
సాధారణంగా ఆటల్లో ఆరు పదుల వయసుకు దగ్గరైన వాళ్లు కోచ్‌లు, మేనేజర్లు, అడ్మినిస్ట్రేటర్లుగా కనిపిస్తుంటారు. కానీ, చైనాలో పుట్టి.. చిలీలో సెటిలైన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ జెంగ్ జియింగ్ మాత్రం ఏకంగా 58 ఏండ్ల వయసులో పారిస్ ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేస్తోంది. ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేస్తున్న ఓల్డెస్ట్ టీటీ ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. ఆమె ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంది. టీనేజ్‌లోనే చైనా నేషనల్ టీమ్‌కు ఆడే స్థాయికి ఎదిగింది. కానీ 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ గేమ్స్‌కు సెలెక్ట్ అవ్వలేదన్న నిరాశతో 20 ఏండ్లకే కెరీర్‌కు రిటైర్మెంట్ ఇచ్చింది.
తనను కాదన్న చైనాను వదిలేసి.. చిలీకి మకాం మార్చేసింది. 1989లో అక్కడ స్కూల్‌లో కోచ్‌గా కోచింగ్ ఆరంభించింది. కానీ, నాలుగేండ్ల కిందట కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో తిరిగి ప్లేయర్‌గా స్టేడియంలోకి రావాలనుకుంది. అంతే, కోచింగ్‌ను పక్కనపెట్టి తనలోని ప్రొషెషనల్ ప్లేయర్ల్‌ను బయటకు తీసింది. గతేడాది చిలీ టీమ్ పాన్ అమెరికన్ గేమ్స్‌తో ఆ దేశం తరఫున అరంగేట్రం చేసింది. చిలీ జట్టు బ్రాంజ్ మెడల్ నెగ్గడంలో పాలు పంచుకున్న ఆమె పారిస్ గేమ్స్‌కు ఎంపికైంది. దాంతో చైనాకు ఆడిన నాలుగు దశాబ్దాల తర్వాత ఇప్పుడామె చిలీ తరఫున ఒలింపిక్ అరంగేట్రం చేస్తోంది.
పట్టువదలకుండా పోరాటం చేస్తే అనుకున్నది సాధించవచ్చని అనేందుకు జియాంగ్ ప్రత్యక్ష ఉదాహరణ. ‘నేను నా దేశాన్ని (చిలీ) ప్రేమిస్తున్నా. చైనాలో నా కలను నెరవేర్చుకోలేకపోయా. కానీ, ఇప్పుడు ఇక్కడ నిలిచా. ఏదేమైనా సరే పట్టువదలకుండా పోరాడటం ముఖ్యం’ అని జియాంగ్ అంటోంది.