బీజింగ్ : చైనా సుప్రీం కోర్టులోని ఒక జడ్జికి12 ఏండ్ల జైలు శిక్ష పడింది. సుప్రీం పీపుల్స్ కోర్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో మాజీ డైరెక్టర్, సుప్రీంకోర్టు ట్రయల్ కమిటీ సభ్యుడైన జస్టిస్ మెంగ్ జియాంగ్(58).. అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో 'సెల్ఫ్- రెక్టిఫికేషన్'లో భాగంగా అతని అవినీతిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆ రిపోర్టును మంగళవారం జెంగ్‌జౌ సిటీలోని ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టుకు సమర్పించారు. జస్టిస్ మెంగ్ జియాంగ్ తన హోదా, అధికారాన్ని ఉపయోగించి చట్ట వ్యతిరేక పనులు చేశారని రిపోర్టు వెల్లడించింది.
2003 నుంచి 2020 మధ్య కాలంలో 21 కోట్ల(22.7 మిలియన్ యువాన్లు)కు పైగా డబ్బును లంచంగా స్వీకరించాడని తెలిపింది. గడిచిన 17 ఏండ్లల్లో కీలక బాధ్యలు నిర్వహించిన ఆయన.. వివాదాలు పరిష్కరించడానికి లంచం తీసుకున్నారని ఆరోపించింది. దీనిపై కోర్టు జస్టిస్ మెంగ్ జియాంగ్ స్పందన కోరగా.. లంచం తీసుకున్నట్లు అంగీకరించారు. దాంతో జస్టిస్ మెంగ్ జియాంగ్ను కోర్టు దోషిగా నిర్ధారించింది. అతనికి 12 ఏండ్ల జైలు శిక్షతో పాటు రెండు మిలియన్ యువాన్ల(2.3 కోట్లు) జరిమానా విధించింది.