‘అతి సర్వత్రా వర్జయేత్’ అని చెబుతుంటారు. అంటే.. ఎక్కువ చేయడం ఏ విషయంలో మంచిది కాదని అర్థం. ఎక్కువగా తినడం, ఎక్కువగా నిద్రపోవడం.. ఇలా ఏ విషయంలో ఎక్కువ చేసినా మున్ముందు ఇబ్బందులు తప్పవు. చైనాలో ఒక 24 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ విషయంలో ఇదే జరిగింది. చివరకు ఆమె ప్రాణాలే కోల్పోయిన పరిస్థితి తెచ్చుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఛాలెంజ్లు విసిరేవాళ్లు, ఛాలెంజ్లు స్వీకరించేవాళ్లు ఎక్కువైపోయారు. ఈ ఛాలెంజెస్నే తమ కంటెంట్గా ఎంచుకుని మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న వాళ్లూ ఉన్నారు. అలాంటి వాళ్లలో చైనాకు చెందిన పాన్ జియోటింగ్ (Pan Xiaoting) అనే 24 ఏళ్ల యువతి ఒకరు. ఆమె ఇటీవల యాక్సెప్ట్ చేసిన ఛాలెంజ్ ప్రాణాలు తీసింది. 10 గంటలకు పైగా తింటూనే ఉంటానని ఆమె లైవ్ పెట్టింది. 10 కేజీల ఫుడ్ తిని చూపిస్తానని ఛాలెంజ్ చేసింది. ఇలాంటి ఛాలెంజ్లు వద్దని ఆమె కుటుంబం, శ్రేయోభిలాషులు చెప్పినా ఆమె పట్టించుకోలేదు. ఇలా అతిగా తినడాన్నే ప్రొఫెషన్ గా ఎంచుకుంది. ఇలా అతిగా తింటూ లైవ్ వీడియో చేయడాన్ని ముక్ బ్యాంగ్ (Mukbang Streaming) స్ట్రీమింగ్ అంటారు.
ఈ వీడియోల ద్వారా పాన్ జియోటింగ్ బాగానే సంపాదించింది. డబ్బు మాత్రమే కాదు ఆమె ఫ్యాన్స్ ఆమెకు గిఫ్ట్స్ కూడా పంపేవారు. అంతలా ఈ వీడియోలు కలిసొస్తుండటంతో మరింత ప్రొఫెషనల్ గా వీడియోస్ ఉండటం కోసం ఒక స్టూడియోనే ఏర్పాటు చేసుకోవాలని ఆమె డిసైడ్ అయింది. ఇందుకోసం ఆమె పెద్ద టాస్క్ నే ఎంచుకుంది. సింగిల్ సెషన్లో, 10 గంటల్లో 10 కేజీల ఫుడ్ తింటూ లైవ్ వీడియో చేయాలని డిసైడ్ అయింది. జులై 14న ఆమె ఈ సెషన్ ను మొదలుపెట్టింది. అలా అతిగా తినడమే ఆమె ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఆమె చనిపోయే సమయానికి శరీర బరువు 300 కేజీలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గతంలో కూడా అతిగా తిని ఆసుపత్రి పాలైంది. గ్యాస్ట్రిక్ బ్లీడింగ్ సమస్యతో ఆసుపత్రిలో చేరి అప్పట్లో ప్రాణాలతో బయటపడింది. ఈసారి ప్రాణమే పోయింది. ఆమె చనిపోవడానికి కడుపులో జీర్ణం కాని ఫుడ్ ఉండిపోవడం, పొట్ట లోపలంతా ఫుడ్ కారణంగా పాడైపోవడం కారణం అని తెలిసింది. ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ మరణంతో సోషల్ మీడియాలో ఈ తరహా ఛాలెంజ్లపై చర్చ జరుగుతోంది. ఇలా తినడం ఎందుకు? ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకని నెటిజన్లు తప్పుబడుతున్నారు.