![అరుణాచల్, ఆక్సాయ్చిన్పై చైనా కిరికిరి](https://static.v6velugu.com/uploads/2023/08/China-New-Map-Arunachal-Pradesh-Aksai-Chin_oGTpWD61Iz.jpg)
- సౌత్ చైనా సముద్రంలోని వివాదాస్పద భూభాగాలనూ కలిపేసుకున్న డ్రాగన్
- డ్రాయింగ్ పద్ధతి ఆధారంగా మ్యాప్ రూపొందించారన్న గ్లోబల్ టైమ్స్
- మీ మ్యాప్‌లో పెట్టుకున్నంత మాత్రాన.. ఆ భూభాగాలు మీవి కావు: జైశంకర్
న్యూఢిల్లీ: కుయుక్తుల చైనా మరోసారి కవ్వింపులకు దిగింది. ఆరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్‌చిన్ తమవేనని ప్రకటించుకుంది. ఈ మేరకు ‘చైనా స్టాండర్డ్ మ్యాప్ 2023 ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. ఇందులో అరుణాచల్, ఆక్సాయ్‌చిన్ పేర్లను కూడా మార్చింది. తైవాన్, దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద భూభాగాలు కూడా తమవేనని పేర్కొంది. మ్యాపులను ప్రచురించే ప్రక్రియను చైనా ఏటా చేపడుతుంది. కానీ అన్ని సార్లు పబ్లిక్‌లో ఉంచదు.
ఇండియాలో జీ20 సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో కావాలనే చైనా అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ద్వారా, అది కూడా ఇంగ్లిష్‌లో షేర్ చేసినట్లుగా తెలుస్తోంది. ‘‘చైనా అధికారిక స్టాండర్డ్ 2023 మ్యాప్ సోమవారం అధికారికంగా విడుదలైంది. సహజ వనరుల శాఖ ఆధ్వర్యంలోని స్టాండర్డ్ మ్యాప్ సర్వీస్ వెబ్‌సైట్‌లో ఈ మ్యాప్‌ను ఉంచాం. డ్రాయింగ్ పద్ధతి ఆధారంగా చైనా, ప్రపంచంలోని వివిధ దేశాల జాతీయ సరిహద్దులను సంకలనం చేసి ఈ మ్యాప్‌ను రూపొందించారు’’ అని గ్లోబల్ టైమ్స్ ట్వీట్ చేసింది.
చైనా వాళ్లకు ఉచిత పాస్ ఇచ్చారు: ఖర్గే
చైనా మ్యాప్‌పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్‌చిన్ భారత దేశంలోని విడదీయరాని భాగాలని, వీటిని చైనా మ్యాప్ ద్వారా మార్చలేరని అన్నారు. ‘‘ఇతర దేశాలకు చెందిన భూభాగాల పేర్లు మార్చడం, మ్యాప్‌లను మార్చి గీయడం వంటి నేరాలు చేయడం చైనాకు అలవాటే. భారత భూభాగాల పేర్లను మార్చడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది” అని ట్వీట్ చేశారు.
2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాతి నుంచి చైనా వంచన, యుద్ధము కొనసాగుతోందని చెప్పారు. మన 20 మంది వీర సైనికులు చనిపోయిన తర్వాత.. ‘ఎవరూ మన భూభాగంలోకి ప్రవేశించలేదు’ అని చెప్పడం ద్వారా చైనా వాళ్లకు ప్రధాని మోదీ ఉచిత పాస్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. భారత భూభాగంపై చైనా చేస్తున్న అతిక్రమణలను బహిర్గతం చేయడానికి రాబోయే జీ20 సమ్మిట్‌ను ఉపయోగించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
సర్జికల్ స్ట్రైక్ చేసే దమ్ముందా?: సంజయ్ రౌత్
భారత భూభాగాలను తన మ్యాప్‌లో చూపిన చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేసే దమ్ముందా? అని ప్రధాని నరేంద్ర మోదీని శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల బ్రిక్స్ సమ్మిట్‌కు మోదీ హాజరయ్యారని, చైనా అధికారులను ఆలింగనం కూడా చేసుకున్నారని ఎద్దేవా చేశారు. చైనా మన దేశంలోకి ప్రవేశించిందని రాహుల్ గాంధీ చెప్పిన మాటలు నిజమేనని అన్నారు. ‘‘ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ సర్జికల్ స్ట్రైక్ డ్రామా ఆడుతుందన్న భయం ప్రజల్లో ఉంది. మాలిక్ పుల్వామా దాడి జరగలేదని, కుట్ర చేశారని జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ గతంలో చెప్పారు” అని చెప్పారు.
చైనాకు అది అలవాటే: జైశంకర్
చైనా రిలీజ్ చేసిన మ్యాప్‌ను ఇండియా ఖండించింది. ఇలాంటి మ్యాప్‌లను రిలీజ్ చేయడం చైనాకు అలవాటేనని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ విమర్శిం చారు. ఇతర దేశాల భూభాగాలను తమ మ్యాప్‌లలో చేర్చడం ద్వారా చైనాకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు. ‘‘వాళ్లకు సంబంధం లేని భూభాగాలను చైనా తమ మ్యాప్‌లో పెడుతుంటుంది. ఇది వాళ్ల పాత అలవాటే. ఇండియా భూభాగాలను వాళ్ల మ్యాప్‌లలో పెట్టుకు న్నంత మాత్రాన.. ఏమీ మారిపోదు. మా భూభాగం విషయం లో మా ప్రభుత్వం ఫుల్ క్లారిటీతో ఉంది. అసంబద్ధమైన వాదనలు చేసినంత మాత్రాన ఇతరుల భూభాగా లు మీవి కావు” అని కౌంటర్ ఇచ్చారు.