ప్లేస్‌ ఫిక్స్.. చైనా చెరలోని బాలుడి అప్పగింతకు ఓకే

ప్లేస్‌ ఫిక్స్.. చైనా చెరలోని బాలుడి అప్పగింతకు ఓకే

చైనా చెరలో ఉన్న 17 ఏళ్ల భారత బాలుడిని అప్పగించేందుకు డ్రాగన్ కంట్రీ ఎట్టకేలకు ఒప్పుకుంది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ప్రకటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా భారత్, చైనా ఆర్మీ అధికారులు హాట్‌లైన్‌ ద్వారా మాట్లాడుకున్నారని, చైనా సానుకూలంగా స్పందించిందని ఆయన తెలిపారు. తమ వద్ద ఉన్న బాలుడిని అప్పగిస్తామని చెప్పారని, ఏ ప్రాంతంలో మన ఆర్మీకి అప్పగించాలన్నదానిపైనా స్పష్టత ఇచ్చారని కేంద్ర మంత్రి రిజిజు చెప్పారు. అయితే ఎప్పుడు ఆ పిల్లాడిని మనకు అప్పగిస్తారనేది తేదీ, సమయం త్వరలోనే తెలియజేస్తారని అన్నారు. చైనా వైపు వాతావరణం అనుకూలించపోవడం వల్లే ఈ ఆలస్యమన్నారు.

కాగా, జనవరి 18న అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లా పదిహేడేళ్ల మిరామ్ తరోన్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. అతడిని చైనా సైనికులు కిడ్నాప్ చేశారంటూ  అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ తాపిర్ గావ్ గత వారంలో ట్వీట్ చేశారు. సాంగ్ పో నది అరుణాచల్ ప్రదేశ్ లోకి ప్రవేశించే చోట అతడిని కిడ్నాప్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. చైనా సైనికులు చేసిన ఘోరం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపానని.. బాధితుడ్ని త్వరగా విడిపించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కోరానని తాపిర్ తెలిపారు. దీనిపై భారత ఆర్మీ స్పందించి.. చైనా ఆర్మీతో మాట్లాడింది. తప్పిపోయిన బాలుడి ఫొటో, ఇతర వివరాలను చైనా ఆర్మీకి అందించింది. మొదట తాము కిడ్నాప్ చేయలేదని చెప్పిన చైనా ఆర్మీ.. ఆ తర్వాత తాము అతడిని తమ ప్రాంతంలో గుర్తించామని, అప్పగించేందుకు సిద్ధమని చెప్పడం గమనార్హం.  2020 సెప్టెంబర్‌‌లోనూ చైనా అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి ఐదుగురిని కిడ్నాప్ చేసి, దాదాపు వారం తర్వాత మళ్లీ విడిచిపెట్టింది.

మరిన్ని వార్తల కోసం..

పద్మ పురస్కారాన్ని తిరస్కరించిన లెజెండరీ సింగర్

వైరల్ వీడియో: ఇది కదా జెండావందనం అంటే..

స్టేడియంలో శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన క్రికెటర్