
చటౌరాక్స్ (ఫ్రాన్స్) : పారిస్ ఒలింపిక్స్‌లో తొలి గోల్డ్ మెడల్‌ను చైనా ఖాతాలో వేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో టాప్ ప్లేస్ సాధించిన చైనా తన పతకాల ఖాతా తెరిచింది. చటౌరాక్స్ సిటీలోని ఒలింపిక్ షూటింగ్ రేంజ్‌లో శనివారం జరిగిన ఫైనల్లో 17 ఏండ్ల హువాంగ్ యుటింగ్, 19 ఏండ్ల షెంగ్ లిహవోతో కూడిన చైనా మిక్స్‌డ్ టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో 16–12తో కెయు జిహ్యెన్–పార్క్ హజున్‌తో కూడిన సౌత్ కొరియా జట్టుపై గెలిచింది. కొరియన్స్ సిల్వర్ సాధించారు. అంతకుముందు బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో నెగ్గిన కజకిస్తాన్ (అలెగ్జాండ్రా- –సప్టయెవ్) పారిస్‌లో తొలి పతకం అందుకున్న దేశంగా నిలిచింది.
పోటీల తొలి రోజే చైనా రెండో గోల్డ్ కూడా అందుకుంది. షూటింగ్‌లో మెరిసిన తర్వాత డైవింగ్‌లో బంగారు పతకం గెలిచింది. డైవింగ్ స్పోర్ట్‌లో కొన్ని దశాబ్దాలుగా చైనా హవా నడుస్తోంది. టోక్యోలో ఎనిమిది ఈవెంట్లకు గాను ఏడు గోల్డ్ మెడల్స్ సాధించింది. పారిస్‌లో విమెన్స్ సింక్రనైజ్‌డ్ 3–మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్‌లో చాంగ్ యని–చెన్ యివెన్ చైనీస్ టీమ్‌కు తొలి గోల్డ్ అందించారు. అమెరికా (సారా బెకాన్–కాసిడి కూక్) సిల్వర్, బ్రిటిష్ టీమ్ (యాస్మిన్ హార్పర్–స్కార్లెట్ జెన్సెన్) బ్రాంజ్ గెలిచాయి.