వీడు మామూలోడు కాదు.. లేని ఉద్యోగుల పేరుతో 8 ఏండ్లు జీతం తీస్కున్నడు

వీడు మామూలోడు కాదు.. లేని ఉద్యోగుల పేరుతో 8 ఏండ్లు జీతం తీస్కున్నడు
  • చైనాలో ఓ హెచ్చార్ మేనేజర్ నిర్వాకం
  • 19 కోట్లు కాజేసినట్లు కంపెనీ వెల్లడి

బీజింగ్: చైనాలో ఓ హెచ్చార్ మేనేజర్ తను పనిచేస్తున్న కంపెనీని మోసం చేసి డబ్బులు దండుకున్నాడు. టెంపరరీ బేసిస్ మీద ఉద్యోగులను నియమించినట్లు చూపించి వారి పేరుతో జీతం తీసుకున్నాడు. ఒకటి రెండేండ్లు కాదు ఏకంగా ఎనిమిదేండ్ల పాటు ఈ మోసాన్ని ఎవరూ గుర్తించనేలేదు. దీంతో సంస్థకు 16 మిలియన్లు (రూ.19 కోట్లకు పైగా) నష్టం వాటిల్లిందని ఆడిట్​లో తేలింది. కంపెనీని మోసం చేసినందుకు సదరు హెచ్ఆర్ మేనేజర్​కు షాంఘై కోర్టు పదేండ్ల జైలుశిక్షతో పాటు రూ.1.30 కోట్ల జరిమానా విధించింది. సౌత్​ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రచురించిన కథనం ప్రకారం.. షాంఘైకి చెందిన ఓ కంపెనీలో యాంగ్ హెచ్ఆర్ మేనేజర్​గా పనిచేశాడు. 

మేనేజర్ కావడంతో సదరు ప్లాంట్​లో నియామకాలు, జీతాల చెల్లింపులన్నీ యాంగ్ చేతులమీదుగానే జరిగేవి. వాటిపై తనిఖీ కూడా ఉండేది కాదు. దీనిని అడ్వాంటేజ్​గా తీసుకున్న యాంగ్.. 2014లో 22 మందిని టెంపరరీ బేసిస్ మీద నియమించినట్లు రికార్డులు సృష్టించాడు. అన్నీ తన కంట్రోల్​లోనే ఉండడంతో ఆ 22 మంది  రోజూ డ్యూటీకి వస్తున్నట్లు హాజరు వేశాడు. నెల నెలా వారి జీతాలను తీసుకునేవాడు. ఇలా ఎనిమిదేండ్ల పాటు సంస్థను మోసం చేశాడు. 

అయితే, ఇటీవల ఈ 22 మందిలో ఓ ఉద్యోగి టంచనుగా డ్యూటీకి వస్తున్నట్లు అటెండెన్స్ రిజిస్టర్ లో ఉన్నా కంపెనీలో ఎప్పుడూ కనిపించనే లేదని కొంతమంది ఉద్యోగులు గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విచారణ జరిపించగా.. మొత్తం 22 మంది ఉద్యోగులు కేవలం అటెండెన్స్ రిజిస్టర్లలో తప్ప ఎక్కడా లేరని బయటపడింది. దీంతో యాంగ్ ను పోలీసులకు అప్పగించగా వారు కోర్టు ముందు నిలబెట్టారు. విచారణలో ఫ్రాడ్ నిజమేనని తేలడంతో న్యాయస్థానం అతడికి పదేండ్ల జైలు శిక్ష విధించింది. రూ.కోటి పరిహారం చెల్లించాలని ఆదేశించింది.