మయన్మార్ లో తిరుగుబాటు వెనుక చైనా కుట్ర

మయన్మార్‌‌‌‌లో అర్ధ శతాబ్ద పోరాటాల తర్వాత చిగురించిన ప్రజాస్వామ్యం మూన్నాళ్ల ముచ్చటేనా? ఈ ప్రశ్న రావడానికి కారణం.. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే సాకుతో ప్రభుత్వంపై ఆ దేశ సైన్యం తిరుగుబాటు చేయడమే. ప్రజాస్వామ్య పోరాటాలు చేసిన నేత ఆంగ్ సాన్ సూకీ, ఆ దేశాధ్యక్షుడు విన్ మైంట్‌‌, పలువురు సీనియర్ నేతలను అరెస్టు చేసి, ఏడాది పాటు ఎమ‌‌ర్జెన్సీ విధిస్తున్నట్లు ఆర్మీ ప్రకటించడం ప్రపంచాన్ని షాక్‌‌కు గురిచేసింది. ఈ పరిణామాలను ఖండిస్తున్నామని ఆమెరికా ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఆ దేశం ఇరకాటంలో పడినట్టే కనిపిస్తోంది. ఈ సైనిక తిరుగుబాటుకు నేరుగా చైనా బహిరంగ మద్దతును తెలపకపోయినప్పటికీ వ్యూహాత్మకంగా మయన్మార్ సైన్యానికి సపోర్ట్ అందించిందన్న అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితమే పదవిలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ దక్షిణాసియా వ్యవహారాలపై ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది, చైనా విషయంలో ఏం స్టెప్స్‌‌ తీసుకుంటారన్నది చాలెంజింగ్‌‌గా కనిపిస్తోంది. మయన్మార్‌‌‌‌లో మళ్లీ ప్రజాస్వామ్యాన్ని నిలబెడతామనే నెపంతో చైనా ఈ రీజియన్‌‌లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే ఎలా రియాక్ట్ అవుతారన్నది కీలకంగా మారింది.

మయన్మార్‌‌‌‌లో నవంబర్‌‌‌‌లో ఎన్నికలు జరిగి బలమైన ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఎప్పటి నుంచో ప్రెసిడెంట్ పదవిపై కన్నేసిన ఆ దేశ ఆర్మీ చీఫ్​ మిన్ ఆంగ్ పక్కా ప్లానింగ్‌‌తో ఇప్పుడు ఈ పని చేసినట్లు కనిపిస్తోంది. జనవరి 20 వరకు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండడంతో ఈ సైనిక తిరుగుబాటు ఆ టైమ్‌‌లో చేసుంటే పంతానికైనా సీరియస్‌‌గా యాక్షన్ తీసుకునేవారని ఇన్నాళ్లు వెయిట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు టైమ్‌‌ చూసుకుని నవంబర్‌‌‌‌లో జరిగిన ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ప్రకటిస్తూ సైన్యం ప్రభుత్వాన్ని అధీనంలోకి తీసుకుంది. ఆ ఎలక్షన్స్‌‌ రద్దు చేశామని, మరో ఏడాది తర్వాత మళ్లీ కండక్ట్‌‌ చేస్తామని సైనిక నాయకత్వం చెబుతోంది. ముందే ఈ పని చేసుంటే ట్రంప్ రియాక్షన్ ఎలా ఉంటుందోనని మయన్మార్ సైన్యంలో ఉన్న భయం పక్కనపెడితే, చైనా సైతం కరోనా స్ప్రెడ్‌‌ వల్ల టార్గెట్‌‌గా మారి సెల్ఫ్ డిఫెన్స్‌‌లో ఉండడంతో వారికి అండగా నిలవలేకపోయేది.

ఆ ఎన్నికల్లో ఏం జరిగింది?

2015 వరకు ఐదు దశాబ్దాల పాటు అక్కడ తాత్మదా  (సైన్యం) పాలనయే కొనసాగింది. 2015లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకీకి చెందిన నేష‌‌న‌‌ల్ లీగ్ ఫ‌‌ర్ డెమోక్రసీ పార్టీ(ఎన్ఎల్డీ) ఘన విజ‌‌యం సాధించింది. అంతర్జాతీయ ఒత్తిడిలకు లొంగి 2008లో రూపొందించిన ఆ దేశ రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ లో 25 శాతం సీట్లను తాత్మదాకు రిజర్వు చేశారు. దానితో ప్రజల మద్దతుతో అధికారం చేపట్టిన సూకీకి అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తూ వచ్చారు. తాజాగా, గ‌‌త న‌‌వంబ‌‌ర్‌‌లో జ‌‌రిగిన ఎన్నిక‌‌ల్లో కూడా ఆమె పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 476 సీట్లు  ఉండగా, ఆమె పార్టీ 396 సీట్లు గెలుపొందింది. సైన్యం మద్దతుతో పోటీ చేసిన యూఎస్డీపీ 33 సీట్లనే గెలుపొందింది. అయితే ఎన్నికల ఫలితాలు రాగానే ఆ పార్టీ ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేయడం సైన్యం మొదలుపెట్టింది. ఎన్నికల్లో అక్రమాలపై ఒక కోటికిపైగా ఫిర్యాదులు నమోదు చేశారు. ఓటర్ల జాబితాల్లో లక్షలాది నకిలీ పేర్లు, ఒకే పేరు పలుసార్లు వచ్చాయని ఆరోపిస్తున్నారు. 2011లో సైనిక పాల‌‌న ముగిసిన త‌‌ర్వాత, రెండోసారి ఎన్నిక‌‌ల‌‌ను నిర్వహించారు. ఎన్నిక‌‌ల ఫ‌‌లితాల‌‌పై సైన్యం  అభ్యంత‌‌రం వ్యక్తం చేసింది. దేశాధ్యక్షుడితోపాటు ఎన్నిక‌‌ల సంఘంపై సుప్రీంకోర్టులో సైన్యం కేసు వేసింది. ఎన్నిక‌‌ల సంఘం మాత్రం ఆ ఆరోప‌‌ణ‌‌ల‌‌ను కొట్టిపారేసింది. పైగా, అంతర్జాతీయ పరిశీలకులు సైతం ఆ ఆరోపణలను ఖండించారు. ఓటర్లలో మొత్తం 83 శాతం మంది అధికార పక్షానికే మద్దతు పలికారు. ఆ దేశంలో 90కి పైగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయగా, 17 పార్టీలే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించాయి. యూఎస్డీపీ తప్ప మిగిలినవన్నీ చాలా  చిన్న, చిన్న పార్టీలు. వాటిల్లో షాన్ నాషనలైటిస్ డెమోక్రాటిక్ పార్టీ, కాయిన్ పెఒప్లెస్ పార్టీలకు బీజింగ్ తో ఉన్న సంబంధాలు బహిరంగ రహస్యమే. ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఆరోపణలు చేయడంలో ఆ పార్టీల వారే ముందున్నారు.

అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం

మయన్మార్ లోని ఒక్కో తెగకు ప్రాతినిధ్యం వహిస్తున్న చిన్న, చిన్న పార్టీలతో, ముఖ్యంగా చైనాలోని యునాన్ ప్రావిన్స్ కు సరిహద్దులో గల తూర్పు భాగంలోని పార్టీలతో చైనాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తమ ప్రాంతాలపై విస్తృతమైన స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేస్తున్న ఇటువంటి పార్టీలు, వాటికి చెందిన తీవ్రవాద బృందాలకు చైనా ఆయుధాలు, వనరులు సమకూరుస్తోంది. ఒక వంక తాత్మదాతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకొంటూనే, మరోవైపు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తీవ్రవాద బృందాలకు కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నది. మయన్మార్ అంతర్గత శాంతి ప్రక్రియలో సైతం వివిధ తెగలకు చెందిన తీవ్రవాద బృందాలు లేవనెత్తే అంశాలకు మద్దతు తెలుపుతూ చైనా ఎక్కువగా జోక్యం చేసుకొంటున్నది. శాంతి సంప్రదింపులతో చైనా ప్రతినిధులు పాల్గొంటూ శాంతియుత పరిష్కారంలో కీలక భూమిక వహిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో యూఎస్డీపీ, కొన్ని చిన్న పార్టీలు గణనీయ సంఖ్యలో సీట్లు గెల్చుకొని, తాత్మదా నామినేట్ చేసే 25% సభ్యులతో ప్రభుత్వం ఏర్పాటు చేయగలవని చైనా అంచనా వేసింది. సైన్యం కూడా తమకు అనుకూలంగా ఉండే కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పడగలదని ఎదురు చూసింది. అయితే ఎన్ఎల్డీ ఘన విజయం సాధించడంతో బీజింగ్  ప్రణాళికలతో పాటు సైన్యం అంచనాలు తలకిందులయ్యాయి. దానితో ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు వివాదం రేపడం ద్వారా సైనిక పాలన వచ్చేలా చేసినట్లు స్పష్టమవుతున్నది.

ఆర్థిక ప్రయోజనాల కోసమే..

అటు చైనా, ఇటు మయన్మార్ సైన్యం రాజకీయ ప్రయోజనాలకన్నా ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తమకు అనుకూలమైన కీలుబొమ్మ ప్రభుత్వం రావాలని కోరుకున్నాయి. మయన్మార్ లో మౌలిక సదుపాయాలు, నగరాలు, ఓడరేవులు, ఇంధన ప్రాజెక్టుల్లో చైనా లక్షలాది డాలర్లు ఖర్చు పెడుతున్నది. మయన్మార్ పెట్టుబడులతో చైనాకు మాత్రమే లాభం చేకూరేలా ఈ ప్రాజెక్టుల రూపకల్పన జరుగుతున్నది. తమ దేశంలో చైనా ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టడానికి తమ దేశం నుంచే ఎక్కువ వడ్డీ రేట్లతో రుణాలు తీసుకోవాలని మయన్మార్ ప్రభుత్వంపై చైనా ఒత్తిడి తీసుకొస్తున్నది. శ్రీలంకలోని హంబంటోట పోర్ట్ ప్రాజెక్ట్ లో చేసిన విధంగా మయన్మార్ అప్పులఊబిలో ఇరుక్కుపోయి, చైనాకు భారీ ప్రయోజనం కలిగేటట్లు చేయడమే వారి ఉద్దేశం. అయితే ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ ప్రభుత్వం చైనా ఎత్తుగడలను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది. కొన్ని ప్రాజెక్ట్ లను కూడా నిలిపి వేసింది. పైగా మయన్మార్ లో చైనా పెట్టుబడులపై నిఘా పెట్టింది. అనేక అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చి చైనాను ఇరకాటంలో పడేసింది. మరోవైపు ఆ దేశంలో పలు కీలక వ్యాపార సంస్థలను అధీనంలో ఉంచుకున్న తాత్మదా సైతం తమ సంస్థల్లోని ఆర్థిక అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తుండటం పట్ల సూకీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. వీరి ప్రాజెక్టుల్లో చాలా వాటికి చైనాలోని కార్పొరేషన్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సైన్యం కూడా తమ ఆర్థిక ప్రాజెక్టుల్లో పారదర్శకత,  జవాబుదారీతనం అమలు చేయాలని సూకీ ఒత్తిడి తెస్తూ ఉండడం వారికి ఆగ్రహం కలిగిస్తున్నది. తమ ఆర్థిక ప్రయోజనాలపై మరిన్ని ఆంక్షల ద్వారా సూకీ ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించగలదని, ఆమె తిరిగి ఘన విజయం సాధించడంతో చైనా, తాత్మదా ఆందోళన చెందారు. మరోవైపు సూకీ ఇండియాతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం కూడా చైనాకు ఆగ్రహం తెప్పించింది. ఇవన్నీ కలిసి సైనిక తిరుగుబాటుకు దారితీసినట్లు కనిపిస్తున్నది.

అమెరికా దారెటు..

అమెరికా ప్రెసిడెంట్​గా మయన్మార్ లో ప్రజాస్వామ్య ప్రక్రియ తిరిగి మొదలయ్యేలా చూడడం బైడెన్ ముందున్న కర్తవ్యం. ఈ విషయంలో చైనా సహకారం లేకుండా ఆయనేమీ చేయలేక పోవచ్చు. ఆర్థిక ఆంక్షలతో పరిష్కారం లభించదు. ఒకవైపు మయన్మార్ లో ప్రజాస్వామ్య ప్రక్రియను పునరుద్ధరించడంతోపాటు రోహింగ్యాల సమస్య పరిష్కారం విషయంలో కూడా తన పలుకుబడి ఉపయోగించడం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోడ్ అండ్ బెల్ట్ కార్యక్రమంలో భాగంగా మయన్మార్ లో తన ఆర్థిక ప్రయోజనాలకు అమెరికా భరోసా ఇచ్చేటట్లు చైనా చేసుకోవడానికి ప్రస్తుత పరిస్థితి ఉపయోగపడే అవకాశం ఉంది. మధ్య ఆసియా, హాంగ్ కాంగ్ లో నిరంకుశ విధానాలు అవలంబిస్తున్న చైనాను దారిలోకి తెచ్చుకునేందుకు ఒక విధంగా మయన్మార్ పరిణామాలు బైడెన్ కు ఒక అవకాశంగా మారే వీలుంది. ముఖ్యంగా భద్రతామండలిలో వీటో అధికారం ఉపయోగించకుండా చైనాను కట్టడి చేయవలసిన అవసరం కూడా ఉంది. స్వేచ్ఛాయుత ప్రపంచానికి తిరుగులేని నేతగా తన విదేశాంగ విధానాన్ని మలచుకోవడానికి మయన్మార్ పరిణామాలు బైడెన్ కు అవకాశంగా, మరోవైపు సవాల్ గా మారనున్నాయి.

– టి.ఇంద్రసేనారెడ్డి,

సోషల్ యాక్టివిస్ట్