అమెరికాపై చైనా 125 శాతం టారిఫ్.. 41 శాతం మేర సుంకాలు పెంచిన జిన్​పింగ్

అమెరికాపై చైనా 125 శాతం  టారిఫ్.. 41 శాతం మేర సుంకాలు పెంచిన జిన్​పింగ్
  • అమెరికాపై చైనా 125%  టారిఫ్
  • 41 శాతం మేర సుంకాలు పెంచిన జిన్​పింగ్
  • ట్రేడ్​వార్ ఓ నంబర్ గేమ్ అన్న చైనా
  • అమెరికాకు తలొగ్గేది లేదు.. ఎంతవరకైనా వెళ్తాం
  • ఏకపక్ష బెదిరింపులకు భయపడం
  • చివరి దాకా పోరాడుతామని కామెంట్

బీజింగ్: అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ రోజురోజుకూ ముదురుతున్నది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై చైనా టారిఫ్​ను 125 శాతానికి పెంచింది. డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 84 శాతం ఉన్న టారిఫ్​ను 125 శాతానికి పెంచుతున్నామని, శనివారం నుంచే ఇవి అమల్లోకి వస్తాయని చైనా స్పష్టం చేసింది. ట్రేడ్​వార్​ను ఓ నంబర్ గేమ్​గా అభివర్ణించింది. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 145% టారిఫ్ విధించిన నేపథ్యంలో డ్రాగన్ దీటుగా స్పందించింది. ఈ మేరకు అమెరికాను ఉద్ధేశిస్తూ శుక్రవారం చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ సంచలన కామెంట్లు చేసింది. అమెరికా విధించిన 145 శాతం టారిఫ్ ఏకపక్ష బెదిరింపు అని తెలిపింది. అయినప్పటికీ.. భయపడేది లేదని తేల్చి చెప్పింది. టారిఫ్​లతో చైనాపై ఆర్థికంగా ఎలాంటి ప్రభావం ఉండదని వ్యాఖ్యానించింది. దీర్ఘకాలంలో రెండు దేశాలపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తెలిపింది. చర్చలకు సిద్ధమంటూనే టారిఫ్​లు పెంచుకుంటూ పోవడం ఏంటని అమెరికాపై మండిపడింది. చైనా వస్తువులపై విధించిన పరస్పర సుంకాలను తొలగించే దిశగా నిర్ణయం తీసుకోవాలని అమెరికాను కోరింది.

చైనాపై ఎలాంటి ప్రభావం ఉండదు

అమెరికా విధిస్తున్న సుంకాలతో చైనాపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆ దేశ కస్టమ్స్ టారిఫ్ కమిషన్ స్పష్టం చేసింది. ప్రపంచ ఆర్థిక చరిత్రలో ట్రంప్ వైఖరి ఓ జోక్​గా మిగిలిపోతుందని ఎద్దేవా చేసింది. తమ వస్తువులపై అమెరికా సుంకాలు పెంచుకుంటూ పోతే.. తామూ అదే రీతిలో స్పందిస్తామని తేల్చి చెప్పింది. టారిఫ్ వార్​లో చివరి వరకు పోరాడుతామని తెలిపింది. తమపై అమెరికా విధిస్తున్న సుంకాలు.. అంతర్జాతీయ, ఆర్థిక వాణిజ్య నిబంధనలు, ప్రాథమిక ఆర్థిక చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని చెప్పింది. ఇది పూర్తిగా ఏకపక్ష బెదిరింపు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నుంచి అమెరికా విధిస్తున్న సుంకాలను పట్టించుకోమని తేల్చి చెప్పింది. చైనా ప్రయోజనాలను దెబ్బతీయాలనే 
ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు ఆరోపించింది. 

మాతో డీల్ చేయాలంటే బ్లాక్​మెయిల్ పనికిరాదు

అమెరికా చర్యలకు అనుగుణంగా ప్రతిచర్య ఉంటుందని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హెచ్చరించారు. టారిఫ్​లపై చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పారు. టారిఫ్ వార్​​లో ఎవరూ విజేతలు కాలేరని తెలిపారు. ఇలాంటి వార్​ను చైనా కోరుకోవట్లేదని, పరిస్థితి చేయిదాటుతుంటే చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు. చైనాతో డీల్‌‌‌‌‌‌‌‌ చేయాలంటే.. ఒత్తిళ్లు, బెదిరింపులు, బ్లాక్‌‌‌‌‌‌‌‌మెయిళ్లు సరైన మార్గం కాదన్నారు. రెండు దేశాలు కలిసి కూర్చుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఈయూ మద్దతు కోరిన చైనా అధ్యక్షుడు

అమెరికా విధిస్తున్న టారిఫ్​లపై పోరాడేందుకు ముందుకు రావాలని యూరోపియన్ యూనియన్​ను జిన్​పింగ్ కోరాడు. ట్రంప్‌‌‌‌‌‌‌‌ బెదిరింపులను ప్రతిఘటించడానికి తమతో కలిసి రావాలన్నారు. యూరప్ దేశాలు తమ అంతర్జాతీయ బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు. చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను అమెరికా కాలరాస్తున్నదని మండిపడ్డారు. వాటిని కాపాడేందుకు ముందుకు రావాలన్నారు. కాగా, అమెరికా విధిస్తున్న సుంకాలపై జిన్‌‌‌‌‌‌‌‌పింగ్‌‌‌‌‌‌‌‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు ఆగ్నేయాసియా దేశాల పర్యటనకు బయల్దేరారు. డొనాల్డ్ ట్రంప్​.. వియత్నాంపై 46 శాతం,  కంబోడియాపై 49 శాతం సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలతో జిన్‌‌‌‌‌‌‌‌పింగ్‌‌‌‌‌‌‌‌ చర్చలు జరపనున్నారు.