రామోజీరావు.. తెలుగు సంస్కృతికి చిరునామా: చినజీయర్ స్వామి

రామోజీరావు.. తెలుగు సంస్కృతికి చిరునామా: చినజీయర్ స్వామి

శంషాబాద్, వెలుగు: రామోజీ గ్రూప్​సంస్థల అధినేత రామోజీరావు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు చిరునామా అని ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి చెప్పారు. రామోజీరావు మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు భాషను సుసంపన్నం చేయడంతోపాటు, తెలుగు వారి గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. తెలుగు సినీ రంగానికి గౌరవాన్ని తెచ్చిన వ్యక్తి పరమపదించడం బాధాకరమన్నారు. ఆయనకు భగవంతుని పాదాల చెంత చోటు దక్కాలని, రామోజీరావు ఉద్యమాన్ని వారి కుటుంబ సభ్యులు కొనసాగించేలా శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

రామోజీరావు మృతి మీడియాకు తీరని లోటు

ఖైరతాబాద్: భారతీయ జర్నలిజంలో అనేక రికార్డులు నెలకొల్పిన రామోజీరావు మరణం మీడియా రంగానికి తీరని లోటని హైదరాబాద్​ప్రెస్​క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్.వేణుగోపాలనాయుడు, రవికాంత్​రెడ్డి అన్నారు. తెలుగు పదానికి కొత్త ఒరవడి నేర్పి, సామాన్య పాఠకులకు పత్రికను చేర్చిన ఘనత రామోజీరావుదేనని కొనియాడారు. వేల మంది జర్నలిస్టులను అందించిన ఆయన భావి తరాలకు ఆదర్శమన్నారు. అలాగే రామోజీరావు మృతిపై ప్రెస్​క్లబ్​మాజీ అధ్యక్షుడు విజయకుమార్​రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.