చైనా మాంజా.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి గొంతు కోసుకుపోయింది..!

గాలి పటాల పండుగ ఏమోకానీ.. చైనా మాంజా దారం ప్రాణాలు తీస్తోంది. గాల్లోకి ఎగిరిన గాలి పటాలు.. కిందకు దిగిన తర్వాత.. వాటికి ఉన్న చైనా దారాలు జనం గొంతులు కోస్తున్నాయి. నిన్నటికి నిన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణాల మీదకు తెచ్చిన చైనా మాంజా.. ఇప్పుడు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి గొంతును కోశాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ సిటీలో కుషాయిగూడ నాగార్జున కాలనీకి చెందిన 29 ఏళ్ల సాయి వర్థన్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇంటి నుంచి బైక్ పై ఆఫీసుకు బయలుదేరిన సాయివర్థన్.. ఉప్పల్ మెట్రోస్టేషన్ దగ్గరకు రాగానే తన మెడకు చైనా మాంజా తగిలింది. బైక్ పై వెళుతుండటంతో.. మాంజా దెబ్బకు గొంతు కోసుకుపోయింది. ఆ వెంటనే కింద పడిపోయాడు. 

ALSO READ | హైదరాబాద్‎ సిటీలో తుపాకుల కలకలం.. 2 గన్స్, తపంచ, 10 బుల్లెట్స్ సీజ్

స్థానికులు వెంటనే గమనించి.. దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన డాక్టర్లు.. గొంతుకు కుట్లు వేశారు. పెద్ద ప్రమాదం తప్పిందని చెబుతున్నారు డాక్టర్లు. ఇంకొంచెం బలంగా మాంజా తగిలినా ప్రాణాలకే ముప్పు ఉండేదని స్పష్టం చేశారు డాక్టర్లు. 

చైనా మాంజా అమ్మకాలపై నిషేదం ఉన్నా.. అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.. కొనుగోళ్లు తగ్గటం లేదు అనటానికి ఈ ఘటనే నిదర్శనం. ఇప్పటికే వందల సంఖ్యలో పోలీసులు కేసులు నమోదు చేసినా.. ప్రతిఏటా ఈ చైనా మాంజా పీడ మాత్రం పోవటం లేదు. చైనా మాంజా అమ్మకాలు సాగించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటేకానీ ఇలాంటి ప్రమాదాలకు ఫుల్ స్టాప్ పెట్టలేం..