చైనా పిల్లల్లో న్యుమోలియా లక్షణాలతో అంతుచిక్కని రోగం.. కిటకిటలాడుతున్న ఆస్పత్రులు

చైనా.. ఈ మాట వింటే కరోనానే గుర్తుకొస్తుంది.. అది తగ్గి అంతా బాగుంది అనుకుంటున్న టైంలో.. ఇప్పుడు చైనాలో కొత్త వైరస్ పుట్టినట్లు ప్రపంచం భయపడుతుంది. దీనికి కారణం లేకపోలేదు.. చైనా దేశ వ్యాప్తంగా చిన్న పిల్లలు.. పసి పిల్లలు లక్షల మంది ఇప్పుడు ఆస్పత్రుల్లో ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రులు పిల్లలతో నిండిపోయాయి.. పిల్లల్లో న్యూమోనియా లక్షణాలతో ఉన్న కొత్త వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అది న్యూమోనియా లక్షణాలతో ఉన్నా.. న్యూమోనియా కాదు అంటున్నారు డాక్టర్లు. దీంతో చైనా వైద్య శాఖ అత్యవసర ట్రీట్ మెంట్లకు ఏర్పాట్లు చేస్తుంది. మరో వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. WHO సైతం చైనా పిల్లల్లోని వ్యాధి లక్షణాలు, ట్రీట్ మెంట్ వివరాలు తక్షణమే వెల్లడించాలని చైనా దేశాన్ని ఆదేశించింది.

కొవిడ్ -19 మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చైనా మరొక ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోంది. అంతుచిక్కని న్యుమోనియా వ్యాప్తి పాఠశాల విద్యార్థులకు వేగంగా వ్యాపిస్తోంది. దీంతో అక్కడి ఆసుపత్రులు జబ్బుపడిన పిల్లలతో నిండిపోయాయి. ఈ పరిణామంతో ప్రపంచ ఆరోగ్య నిపుణుల్లో ఆందోళన నెలకొంది. న్యూమోనియా లక్షణాలతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్న ప్రాంతాల్లో బీజింగ్, లియానింగ్ ప్రావిన్స్ ఉన్నాయి. అక్కడ చిన్న పిల్లల ఆస్పత్రులన్నీ రద్దీగా మారాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో.. బీజింగ్, లియానింగ్ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ మూసివేసింది ప్రభుత్వం. ఈ వ్యాధికి విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులు సైతం గురవుతున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నా.. ఈ వివరాలను వెల్లడించటం లేదు చైనా. ఇది కొవిడ్ -19 ప్రారంభ రోజులను గుర్తు చేస్తోందని కొందరు భయాందోళనలు వ్యక్తం చేయటం.. ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తుంది. 

ఈ వ్యాధి బారిన పడిన పిల్లలు అధిక జ్వరం, ఊపిరితిత్తుల్లో వాపు, దగ్గు.. లాంటి లక్షణాలను కలిగి ఉంటున్నారు. ఇది చాలా వేగంగా వ్యాపిస్తుందని.. చిన్న పిల్లలకు వెంటనే ఎటాక్ అవుతుందని చైనానే చెబుతోంది. న్యూమోనియా తరహాలో ఉన్నా.. అందులో కొత్త వైరస్ లు ఉన్నట్లు అనుమానాలను సైతం చైనాలోని సైంటిస్టులు వ్యక్తం చేయటంతో.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం అప్రమత్తం అయ్యింది. పూర్తి వివరాలు ఇవ్వాలని చైనాను కోరుతుంది. చైనాలోని మిగతా ప్రాంతాలకు ఇది వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.  


అంతుచిక్కని న్యూమోనియా లక్షణాలతో ఉన్న ఈ వ్యాధిపై 2023, నవంబర్ 21వ తేదీన అలర్ట్ జారీ చేసింది చైనా సర్కార్. మిస్టీరియస్ న్యూమోనియా అంటూ ప్రకటించింది. ఇది ఎక్కడ మొదలైంది.. ఎలా మొదలైంది అనేది తెలియదు అంటూనే.. చాలా వేగంగా వ్యాపిస్తున్నట్లు స్పష్టం చేసింది చైనా. ఇది పెద్దలను సైతం ప్రభావం చేస్తుందని హెచ్చరిస్తుంది. మళ్లీ చైనాలో ఫేస్ మాస్కులు ధరించాల్సిన రోజులు వచ్చాయంటూ అమెరికాకు చెందిన హెల్త్ డిపార్ట్ మెంట్ సైతం వార్నింగ్ ఇవ్వటం విశేషం. 

ఈ కొత్త వైరస్ వ్యాప్తి ఈ రోజు మొదలైంది కాదని.. 2023, అక్టోబర్ నెలలో చైనా జాతీయ దినోత్సవ వేడుకల సమయంలో బయటపడిందని డాక్టర్లు చెబుతున్నారు. మొదట న్యూమోనియాగా భావించినా.. ఆ వ్యాధి తీవ్రత దృష్ట్యా.. అది న్యూమోనియాలోని కొత్త రకం వైరస్ గా భావించినట్లు చెబుతోంది చైనా ఆరోగ్య శాఖ. అది క్రమంగా వేగంగా విస్తరించటం వల్ల ప్రపంచానికి తెలిసింది. ఈ వ్యాధి బారిన పడిన పిల్లల్లో 50 శాతం మంది ఇంట్లో ఉండే చికిత్స తీసుకుంటున్నారని.. జ్వరం, దగ్గు, జలుబు, వాంతులు వంటివి ఎక్కువగా ఉంటేనే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చెబుతోంది చైనా. 

ఇక్కడ ఓ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది చైనా సర్కార్. ఇప్పటి వరకు ఈ న్యూమోనియా లక్షణాలతో ఎవరూ చనిపోలేదని గట్టిగా చెబుతుంది. చైనా చెప్పేది ఎంత వరకు నిజం అనేది కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తుంది.