బీజింగ్ : నిప్పుతో చెలగాటం అడొద్దంటూ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ను చైనా హెచ్చరించింది. తైవాన్ తమ భూభాగమేనని వాదిస్తున్న చైనా.. ఇటీవల తైవాన్లో జరిగిన అధ్యక్ష ఎన్నికలను గుర్తించలేదు. అయితే, తైవాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన లాయ్ చింగ్ తెకు శుభాకాంక్షలు చెబుతూ ఫెర్డినాండ్ మార్కోస్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై చైనా తీవ్రంగా మండిపడింది.
ఫిలిప్పీన్స్ రాయబారికి మంగళవారం సమన్లు పంపి వివరణ ఇవ్వాలని కోరింది. దీనికి సంబంధించి చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ విలేకర్లతో మాట్లాడారు. ‘‘చైనా అంతర్గత వ్యవహారాల్లో ఫిలిప్పీన్స్ జోక్యం చేసుకుంది. ఫెర్డినాండ్ వ్యాఖ్యలు చైనా, ఫిలిప్పీన్స్ మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను తీవ్రంగా దెబ్బ తీశాయి” అని అన్నారు.