మసూద్ అజార్ విషయంలో ఇండియా పదేళ్ల నుంచి మడమ తిప్పకుండా పోరాటం చేస్తోంది. 2009లో ఇండియా ఒంటరిగా ఈ పోరాటం మొదలెట్టింది. తర్వాత అమెరికా, ఫ్రాన్స్ , బ్రిటన్, రష్యా దేశాల మద్దతు లభించింది. అయితే కేవలం ఒకే ఒక్క కారణంతో ఇండియా ప్రయత్నాలు ఫలించలేదు. అదే, పొరుగుదేశం చైనా అడ్డుపుల్లలు వేయడమే. అజార్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించడానికి అవసరమైన డాక్యుమెంట్లు లేవంటూ ఇండియా ప్రయత్నాలను చైనా అడ్డుకుంది. చివరకు అన్ని దేశాల నుంచి ఒత్తిడి పెరగడంతో మసూద్ విషయంలో యూ టర్న్ తీసుకుంది. చివరకు ఇండియా పోరాటం ఫలించింది. ఏమైనా అజార్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించడం మనదేశ దౌత్య విధానానికి నిస్సందేహంగా విజయమే.
చైనా వైఖరిలో మార్పు ఎందుకు ? …
మసూద్ విషయంలో మూడు కారణాలతో చైనా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.మసూద్‌ను గ్లోబల్ టెర్రరిస్టు గా ప్రకటించాలని ఇండియా గతంలో ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా చైనా అడుగడుగునా అడ్డుతగిలింది. ఈ విషయంలో తన మిత్రదేశమైన పాకిస్తాన్ కు వంత పాడింది. అయితే చైనా అనుసరించిన వైఖరిని ప్రపంచ దేశాలు వ్యతిరేకించాయి. ఒకదశలో ఒకేఒక్క పాకిస్తాన్ కోసం మిగతా దేశాలన్నిటినీ చైనా దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో బీజింగ్ ఆలోచనలో పడింది. పాకిస్తాన్ తో ఫ్రెండ్ షిప్ కు ఏదో ఒక రోజు చాలా ఖరీదైన మూల్యం చెల్లించాల్సి వస్తుందని అంచనా వేసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తో దోస్తానా సంగతిని పక్కనపెట్టి మసూద్ విషయంలో ఇండియా డిమాండ్‌కు తలవంచింది. రెండో కారణం, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి. మసూద్ ఇష్యూను ఫ్రాన్స్, బ్రిటన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మసూద్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు సేకరించాయి. మసూద్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించడానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకున్నాయి. పరిస్థితి చేయిదాటుతోందన్న సిగ్నల్స్ చైనాకు అందాయి. అంతర్జాతీయ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. 2009 నాటి పరిస్థితులు 2019 లో లేవు. 2009 లో ఇండియా ఏకాకి. ఇప్పుడు ఇండియా ఏకాకి కాదు. అగ్రరాజ్యమైన అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ ఇండియాకు అండగా నిలిచాయి. టెర్రరిజానికి వ్యతిరేకంగా గళమెత్తాయి. అజార్ ఇష్యూ పై ఒక తాటిపైకి వచ్చాయి. ఈ పరిస్థితిని తక్కువగా అంచనా వేయడం వల్ల రాబోయే రోజుల్లో కలిగే నష్టం అంచనా వేయలేని అమాయక దేశం కాదు చైనా. అంతర్జాతీయంగా ఎక్కడ తగ్గాలో చైనాకు బాగా తెలుసు. దీంతో ఇండియా ప్రతిపాదనకు ఓకే చెప్పింది.
మార్చిలోనే సిగ్నల్స్ ఇచ్చిన చైనా …
మసూద్ అజార్ ఇష్యూకు సంబంధించి చైనా అకస్మాత్తుగా తన వైఖరిని మార్చుకోలేదు. ఈ విషయానికి సంబంధించి మార్చిలోనే చైనా సిగ్నల్స్ ఇచ్చింది. మసూద్ అజార్ ఇష్యూ త్వరలోనే పరిష్కారం అవుతుందని మనదేశంలో చైనా రాయబారి లూయో ఝూవోహుయి సూచనప్రాయంగా చెప్పారు. మసూద్ ఇష్యూపై ఇండియా ఆవేదనను తాము అర్థం చేసుకోగలమని ఆయన అన్నారు. కొన్ని సమస్యల కారణంగానే అజార్ ఇష్యూ ఒక కొలిక్కి రావడం లేదన్నారు. తమ మీద నమ్మకం ఉంచాలని చైనా రాయబారి లూయో ఇండియాను కోరారు. అజార్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించే విషయంలో భద్రతామండలి ఆంక్షల కమిటీతో తాము కలిసి పనిచేస్తున్నామన్నారు. ఇండియా ప్రతిపాదనను హోల్డ్ లో పెట్టడాన్ని అడ్డుకోవడంగా అర్థం చేసుకోకూడదని లూయో చెప్పారు.
సెక్యూరిటీ కౌన్సిల్లో నాలుగుసార్లు ప్రతిపాదన…
మసూద్ అజార్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించడానికి సంబంధించిన ప్రతిపాదన భద్రతా మండలి లో నాలుగుసార్లు చర్చకు వచ్చింది. 2009 లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తొలిసారి అజార్ ఇష్యూ పై చర్చ జరిగింది. అప్పట్లో అజార్ ఇష్యూపై ఇండియా ఒంటరిగా ప్రతిపాదన తీసుకు వచ్చింది. రెండోసారి 2016 లో ప్రతిపాదన వచ్చింది. ఇండియా ప్రతిపాదనకు అమెరికా, ఫ్రాన్స్, యూకే మద్దతు ఇచ్చాయి. 2017 లో మరోసారి ఈ ప్రపోజల్ వచ్చింది. ఈ ఏడాది మరోసారి అజార్ ఇష్యూ చర్చకు వచ్చింది. అజార్ ను గ్లోబల్ టెర్రరిస్టు గా ప్రకటించాలంటూ అమెరికా, ఫ్రాన్స్ , యూకే ప్రతిపాదన తీసుకువచ్చాయి. ఈ ప్రతిపాదనకు భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల్లో 14 సభ్యదేశాలు మద్దతు పలికాయి. అయితే చైనా తనకున్న వీటో అధికారంతో అడ్డుకుంది.
మసూద్ వెనుక ఎవరున్నారు ? …
జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ వెనుక చాలా టెర్రరిస్టు సంస్థలున్నాయి. వీటిలో లష్కరే తోయిబా చాలా ముఖ్యమైంది. జైషే మహమ్మద్ ఏర్పాటు చేయకముందు అనేక టెర్రరిస్టుల సంస్థలను నిధులు సేకరించడంలో అజార్ కీలక పాత్ర పోషించారు. దీంతో ముస్లిం దేశాల నుంచి ఆపరేట్ చేసే చాలా టెర్రరిస్టు ఆర్గనైజేషన్స్ కు ఆయన కావాల్సిన వాడయ్యాడు.
మసూద్ వెరీ డేంజరస్ …
మసూద్ అజార్ చాలా డేంజరస్. ఇండియా అంటే విపరీతమైన ద్వేషం. కాశ్మీర్ ను ఇండియా నుంచి విడగొట్టి పాకిస్థాన్ లో కలిపేయాలన్నది ఇతగాడి కల. మసూద్ అజార్ సొంతూరు పాకిస్థాన్ లోని పంజాబ్ బహవల్ పూర్. దీనికితోడు డైరీ ఫామ్, పౌల్ట్రీ ఫామ్ కూడా ఉండేవి. 21 ఏళ్ల వయసులో హర్కల్ ఉల్ ముజాహిదీన్ నాయకుల ప్రభావానికి లోనయ్యాడు. 1994 లో పోర్చుగీసు పాస్ పోర్టుతో ఇండియాలోకి చొరబడ్డాడు. భద్రతాదళాలకు దొరికిపోయాడు. జైల్లో వేశారు. ఈ నేపథ్యంలో 1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని కొంతమంది టెర్రరిస్టులు హై జాక్ చేశారు. విమానాన్ని ఆఫ్ఘనిస్థాన్ లోని కాందహార్ కు మళ్లించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో హైజాకర్ల డిమాండ్ మేరకు అజార్ తో పాటు మరికొంతమందిని ఇండియా విడిచి పెట్టింది.
పార్లమెంట్ పై దాడి సూత్రధారి మసూదే..
ఇండియాను టార్గెట్ గా చేసుకుని మసూద్ ‘జైషే మహమ్మద్ ’ పేరుతో ఓ టెర్రరిస్టు ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేశాడు. ఇండియాలో అస్థిరత సృష్టించడమే ఈ సంస్థ లక్ష్యం. అప్పటి నుంచి జైషే మహమ్మద్ అనేక దాడులకు పాల్పడింది. ఇండియాలో రక్తపాతం సృష్టించింది.2001 లో పార్లమెంటు పై దాడి చేసింది. ఆ ఏడాది డిసెంబర్ 13న ఈ ఘాతుకం జరిగింది. పార్లమెంటు పై దాడి సంఘటనలో తొమ్మిదిమంది చనిపోయారు. 2001 అక్టోబరు 1న శ్రీనగర్ లోని జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ పై ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో 31 మంది చనిపోయారు. 2016 పఠాన్ కోట్ దాడుల వెనక కూడా అజార్ ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామా లో జైషే మహమ్మద్ సంస్థ ఆత్మాహుతి దాడికి తెగబడింది. 41 మంది సీఆర్ పీఎఫ్ జవాన్ల ప్రాణాలు తీసింది.
పుల్వామా ఎటాక్ ప్లాన్ చేసింది కూడా..
వ్యూహాలు పన్నడంలో మసూద్ అజార్ దిట్ట. జైషే మహమ్మద్ సంస్థకు చెందిన టెర్రరిస్టులతో దాడులు చేయిస్తే నిఘా సంస్థలతో తేలికగా పసి గడతాయని మసూద్ అంచనా వేశాడు. దీనికి విరుగుడుగా ‘ గ్రేడ్ సీ ’ అనే కొత్త టెక్నిక్ తో దాడులు చేయించాడు. కాశ్మీర్ లో టెర్రరిజానికి ఆకర్షితులైన యువతను ఎరగా వేశాడు మసూద్. వారిని తమ సంస్థ లో చేర్చుకుని ట్రైనింగ్ ఇచ్చాడు. అలా గ్రేడ్ సీ కేడర్ అయిన ఆదిల్ తో పుల్వామాలో ఆత్మాహుతి దాడి చేయించాడు.
పాకిస్థాన్ కు ఎందుకంత ప్రేమ ? ….
మసూద్ అజార్ కార్యకలాపాలతో తమకు సంబంధం లేదని పాకిస్థాన్ కల్లబొల్లి కబుర్లు చెబుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అజార్ కు పాక్ బ్రహ్మరథం పడుతుంది. పాకిస్థాన్ విదేశీ విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ఫేస్ గా మసూద్ అజార్ ను పేర్కొంటారు. పాక్ సైన్యంలో ఆయనను ఒక భాగంగా అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతారు. పాకిస్థాన్, అజార్ ఇద్దరి లక్ష్యం ఒక్కటే …ఇండియాలో అస్థిరత సృష్టించడమే.
‘ గ్లోబల్ టెర్రరిస్టు ’ ముద్ర పడితే …
మసూద్ అజార్ కు ‘ గ్లోబల్ టెర్రరిస్టు ’ ముద్ర పడటంతో భద్రతా మండలిలోని సభ్యదేశాలన్నీ అతడిని టెర్రరిస్టుగానే చూస్తాయి. ఆజార్ ఆస్తిపాస్తులతో పాటు అతడితో సంబంధం ఉన్న అన్ని సంస్థల ఆస్తులనూ ఫ్రీజ్ చేస్తారు. జైషే మహమ్మద్ సంస్థకు ఎక్కడ నుంచి రూపాయి కూడా విరాళం రాకుండా చర్యలు తీసుకుంటారు. నిధుల మీద నిఘా పెడతారు. నిధులు వచ్చే అన్ని దారులను మూసివేస్తారు. అజార్ పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాలను క్లోజ్ చేస్తారు. అంతేకాదు విదేశాలకు టూర్ల కు వెళ్లే అవకాశం కూడా మసూద్ కోల్పోతాడు. మసూద్ ఒక్కడిపైనే కాదు….జైషే మహమ్మద్ సంస్థ సభ్యులందరి విదేశీ పర్యటనలపై నిషేధం అమల్లోకి వస్తుంది. అంతర్జాతీయంగా అన్ని వైపుల నుంచి కట్టడి పెరుగుతుంది.