- చైనాలో లోన్ ఆపరేషన్స్..లోకల్ గా రికవరీ నెట్‌వర్క్
- ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో షెల్ కంపెనీలు
- ఫేక్, ఫోర్జరీ డాక్యుమెంట్లతో బ్యాంక్ అకౌంట్స్
- పేమెంట్ గేట్ వేస్ నుంచి వందల కోట్లు కలెక్షన్
- క్రిప్టో, బిట్‌కాయిన్స్ ద్వారా చైనాకు ట్రాన్స్ ఫర్
‘‘ చైనాకు చెందిన జినా ‘హ్యాండీ లోన్ యాప్’తో పాటు మరో 38 లోన్ యాప్స్ డెవలప్ చేసింది. ఆన్‌లైన్ వర్క్ పేరుతో టెలిగ్రామ్‌లో లింక్స్ సర్క్యులేట్ చేసింది. గుర్‌గావ్‌కు చెందిన నలుగురితో కాల్‌సెంటర్ ఆపరేట్ చేయించింది. లోన్స్ రికవరీ చేసిన సొమ్ములో 20 శాతం కమీషన్ ఇస్తామని చెప్పింది. లోన్ కట్టని వారిని తీవ్ర వేధింపులకు గురిచేసింది. ఇలా పేమెంట్ గేట్ వేస్, క్రిప్టో కరెన్సీ నెట్‌వర్క్‌తో రూ.వందల కోట్లు మనీ లాండరింగ్‌కు పాల్పడింది. గుర్‌గావ్ ఏజెంట్లను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు గత గురువారం అరెస్ట్ చేశారు.’’
‘‘ చైనా జియాంగ్జీకి చెందిన ల్యాంబో సుమారు 250 యాప్స్‌ను ఆపరేట్ చేశాడు. గుర్‌గావ్‌లో ఆగ్లో, లియుఫాంగ్, నాబ్లూమ్, పిన్‌ప్రింట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కంపెనీలు ఓపెన్ చేశాడు. చైనాకు చెందిన జెనీఫర్‌తో కలిసి ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ కాల్ సెంటర్స్ నిర్వహిస్తున్నాడు. లియుషాంగ్,ఆగ్లో కంపెనీల పేర్లతో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ డేటా కలెక్ట్ చేశాడు. వాటి పేరిట రూ.1.4 కోట్ల మనీ ట్రాన్స్జా క్షన్స్ చేశాడు. లోన్ యాప్స్‌తో రూ.21,000 కోట్లు వసూలు చేశాడు. వీటిని క్రిప్టో, బిట్‌కాయిన్స్ ద్వారా చైనాకు తరలించాడు. ల్యాంబోను 2020 డిసెంబర్ 30న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.’’
హైదరాబాద్, వెలుగు : చైనా లోన్ యాప్స్ మనదేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇన్‌స్టంట్ లోన్ తీసుకునే వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. లోన్ కావాలని అడగకపోయినా క్యాష్ డిపాజిట్స్ చేసి బ్లాక్‌మెయిల్స్ చేస్తున్నాయి. ఫేక్ కాల్ సెంటర్స్, రికవరీ ఏజెంట్ల వేధింపులు, బ్లాక్ మెయిలింగ్ కారణంగా రాష్ట్రంలో దాదాపు 50 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. నాలుగేండ్ల కిందట మొదలైన లోన్ యాప్స్ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. లోన్ యాప్స్ తరహాలోనే గేమింగ్ యాప్స్ ఆన్‌లైన్ అడ్డాగా సైబర్ దోపిడీలకు పాల్పడుతున్నాయి. ఇదంతా చైనా నుంచే జరుగుతున్నప్పటికీ వాటికి చెక్ పెట్టడడంలో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో లోన్ యాప్స్‌ను కట్టడి చేయలేక ప్రజల్లో అవగాహన కల్పించడం మాత్రమే చేస్తున్నారు.
మూడు లేయర్స్‌లో నెట్‌వర్క్
లోన్ యాప్స్ ప్రధానంగా మూడు లేయర్స్ నెట్‌వర్క్ కింద ఆపరేట్ చేస్తూ.. వాటిని గూగుల్ ప్లే స్టోర్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. వీటిని డౌన్‌లోడ్ చేసుకునేలా అట్రాక్ట్ చేసే ఆఫర్స్ ఇస్తూ.. క్షణాల్లో మనీ ట్రాన్స్‌ఫర్స్ చేయిస్తున్నారు. యాప్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడే ఫోన్ కాంటాక్ట్స్, ఫొటో గ్యాలరీ సహా పూర్తి డేటా తమ చేతిలోకి తీసుకునేలా ఫీచర్స్ పెడుతున్నారు. దీంతో ఇన్‌స్టంట్ లోన్స్ తీసుకున్న వారి డేటా అంతా చైనా యాప్స్ సర్వర్స్‌లోకి వెళ్తుంది. ఇలాంటి డేటాతో లోన్‌యాప్ నిర్వాహకులు అందినంత దోచేస్తున్నారు. సిటీలో నమోదైన కేసుల్లో పోలీసులు 63 చైనా లోన్ యాప్స్ ను గుర్తించారు. వీటిని గూగుల్ ప్లే స్టోర్‌లో పేర్లు మార్చుతూ అప్‌లోడ్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. చైనా సర్వర్స్ నుంచే యాప్స్ ఆపరేట్ చేస్తుండగా.. మనదేశంలో రికవరీ ఏజెన్సీలు, బ్యాంక్ అకౌంట్స్ నెట్‌వర్క్స్ ను కొనసాగిస్తున్నట్టు తేలింది.
సోషల్‌మీడియాలో సర్క్యులేట్ చేసి..
లోన్ అమౌంట్ రికవరీ కోసం ఢిల్లీ, ముంబయి, వెస్ట్ బెంగాల్‌లో షెల్ కంపెనీలను ఓపెన్ చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో కంపెనీలను రిజిస్టర్ చేయిస్తూ.. వాటికి డైరెక్టర్స్‌గా స్థానికులను నియమిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ కంపెనీల పేరుతో కాల్‌సెంటర్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు ఆన్‌లైన్ జాబ్ పేరుతో సోషల్‌మీడియాలో లింక్స్ సర్క్యులేట్ చేసి యువతను ట్రాప్ చేస్తున్నారు. యాప్స్ ద్వారా సేకరించిన ఫోన్ నంబర్స్, ఫొటోల డేటాను మనదేశంలోని ఏజెన్సీలు, కాల్‌సెంటర్లకు పంపిస్తున్నారు. కలెక్షన్ చేసిన డబ్బులో 20 శాతం కమీషన్ గా ఇస్తున్నారు. దీంతో లోన్‌యాప్స్ కాల్‌సెంటర్స్ టెలీ కాలర్స్ లోన్ తీసుకున్న వారిని బ్లాక్‌మెయిల్ చేసి వసూళ్లు చేస్తున్నారు.
బ్యాంక్ అకౌంట్స్, క్రిప్టో కరెన్సీ ద్వారా..
ఏజెన్సీలు, కాల్‌సెంటర్స్ నిర్వాహకులు కలెక్ట్ చేసిన డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసేందుకు పేమెంట్ గేట్ వేస్, వర్చువల్ ఫోన్ నంబర్స్, ఆన్‌లైన్ అకౌంట్స్ వినియోగిస్తున్నారు. ఇందుకు మెట్రో సిటీల్లోని ఏజెంట్ల ద్వారా బ్యాంక్ అకౌంట్లు తీసుకుంటున్నారు. వీటిని పేమెంట్ గేట్‌వేస్‌తో కనెక్ట్ చేస్తున్నారు. ఆర్‌ఓసీ, బ్యాంకులకు ఫోర్జరీ డ్యాక్యుమెంట్స్ అందిస్తున్నారు. వీటిని ఫోర్జరీ డాక్యుమెంట్స్, షెల్ కంపెనీల పేర్లతో ఆపరేట్ చేస్తున్నారు. పేమెంట్ గేట్ వేస్ ద్వారా సేకరించిన డబ్బును డిపాజిట్స్ చేసేందుకు ప్రత్యేక బ్యాంకింగ్ నెట్‌వర్క్ వాడుతున్నారు. ఆ తర్వాత దుబాయ్‌లోని ఏజెంట్స్ ద్వారా ఇండియన్ కరెన్సీని క్రిప్టో కరెన్సీగా మార్చుతూ.. అక్కడి నుంచి చైనాకు మనీలాండరింగ్ చేస్తున్నారు.
అలర్ట్ గా ఉంటేనే నష్టాన్ని నివారించొచ్చు
చైనా నుంచే లోన్ యాప్స్ ఆపరేట్ చేస్తుండగా.. పేమెంట్ గేట్‌వేస్, క్రిప్టో, బిట్‌కాయిన్స్ ద్వారా మనీలాండరింగ్ చేస్తున్నారు. మనదేశంలోని నేరస్తులు దొరికినా చైనీయులు మాత్రం దొరకరు. పేర్లు మార్చి మళ్లీ కొత్త యాప్స్ తయారు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే తప్ప నష్టాన్ని నివారించలేం.