
బోయింగ్ విడిభాగాల దిగుమతిపైనా ఆంక్షలు
విమానాలు లీజుకు తీసుకునే సంస్థలకు ఆర్థిక సహాయం!
బీజింగ్: అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ మరింత ముదురుతున్నది. అమెరికా నుంచి విమానాల కొనుగోళ్లను నిలిపేయాలని చైనా ఏవియేషన్ అధికారులను ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశించారు. అమెరికా ఏవియేషన్ దిగ్గజం బోయింగ్ నుంచి ఏ ఒక్క జెట్‌ను కూడా కొనొద్దని చెప్పారు. విమానాల డెలివరీలన్నీ వెంటనే ఆపేయాలన్నారు.
ఏవియేషన్ ఇండస్ట్రీలో ఉపయోగించే విడిభాగాలను కూడా అమెరికా నుంచి కొనుగోలు చేయొద్దని ఆదేశించారు. బ్లూమ్‌బర్గ్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కాగా, ఇప్పటికే చైనాలో దొరికే అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాలను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని ఆపేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. తాజాగా విమానాల కొనుగోళ్లు కూడా ఆపేయడంతో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
భారీగా పెరగనున్న ఖర్చు
ఏవియేషన్ ఇండస్ట్రీల్లో ఉపయోగించే విడి భాగాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటే టారిఫ్ కారణంగా ఖర్చు భారీగా పెరుగుతుందని చైనా తెలిపింది. బోయింగ్ విమానాలను లీజు తీసుకునే సంస్థలకు చైనా ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. 125 శాతం సుంకాలు వేయడంతో బోయింగ్ విమానాల నిర్వహణ కూడా విమానయాన సంస్థలకు భారంగా మారనున్నది. పోయిన వారం ట్రంప్, కొత్త టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేశానని ప్రకటించినా, చైనాకు మినహాయింపు ఇవ్వలేదు.
ఇప్పటికే బోయింగ్ తీవ్ర నష్టాల్లో ఉన్నది. చైనాతో వ్యాపారం.. ఆ సంస్థను కొంత వరకు గట్టెక్కిస్తున్నది. రానున్న 20 ఏండ్లలో ప్రపంచ విమానాల మార్కెట్లో 20శాతం వాటా చైనాదే అన్న అంచనాలున్నాయి. 2018లో 25 % బోయింగ్ విమానాలను చైనాకు చెందిన విమానయాన సంస్థలే కొనుగోలు చేశాయి. కొన్ని ఏండ్లుగా చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో చైనా
నుంచి కొత్త ఆర్డర్లు బోయింగ్‌కు లభించలేదు.
మా డ్రెస్ వేసుకుని మాపైనే నిందలా? : చైనా
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వేసుకున్న డ్రెస్‌పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్నది. వైట్ హౌస్ బ్రీఫింగ్‌లో ఆమె రెడ్, బ్లాక్ కలర్ లేస్ డ్రెస్ ధరించింది. దీనిపై ఇండోనేషియా డెన్‌పసర్‌లోని చైనా రాయబారి జాంగ్ జిషెంగ్‌తో పాటు మరికొందరు ఎక్స్ (ట్విటర్)లో స్పందించారు. ‘‘కరోలిన్ వేసుకున్న డ్రెస్‌లోని బ్లాక్ కలర్ లేస్ చైనాలోని మాబు అనే ప్రాంతంలో తయారైంది. ఇది చైనీస్ ఈ కామర్స్ సైట్‌లలో అందుబాటులో ఉంది. ఓ వైపు చైనాను నిందిస్తున్నారు. మరోవైపు చైనా వస్తువులనే వాడుతున్నారు. మీకు ఇదంతా అలవాటైపోయింది’’అని జాంగ్ జిషెంగ్ అన్నారు. ఆమె వేసుకున్న డ్రెస్, చైనా మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు.
వియత్నాం టూర్లో జిన్‌పింగ్
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వియత్నాం క్యాపిటల్ హనోయ్‌లో పర్యటించారు. అమెరికాతో టారిఫ్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన వియత్నాం పర్యటన ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ మేరకు వియత్నాంతో ట్రేడ్, సప్లై చైన్ సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు జిన్‌పింగ్ నిర్ణయించారు. రైల్వే, ఏవియేషన్, టెక్నాలజీ, ఐటీతో పాటు పలు కీలక రంగాల్లో 40 ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నట్లు సమాచారం. కాగా, వియత్నాంపై ట్రంప్ 46 శాతం టారిఫ్ విధించాడు.