అమెరికా కొంపముంచిన చైనా హ్యాకర్లు.. ఏకంగా ఖజానా పైనే కన్నేసి 400 కంప్యూటర్లను హ్యాక్ చేశారు !

అమెరికా ఆర్థిక శాఖపై చైనా హ్యాకర్లు దాడి చేశారు. ఏకంగా అమెరికా ఆర్థిక కార్యదర్శి జానెట్ ఎల్లెన్ కంప్యూటర్ను చైనా హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఆమె కంప్యూటర్లోని విలువైన సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించినట్లు సమాచారం. జానెట్ ఎల్లెన్ కంప్యూటర్ తో పాటు ఆమె లెఫ్టినెంట్స్ అయిన డిప్యూటీ సెక్రటరీ వ్యాలీ ఆడెమ్, మరో సెక్రటరీ బ్రాడ్ స్మిత్ కంప్యూటర్లలోని డేటాను కూడా హ్యాకర్లు దొంగిలించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. జానెట్ ఎల్లెన్ కంప్యూటర్ హ్యాక్ చేసిన హ్యాకర్లు దాదాపు 50కి పైగా ఫైల్స్ యాక్సెస్ తీసుకుని డేటా చోరీకి పాల్పడినట్లు తెలిసింది.

అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఫీచర్స్తో ఉండే అమెరికా ఆర్థిక శాఖ కంప్యూటర్లపైనే చైనా హ్యాకర్లు దాడి చేయడంతో యూఎస్లో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అమెరికా ఆర్థిక శాఖకు చెందిన వందల కొద్దీ సిస్టమ్స్ను చైనా హ్యాకర్లు హ్యాక్ చేయడంతో అమెరికా పాలనా యంత్రాంగంలో టెన్షన్ నెలకొంది. అమెరికా ట్రెజరీపై హ్యాకర్లు దాడి చేయడం ఇప్పుడు కొత్తేమీ కాదు. ఇప్పుడు దాదాపు 400 కంప్యూటర్లను హ్యాకర్లు హ్యాక్ చేసినట్లు తెలిసింది. 

ALSO READ | ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఖరారుకాని కాల్పుల విరమణ ఒప్పందం

అయితే.. డిసెంబర్ 2024లోనే అమెరికా ఆర్థిక శాఖపై చైనా హ్యాకర్లు సైబర్ దాడికి పాల్పడినట్లు యూఎస్ అప్పట్లో తెలిపింది. అమెరికా ఆర్థిక శాఖలోని ముఖ్యమైన డాక్యుమెంట్లను దొంగిలించేందుకు చైనా హ్యాకర్లు యత్నించారని, సాఫ్ట్వేర్ సేవలందించే థర్డ్ పార్టీ కంపెనీ ‘బియాండ్ ట్రస్ట్’ నెట్ వర్క్ లో ఉన్న లోపాలను వాడుకుని హ్యాకర్లు ఈ సైబర్ దాడికి పాల్పడ్డారని అమెరికా ఆర్థిక శాఖ జనవరి, 2025 నెలారంభంలో తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా చైనా హ్యాకర్లు చేసిన సైబర్ దాడిలో 3వేలకు పైగా ఫైల్స్కు సంబంధించిన డేటా, ఉద్యోగుల యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ యాక్సెస్ను హ్యాకర్లు పొందినట్లు తెలిసింది.