- దిగుమతులపై 10 నుంచి 15 శాతం సుంకం
- ట్రంప్ నిర్ణయానికి డ్రాగన్ కంట్రీ కౌంటర్
- కెనడా, మెక్సికోలకు నెల రోజుల పాటు రిలీఫ్
- టారిఫ్ల అమలును వాయిదా వేసిన ట్రంప్
బీజింగ్/ వాషింగ్టన్: అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ మొదలైంది. చైనా వస్తువులపై అమెరికా 10 శాతం సుంకాలు విధించగా.. దానికి బదులుగా అమెరికా వస్తువులపై చైనా కూడా సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ పై 15 శాతం.. క్రూడాయిల్, అగ్రికల్చర్ మెషినరీ, పెద్ద ఇంజన్ కార్లపై 10 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్టు చైనా మంగళవారం ప్రకటించింది.
ఇవి వచ్చే సోమవారం (ఈ నెల 10) నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. కాగా, అమెరికా వస్తువులపై టారిఫ్ విధించడంతో పాటు ఆ దేశ కంపెనీలపైనా చైనా చర్యలు తీసుకుంటున్నది. అమెరికాకు చెందిన రెండు కంపెనీలు పీవీహెచ్ గ్రూప్, ఇల్యూమినాలను విశ్వసనీయతలేని సంస్థల జాబితాలో చేర్చినట్టు ప్రకటించింది. చట్టాల ఉల్లంఘనకు సంబంధించి గూగుల్ పై విచారణ జరుపుతున్నామని చైనా వెల్లడించింది.
అగ్రరాజ్యంతో కెనడా, మెక్సికోల చర్చలు
కెనడా, మెక్సికోపై టారిఫ్‌లు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ రెండు దేశాలకు తాత్కాలికంగా ఊరట కల్పించారు. టారిఫ్ల అమలును నెల రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. చైనాపై విధించిన సుంకాలు మాత్రం కొనసాగుతాయని స్పష్టంచేశారు. అమెరికాలోకి అక్రమ వలసలు, అక్రమ డ్రగ్స్ రవాణాను అడ్డుకుంటామని పొరుగు దేశాలైన కెనడా, మెక్సికో హామీ ఇవ్వడంతో.. టారిఫ్ల అమలును తాత్కాలికంగా నిలిపివేసేందుకు ట్రంప్ అంగీకరించారు.
ఈ రెండు దేశాలతో తుది ఒప్పందం కుదిరే వరకు తాత్కాలికంగా టారిఫ్ల అమలును నిలిపివేస్తున్నామని ప్రకటించారు. కెనడా, మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమ వలసలు, డ్రగ్స్ రవాణా జరుగుతున్నాయని ఆరోపించిన ట్రంప్.. ఆ దేశాలపై 25% చొప్పున టారిఫ్‌లు విధించారు. ఇవి మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు.
దీంతో కెనడా, మెక్సికో వెంటనే అమెరికాతో చర్చలు ప్రారంభించాయి. ట్రంప్‌తో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షేన్ బామ్ ఫోన్లో మాట్లాడారు. ‘‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడాను. టారిఫ్ల అమలును నిలిపివేసేందుకు అంగీకరించారు. అమెరికాలోకి అక్రమ వలసలు, ఫెంటనిల్ డ్రగ్ అక్రమ రవాణాను అడ్డుకుంటాం. సరిహద్దు వెంబడి వెంటనే 10 వేల మంది నేషనల్ గార్డ్స్ ను నియమిస్తాం” అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా తెలిపారు.
‘‘టారిఫ్ల అమలు నెల రోజులు నిలిపివేసేందుకు ట్రంప్ అంగీకరించారు. సరిహద్దుల్లో భద్రత కోసం 1.3 బిలియన్ డాలర్ల ప్రణాళిక అమలు చేస్తున్నాం. అమెరికాతో కలిసి బార్డర్లో కొత్త చాపర్లు, సిబ్బందిని మోహరిస్తాం” అని ట్రూడో ట్వీట్ చేశారు.