌ను అందుబాటులోకి తేవాలంటే వేల కోట్ల రూపాయలు కావాలి. ఈ రైల్వే లైన్లో మూడో వంతు మాత్రమే నేపాల్ పరిధిలో ఉంటుంది. మిగతా రెండొంతులూ చైనాలోనే ఉంటుంది. నేపాల్‌లో రైల్వే ట్రాక్ నిర్మాణానికి నేల, వాతావరణం అనుకూలంగా లేకపోవటం వల్ల ఖర్చులో సగ భాగాన్ని ఆ దేశమే భరించాల్సి వస్తోంది. ఇంత చేసినా దీనివల్ల నేపాల్‌కి ఏమాత్రమైనా లాభముందా అంటే అదీ లేదు.
రైల్వే లైన్ నిర్మాణానికి చేతిలో డబ్బు లేకపోయినా నేపాల్ కలలు కనేలా చైనా చేస్తోంది. అది ఇచ్చిన మోటివేషన్‌తో నేపాల్ వెనకా ముందు ఆలోచించకుండా రైల్వే లైన్ నిర్మాణ తేదీలను ప్రకటించేసింది. డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని, ఫీజబిలిటీ స్టడీని త్వరలో పూర్తి చేసి పనులు చేపడతామని, రెండేళ్లలో పూర్తి చేస్తామని చెబుతోంది. నేపాల్ నుంచి చైనాకి రైళ్లలో ఏం ఎక్స్పోర్ట్ చేస్తారంటే మినరల్ వాటర్ అంటోంది. నిజానికి టిబెట్‌లో మినరల్ వాటర్ బిజినెస్ ఇప్పటికే భారీ ఎత్తున ఉంది. అందువల్ల నేపాల్ నుంచి మినరల్ వాటర్‌ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం టిబెట్‌కి లేనే లేదు. ఇండియాకి ముప్పు తలపెట్టే ఉద్దేశంతో చైనా ప్రారంభించిన ఈ ప్రాజెక్టుతో తమ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలని నేపాల్ భావిస్తోంది. ఇంత పెద్ద బడ్జెట్ తమ వద్ద లేదని తెలిసి కూడా అడుగు ముందుకేస్తోంది. చైనా ఆర్థిక సాయం చేస్తుందని ఆశపెట్టుకుంది. ఈ ప్రాజెక్టు తమకు గుదిబండగా మారుతుందనేది నేపాలీల ఆందోళన. చైనా రాయబారి మాత్రం నేపాల్ ప్రజల భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారు. బీఆర్ఐ రుణ ఉచ్చులోకి లాగే ప్రయత్నం కాదని చెప్పుకొచ్చారు. దీనివల్ల కొన్ని దేశాలు అప్పుల్లో కూరుకుపోతాయేమో గానీ నేపాల్‌కు మాత్రం ఈ ప్రాజెక్టు ఉపయోగకరమని నచ్చజెప్పాలని చూశారు. ఈ మేరకు ఓ నేపాలీ న్యూస్ పేపర్లో రీసెంట్గా ఆర్టికల్ రాశారు. నిజం చెప్పాలంటే కఠ్మండు–కెరుంగ్ రైల్వే రూట్లో పెద్ద సిటీలేమీ లేవు. కాబట్టి స్థానికులు ఈ ప్రాజెక్టుతో లాభపడతారనే వాదన సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మనకు సెక్యూరిటీ ముప్పు
ఉత్తరాన జమ్మూకాశ్మీర్ నుంచి తూర్పు న అరుణాచల్ ప్రదేశ్ వరకు హిమాలయాలు మన దేశ సెక్యూరిటీకి పెట్టని కోట. చైనా ఇండియాలోకి రావాలంటే వాటిని దాటి నేపాల్ మీదుగానే రావాలి. అందుకే నేపాల్ ని మచ్చిక చేసుకుంటే మన దేశంపై ఎటాక్ చేయటం డ్రాగన్ కి ఈజీ అవుతుంది . ఈ ఉద్దేశంతోనే బీఆర్ఐని ముందుకు తెచ్చింది. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఇండియా బీఆర్ఐ కి దూరంగా ఉంటోంది.దీంతో చైనా నేపాల్ ని పావుగా వాడుకుంటోంది.ఆ దేశంలోకి రైల్వే ట్రాక్ నిర్మిస్తే ఇండియాపై క్షణాల్లో దాడి చేయగలదు. ప్రాజెక్టు తెర మీదికి వచ్చి రెండేళ్లవుతున్నా చెప్పుకోదగ్గ డెవలప్ మెంట్ చోటుచేసుకోలేదు. నేపాల్ లో రైల్వే డిపార్ట్ మెంట్ పదేళ్ల కిందటే అందుబాటులోకి వచ్చింది. కానీ అక్కడ ఒకే ఒక్క ఇంజనీర్ కంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాడు. కాంట్రాక్ట్ పూర్తైతే అతనూ ఉండడు.అలాంటి స్థితిలో ఆ దేశం ఇంత పెద్ద రైల్వే ట్రాక్ పూర్తి చేయటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. బోర్డర్ లో ఏదో హడావుడి చేస్తున్నారు తప్ప చైనా ఆశించిన స్థాయిలో పనులు ముందుకు సాగట్లేదు.
– ‘ది వైర్’ సౌజన్యంతో