
China Vs Donald Trump: చైనా అమెరికా మధ్య వాణిజ్య పోరు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక పక్క చైనా మినహా ప్రపంచంలోని చాలా దేశాలపై ట్రంప్ తన టారిఫ్స్ తాత్కాలికంగా 90 రోజుల వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చైనా, అమెరికా మాత్రం ఒకదానిపై మరొకటి టారిఫ్స్ పెంచుకుంటూ పోతూనే ఉన్నాయి. ట్రంప్ టారిఫ్స్ నిర్ణయంపై ప్రతీకారం తీర్చుకుంటున్న చైనా.. అమెరికాకు ధీటుగా అదే స్థాయిలో పన్నుల పెంపును ప్రకటిస్తోంది.
తాజాగా చైనా అమెరికా తమపై పన్నులను పెంచటాన్ని అదే స్థాయిలో తిప్పికొడుతూ 84 శాతంగా ఉన్న సుంకాన్ని 125 శాతానికి పెంచుతున్నట్లు చైనా పేర్కొంది. అమెరికా తమపై ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టడానికి జిన్ పింగ్ యూరోపియన్ యూనియన్ సహకారం కోరుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై విధిస్తున్న సుంకాలను 145 శాతానికి పెంచటంతో చైనా కూడా తన దూకుడును కొనసాగిస్తోంది.
ప్రస్తుతం ఉన్న అధిక సుంకాల సమయంలో చైనా మార్కెట్లలోకి అమెరికా ఉత్పత్తులను ఎగుమతి చేయటం అసాధ్యమైనదిగా చైనా ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. తమపై చైనా అసాధారణ స్థాయిల్లో సుంకాలను పెంచుతోందని, ఇది కేవలం నంబర్ గేమ్ మాదిరిగా మారటం పాటు రెండు ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పరిణామాలకు పూర్తిగా అమెరికానే కారణంగా చైనా చెబుతోంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లలో భయోత్పాతాన్ని సృష్టిస్తోందని చైనా చెబుతోంది.
చైనా నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే అమెరికా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలపై ప్రస్తుతం తాత్కాలికంగా సుంకాల అమలును మూడు నెలల పాటు నిలిపివేసిందని డ్రాగన్ దేశం చెబుతోంది. ఇలా సుంకాలతో వాణిజ్య యుద్ధానికి వెళ్లటం వల్ల ఎవ్వరికీ ఉపయోగం ఉండదని జీ జిన్ పింగ్ పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో అమెరికా చైనాతో కలిసి పనిచేయటానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్‌హువా వెల్లడించింది. మరో పక్క ట్రంప్ మాత్రం చైనా అధ్యక్షుడు చాలా తెలివైన వ్యక్తి అని, ఆయనకు ఏం చేయాలో తెలుసునని అన్నారు. తమతో డీల్ చేసుకునేందుకు జిన్ పింగ్ ముందుకొస్తారని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
అయితే టారిఫ్స్ యుద్ధం కారణంగా చైనాలోనే లక్షల పరిశ్రమల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలకు తమ ఉత్పత్తులను తక్కువ రేట్లకు ఆఫర్ చేస్తున్నారు. అయితే ట్రంప్ తో రెచ్చగొట్టే ధోరణిని ప్రదర్శించటం కంటే డీల్ చేసుకోవటం ఉత్తమం అని చాలా మంది నిపుణులు చైనాకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందో వేచి చూడాలి.