అమెరికాపై చైనా టారిఫ్​లు 15శాతం ప్రతీకార పన్నులు విధించిన డ్రాగన్

అమెరికాపై చైనా టారిఫ్​లు 15శాతం  ప్రతీకార పన్నులు విధించిన డ్రాగన్
  • డబ్ల్యూటీవోలో న్యాయపోరాటం చేస్తామని వెల్లడి
  • సోమవారం చైనాపై సుంకాలు మరో 10 % పెంచిన ట్రంప్
  • కెనడా, మెక్సికోపైనా 25% టారిఫ్​లు అమలులోకి.. 
  • బదులుగా అమెరికాపై కెనడా 25% టారిఫ్

బీజింగ్, వాషింగ్టన్: అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ ముదిరింది. చైనా వస్తువులపై ఇప్పటికే 10శాతం సుంకాలు విధించిన యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోమవారం అదనంగా మరో 10 శాతం టారిఫ్ లను ప్రకటించారు. దీనికి ప్రతీకారంగా డ్రాగన్ కంట్రీ కూడా అమెరికా వస్తువులపై 10 నుంచి 15 శాతం టారిఫ్ లను మంగళవారం ప్రకటించింది. మరోవైపు, కెనడా, మెక్సికో దేశాలపై ట్రంప్ నెల రోజుల కిందట విధించిన 25% టారిఫ్ లు మంగళవారం తెల్లవారుజాము నుంచి అమలులోకి వచ్చాయి. 

దీంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ప్రతీకార సుంకాలను ప్రకటించారు. అమెరికా వస్తువులపై తాము కూడా 25% సుంకాలను విధిస్తున్నామని స్పష్టం చేశారు. అమెరికా టారిఫ్​లపై మెక్సికో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. చైనా నుంచి అమెరికాకు ఫెంటనిల్ డ్రగ్ విచ్చలవిడిగా సప్లై అవుతోందని, దానికి అడిక్ట్ అయిపోతున్న అమెరికన్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ట్రంప్ మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు. 

ఫెంటనిల్ డ్రగ్​ను కట్టడి చేయనందుకు చైనా వస్తువులపై 10 శాతం టారిఫ్ లు విధిస్తున్నట్టు గత నెలలో ప్రకటించారు. తాజాగా మరో 10 శాతంతో కలిపి సుంకాలను 20 శాతానికి పెంచినట్టు సోమవారం స్పష్టం చేశారు. అమెరికాలోకి డ్రగ్స్, అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయడంలో విఫలమైనందుకు కెనడా, మెక్సికోలపైనా ట్రంప్ గత నెలలోనే 25% టారిఫ్​లను ప్రకటించారు. అయితే, మిత్రదేశాలతో చర్చలు, సంప్రదింపుల కోసం టారిఫ్​ల అమలును నెల రోజులు వాయిదా వేశారు. తాజాగా ఎలాంటి డీల్ కుదరకపోవడంతో మంగళవారం తెల్లవారుజాము నుంచి టారిఫ్​లు అమలులోకి వస్తాయని ట్రంప్ ప్రకటించారు.

అమెరికా ఫుడ్ ప్రొడక్టులపై చైనా గురి 

ప్రతీకార సుంకాల విధింపు కోసం అమెరికా వ్యవసాయ, ఆహార ఉత్పత్తులపైనే చైనా ప్రధానంగా గురి పెట్టింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే చికెన్, గోధుమ, మొక్కజొన్న, పత్తి వంటి ఉత్పత్తులపై 15% సుంకాలను ప్రకటించింది. అలాగే జొన్న, సోయాబీన్స్, పోర్క్, బీఫ్, సీఫుడ్, పండ్లు, కూరగాయలు, డైరీ ఉత్పత్తులపై 10% టారిఫ్ లను విధించింది. ఈ టారిఫ్ లు ఈ నెల 10 నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. 

అలాగే అమెరికాకు చెందిన 10 కంపెనీలను కూడా నమ్మదగని సంస్థల జాబితాలో చేర్చనున్నట్టు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏఐ, ఏవియేషన్, ఐటీతోపాటు పౌర, సైనిక ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలను ఈ జాబితాలో చేర్చనున్నట్టు తెలిపింది. అమెరికా చర్యలు ‘ఏకపక్షంగా, వాణిజ్య రక్షణవాదం’లా ఉన్నాయని చైనా విదేశాంగ శాఖ తప్పుపట్టింది. అమెరికా టారిఫ్​లను వాషింగ్టన్ లోని చైనీస్ ఎంబసీ కూడా ఖండించింది. 

చైనాపై యూఎస్ టారిఫ్ లు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలను ఉల్లంఘించడమేనని చెప్పింది. దీనిపై డబ్ల్యూటీవోలో న్యాయ పోరాటం కూడా ప్రారంభిస్తామని ప్రకటించింది. అమెరికా ముందుగా తమ దేశంలో ఫెంటనిల్ డ్రగ్ వాడకాన్ని అరికట్టాలని, అంతేతప్ప బయటి దేశాలపై నిందలు వేయొద్దని కామెంట్ చేసింది. 

కెనడా కూడా ప్రతీకార సుంకాలు.. 

అమెరికాపై తొలి విడతలో 20.75 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన వస్తువులపై 25% టారిఫ్ లు అమలు చేస్తున్నామని కెనడా ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో మరో 86.4 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన అమెరికన్ వస్తువులపై కూడా ఇంతే మొత్తంలో టారిఫ్​లు ప్రకటిస్తామన్నారు. అమెరికా టారిఫ్​లు తమ దేశ ఎకానమీకి నష్టం కలిగిస్తాయని, ప్రజలు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని కెనడా మంత్రి మెలానీ జోలీ చెప్పారు. అందుకే ప్రతీకార సుంకాలు ప్రకటించామన్నారు.

నేడు ప్రకటన చేయనున్న మెక్సికో

అమెరికా టారిఫ్ లపై ప్రతీకార చర్యల విషయంపై మెక్సికో ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, మంగళవారం (లోకల్ టైం ప్రకారం) ఉదయం రెగ్యులర్ మార్నింగ్ ప్రెస్ బ్రీఫింగ్ లో భాగంగా దీనిపై అధికారికంగా స్పందించనున్నట్టు మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాWWడియా షీన్ బామ్ తెలిపారని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, డ్రగ్స్, అక్రమ వలసల కట్టడికి తాము చర్యలు తీసుకుంటున్నామని క్లాడియా ఇదివరకే ప్రకటించారు. అయినా, యూఎస్ టారిఫ్ లు తప్పకపోతే తమ వద్ద ప్లాన్ బీ, సీ, డీ కూడా ఉన్నాయన్నారు.