- ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనంతో విషయం వెలుగులోకి
వాషింగ్టన్: వందలాది యుద్ధనౌకలు, పదులకొద్దీ జలాంతర్గాములతో ప్రపంచంలోనే బలమైన నేవీని ఏర్పాటు చేసుకున్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డ్రాగన్ కంట్రీ కొత్తగా తయారు చేసుకున్న అధునాతన అణు జలాంతర్గామి ఒకటి నీటిలో మునిగిపోయింది. వుచాంగ్ షిప్ యార్డు వద్ద ఈ ఏడాది మే=జూన్ మధ్య కాలంలో జరిగిన ఈ ఘటనను చైనా గోప్యంగా ఉంచిందని ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. షిప్ యార్డు వద్ద భారీ క్రేన్లతో జలాంతర్గామిని నిలిపి ఉంచారని, కానీ కొన్ని రోజుల వ్యవధిలో అది గల్లంతు అయినట్టు ‘ప్లానెట్ ల్యాబ్స్’ సంస్థ శాటిలైట్ ఇమేజెస్‌ను బట్టి తెలిసిందని పేర్కొంది.
చైనా సబ్ మెరైన్ మునక నిజమేనని అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు గురువారం కన్ఫమ్ చేశారు. మిలిటరీ కెపాసిటీని వేగంగా పెంచుకుంటూ పోతున్న చైనాకు ఈ ఘటన గట్టి ఎదురుదెబ్బగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, సబ్ మెరైన్ మునక గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై వాషింగ్టన్ లోని చైనీస్ ఎంబసీ అధికార ప్రతినిధిని మీడియా ప్రశ్నించగా.. దీనిపై తమకు తగిన సమాచారం అందుబాటులో లేదని తెలిపారు.
సబ్ మెరైన్ మునిగిపోయిన సమయంలో అందులో అణు ఇంధనం ఉందా? లేదా? అన్నదీ తెలియదన్నారు. అలాగే, తైవాన్ రక్షణ మంత్రి వెల్లింగ్టన్ కూ సైతం చైనీస్ సబ్ మెరైన్ మునకపై తమకు నిఘా సమాచారం అందిందని శుక్రవారం వెల్లడించారు. కాగా, మునిగిపోయిన కొత్త సబ్ మెరైన్ ఫస్ట్ క్లాస్ కు చెందిన, అణు ఇంధనంతో నడిచే జలాంతర్గామి అని.. దీని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించేలా తయారు చేశారని చెప్తున్నారు.