- నార్తర్న్ రీజియన్‌పై పెను ప్రభావం
- జపాన్ లోనూ కేసులు నమోదు
బీజింగ్: చైనాలో హెచ్ఎంపీ వైరస్ వేగంగా స్ప్రెడ్ అవుతున్నది. శ్వాస కోశ ఇబ్బందులతో బాధపడేవారి సంఖ్య పెరుగుతున్నది. దీంతో అక్కడి హాస్పిటల్స్ రద్దీగా మారాయి. చైనాలోని నార్తర్న్ రీజియన్స్‌లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని అక్కడి వైద్య శాఖ అధికారులు ప్రకటించారు. అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నట్లు చైనాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా కన్ఫార్మ్ చేసింది.
వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోనూ హెచ్ఎంపీ వైరస్ వ్యాప్తి చెందుతున్నది. చిన్నారులతో పాటు వయస్సు పైబడినవారిలోనూ ఈ రకం వైరస్ కనిపిస్తున్నది. ఈ వైరస్ బారినపడివాళ్లు.. జ్వరం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పితో బాధపడుతున్నారు. ఫ్లూ తరహా లక్షణాలు బయటపడుతున్నాయి.
చైనాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ.. అటు చైనా, ఇటు డబ్ల్యూహెచ్‌వో మాత్రం ఎలాంటి ఎమర్జెన్సీని ప్రకటించలేదు. ఆసియాలోని దేశాలన్నీ.. చైనాలో నెలకొన్న పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాయి. చైనా రీజియన్‌లోని చాలా ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ప్రధానంగా హాంకాంగ్.. గట్టి చర్యలు తీసుకున్నది.
అక్కడ కూడా హెచ్ఎంపీ వైరస్ కేసులు నమోదయ్యాయి. జపాన్‌లోనూ వేలాది శ్వాసకోశ ఇబ్బందుల కేసులు నమోదవుతున్నాయి. డిసెంబర్ 15 వరకు జపాన్‌లోని 5 వేల హాస్పిటల్స్‌లో సుమారు లక్ష వరకు ఫ్లూ తరహా కేసులు నమోదయ్యాయి. ఈ వారం రోజుల నుంచి బాధితుల సంఖ్య పెరుగుతున్నదని అక్కడి లోకల్ మీడియా సంస్థలు ప్రకటించాయి. జపాన్‌లో ఇప్పటి వరకు ఈ తరహా కేసులు 7.18లక్షలకు చేరుకున్నాయి.
ప్రస్తుతానికి ముప్పు లేదు: కేంద్రం
న్యూఢిల్లీ: చైనాలో స్ప్రెడ్ అవుతున్న హెచ్ఎంపీవీతో ప్రస్తుతానికి భారత్‌కు ఎలాంటి ముప్పులేదని వైద్యశాఖ అధికారులు సూచించారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని హెల్త్ సర్వీసెస్ డైరెక్టరేట్ జర్నల్ డాక్టర్ అతుల్ గోయెల్ తెలిపారు. దీనికి ప్రత్యేకంగా యాంటీ వైరల్ ట్రీట్ మెంట్ అంటూ ఏమీ లేదు. వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు తెలిపారు.
‘సాధారణ జలుబుకు కారణమయ్యే వైరస్లలో హెచ్ఎంవీపీ ఒకటి. చిన్న, పెద్దోళ్లలో ఫ్లూ తరహా లక్షణాలు కనిపిస్తాయి. శ్వాసకోశ వ్యాప్తికి సంబంధించిన డేటాను విశ్లేషించాం. 2024, డిసెంబర్లో ఈ తరహా కేసులు పెద్దగా నమోదు కాలేదు. చలికాలం కావడంతో సాధారణంగా జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పుల వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్నవాళ్లు వేరేవాళ్లతో కాంటాక్ట్ అవ్వొద్దు.
అప్పుడే ఇది వేరేవాళ్లకు స్ప్రెడ్ అవ్వదు’’ అని డాక్టర్ గోయెల్ వివరించారు.