చంద్రుడిపై నీటి జాడను కనుగొన్నట్లు చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రుడి పైకి 2020లో చైనా పంపిన ఛాంగే-5 రోవర్ మిషన్ను విజయవంతంగా ముగించుకుని చంద్రుడిపై ఉన్న మట్టి, రాళ్ల నమూనాలతో భూమిని చేరుకుంది. ఈ సందర్భంగా చైనా యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తల బృందం నేషనల్ ఆస్ట్రానమీ జర్నల్లో చైనా చంద్రుడిపై నీటి ఆనవాళ్లను గుర్తించినట్లు ఇటీవల రాసింది. చంద్రుడిపై నీటి అణువులను గుర్తించడంలో మన దేశం పంపిన చంద్రయాన్-1 ఎంతటి కీలక పాత్ర పోషించిందో అందరికీ తెలిసిందే. చంద్రుడిపై ఉన్న ఖనిజాల్లో నీటి అణువులు నిక్షిప్తమై ఉన్నాయని నాసా మూన్ మైనరాలజీ మ్యాపర్ (M3) ఇమేజింగ్ స్పెక్టోమీటర్ కూడా నిర్ధారించింది.
ALSO READ | Shani lunar eclipse: 18 ఏళ్ల తరువాత ఆకాశంలో అద్భుతం..
చైనా శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. హైడ్రేటెడ్ సాల్ట్ రూపంలో నీరు ఉందని, చంద్రుడిపై సూర్య కాంతి పడే ప్రదేశాల్లో ఈ నీటి అణువులను ఛాంగే-5 రోవర్ గుర్తించిందని తెలిపారు. చంద్రుడిపై నుంచి ఛాంగే-5 తీసుకొచ్చిన లూనార్ సాయిల్ శాంపిల్స్ను పరీక్షించగా ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఛాంగే-5 చంద్రుడిపై నుంచి తీసుకొచ్చిన మట్టి, రాళ్ల నమూనాలు చంద్రుడిపై ఎక్కువ లాటిట్యూడ్ ఉన్న ప్రదేశం నుంచి సేకరించినవని తెలిపారు. అంతరిక్ష ప్రయోగాలపై చైనా గత దశాబ్ద కాలంగా భారీగా ఖర్చు చేస్తోంది.