
- అన్ని రకాల వస్తువులకూ వర్తిస్తుంది
- ఈ నెల 10 నుంచి అమలు
- ఏకపక్షంగా అమెరికా బెదిరింపులకు పాల్పడుతున్నదని ఆగ్రహం
బీజింగ్: అమెరికా, చైనా మధ్య టారిఫ్ వివాదం మరింత ముదిరింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తమ దేశంపై విధించిన టారిఫ్ లకు చైనా కౌంటర్ ఇచ్చింది. అమెరికా నుంచి దిగుమతయ్యే అన్ని రకాల వస్తువులపై 34 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 10వ తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
చైనా వస్తువులపై అమెరికా భారీ పన్నులు విధించడం ఇంటర్నేషనల్ ట్రేడ్ రెగ్యులేషన్‌కు విరుద్ధమని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకపక్షంగా ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతున్నదని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘లిబరేషన్ డే’పేరుతో పలు దేశాలపై కొత్త సుంకాలను ప్రకటించారు. ఇందులో చైనాపై 34 శాతం అదనపు సుంకాలు విధించారు.
దీంతో చైనా నుంచి వచ్చే వస్తువులపై మొత్తం సుంకం 54 శాతానికి (ఇప్పటికే ఉన్న 20% కలిపి) చేరింది. ఈ టారిఫ్ ఈ నెల 9వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, ట్రంప్ వైఖరిపై చైనా కామర్స్ మినిస్ట్రీ కూడా ఫైర్ అయింది. వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే ఏడు రకాల అరుదైన ఎర్త్ ఎలిమెంట్స్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా విధిస్తున్న టారిఫ్‌లపై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో)లో లాసూట్ ఫైల్ చేసినట్లు వెల్లడించింది.
చైనాలోని టారిఫ్ లా, కస్టమ్స్ లా, విదేశీ వ్యాపార చట్టం, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ప్రకారం స్టేట్ కౌన్సిల్ ఆమోదంతో అమెరికాపై తాజాగా 34 శాతం పన్నులు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చైనా నుంచి అమెరికాకు బయల్దేరి.. మార్గం మధ్యలో ఉన్న సరకులు మే 13లోపు చేరుకుంటే.. వాటికి మాత్రం 34 శాతం పన్ను నుంచి మినహాయింపు ఉంటుందని ప్రకటించింది.
చైనా నుంచి అమెరికాకు ఏటా సుమారు రూ.38 లక్షల కోట్లు విలువ చేసే వస్తువులు ఎగుమతి అవుతుంటాయి. అమెరికాతో వాణిజ్య చర్చలపై చైనా స్పందిస్తూ.. తాము టారిఫ్ వార్‌పై అమెరికాతో టచ్‌లో ఉన్నామని తెలిపింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని వెల్లడించింది.
‘ఎక్స్’పై భారీ జరిమానాకు ఈయూ నిర్ణయం!
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కు సంబంధించిన ‘ఎక్స్’ (ట్విటర్)పై భారీ జరిమానా విధించేందుకు యూరోపియన్ యూనియన్ రెగ్యులేటర్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ (డీఎస్ఏ)ను ‘ఎక్స్’ ఉల్లంఘించినట్లు ఈయూ రెగ్యులేటర్లు ఆరోపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే రూ.8,500 కోట్ల వరకు జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లోనే దీనిపై అధికారికంగా ప్రకటన ఉంటుందని ‘న్యూయార్క్ టైమ్స్’ న్యూస్ పబ్లిష్ చేసింది. నిషేధిత కంటెంట్, తప్పుడు సమాచారం వ్యాప్తిని అడ్డుకోవడంలో ‘ఎక్స్’ విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే, ఈయూ రెగ్యులేటర్లు లేవనెత్తిన అంశాలపై ‘ఎక్స్’ మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందిస్తే జరిమానా నుంచి తప్పించుకునే అవకాశం ఉందని కూడా న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ప్రస్తుతానికి, ఈ విషయంలో తుది నిర్ణయం ఇంకా ప్రకటించలేదు.