- ఇతరత్రా వ్యాధులుంటే.. వాటినే పేర్కొండి
- డాక్టర్లకు చైనా సర్కారు హుకుం
బీజింగ్: కరోనా మరణాలు ప్రపంచానికి తెలియకుండా దాచేందుకు చైనా ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఎవరైనా ఆస్పత్రుల్లో కరోనా చికిత్స పొందుతూ చనిపోతే.. అందుకు కారణం ‘కొవిడ్ 19’ అని డెత్ సర్టిఫికెట్లపై రాయొద్దంటూ డాక్టర్లకు ఓరల్‌గా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం.. కరోనాతో చనిపోయిన వారు ఇతర జబ్బులతో బాధపడుతుంటే వాటినే డెత్ సర్టిఫికెట్లలో ప్రస్తావించాలని చైనా సర్కారు నిర్దేశించింది.
మరణానికి కారణం కరోనానే అని భావిస్తే.. తొలుత ఆ విషయాన్ని తమ పై అధికారులకు తెలియజేయాలని పేర్కొంది. రెండు దశల్లో నిపుణుల ద్వారా ధ్రువీకరించుకున్న తర్వాతే.. అది కరోనామరణమా ? కాదా ? అనే దానిపై ప్రకటన చేయాలని ఆస్పత్రులకు సూచించింది. చైనాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే ఆరుగురు డాక్టర్లు ఈ వివరాలను తమతో చెప్పారని ఆ వార్తా సంస్థ వెల్లడించింది. మరణాలకు గల కారణాల్లో ‘కొవిడ్ 19’ ప్రస్తావన లేకుండా చూడాలని ప్రభుత్వం నుంచే ఆదేశాలు వచ్చాయని కొందరు డాక్టర్లు చెప్పగా.. ఏ విభాగం నుంచి ఆదేశాలువచ్చాయనేది తెలియదని ఇంకొందరు చెప్పారని పేర్కొంది. కాగా, డిసెంబరు 8 నుంచి జనవరి 12 మధ్యకాలంలో చైనాలో దాదాపు 60వేల మంది కరోనా కారణంగా చనిపోయారు. ఈ విషయాన్ని చైనాజనవరి 14న అధికారికంగా ప్రకటించింది. కరోనా మరణాల సంఖ్యను చైనా దాచడంపై గతంలో పలుమార్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తంచేసింది.