- ప్రధాని లీ కియాంగ్ బృందం వస్తున్నట్లు వెల్లడి
- జిన్‌పింగ్ గైర్హాజరీ ఎందుకనేది మాత్రం చెప్పలే
- ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సమిట్
- ఇప్పటికే రాలేనని చెప్పిన పుతిన్
- రెండ్రోజుల ముందే రానున్న బైడెన్
బీజింగ్: ఢిల్లీలో జరగనున్న 18వ జీ20 సమిట్‌కు చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని చైనా విదేశాంగ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ప్రధాని లీ కియాంగ్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం ఈ సమిట్‌కు హాజరుకానుందని వెల్లడించింది. అయితే, జిన్‌పింగ్ ఎందుకు రావట్లేదనే దానికి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. జీ20 సమిట్ తొలిసారిగా ఇండియాలో ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరగనుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు.. జీ20 సమిట్‌కు తమ ప్రధాని లీ కియాంగ్ హాజరవుతారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ చెప్పారు. అయితే హై ప్రొఫైల్ కాన్‌క్లేవ్‌కు జిన్‌పింగ్ ఎందుకు రావట్లేదనేది చెప్పలేదు.
మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘‘జీ20 సమిట్ గురించి నేను ఇప్పటికే ప్రకటన చేశాను. నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకున్నాను. అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి జీ 20 అనేది ప్రీమియర్ ఫోరమ్. చైనా ఇందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. జీ20 యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొంటున్నది. ఈ ఏడాది జరిగే సమిట్‌లో చైనా అభిప్రాయాలను, ప్రతిపాదనలను ప్రధాని లీ కియాంగ్ పంచుకుంటారు. జీ20 దేశాల మధ్య మరింత సంఘీభావం, సహకారం ఉండేలా ప్రోత్సహిస్తారు. ప్రపంచ ఆర్థిక, అభివృద్ధి సవాళ్లకు ఉమ్మడి ప్రతిస్పందన గురించి చర్చిస్తారు. జీ20 సమిట్‌ను విజయవంతం చేసేందుకు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కోలుకునేందుకు, సుస్థిర అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు
రెడీగా ఉన్నాం” అని చెప్పుకొచ్చారు.
ఆసియాన్‌కూ డుమ్మా
ఆసియన్ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఆసియన్ నేషన్స్), ఈస్ట్ ఆసియా సమిట్స్కు కూడా జిన్‌పింగ్ వెళ్లడంలేదు. ఇండోనేసియాలోని జకార్తాలో ఈ నెల 5 నుంచి 8 వరకు జరిగే ఆసియన్ సమిట్‌కూ ప్రధాని లీ కియాంగ్ వెళ్తున్నారు. జకార్తాలో ఈస్ట్ ఆసియా సదస్సుకు హాజరైన తర్వాత.. ఇండియాకు లీ కియాంగ్ బయల్దేరి రానున్నారు. 2021లో చైనా కరోనా ఆంక్షల నేపథ్యంలో.. ఆ ఏడాది ఇటలీలో జరిగిన జీ20 సమిట్‌కు జిన్‌పింగ్ వెళ్లలేదు. ఇక ఢిల్లీలో జరిగే జీ20 సమిట్‌కు పుతిన్ కూడా రావడంలేదు. ఈసారి పుతిన్ తన తరఫున ఫారిన్
మినిస్టర్ సెర్గీయ్ లావ్రోవ్‌ను పంపుతున్నారు.
వస్తున్నది వీళ్లే
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మేక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, జర్మన్ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కాల్జ్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద, బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా ద సిల్వ తదితరులు జీ20 సమిట్‌కు రానున్నట్లు ఆయా దేశాలు అధికారికంగా ప్రకటించాయి.
నేతలు రాకపోవడం మామూలే!
నేతలు గైర్హాజరు కావడం మామూలేనని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఏటా జరిగే గ్లోబల్ సమిట్స్ లో అటెండెన్స్ మారుతుంటుందని, సభ్య దేశాల నేతలందరూ హాజరు కావడం చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతుందని వివరించాయి. కొన్ని సార్లు టైమ్ కూడా కీలక పాత్ర పోషిస్తుందని, బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోవచ్చని వెల్లడించాయి. నేతల గైర్హాజరు.. ఆతిథ్య దేశంపై ఎలాంటి ప్రభావం చూపబోదని తెలిపాయి. ‘‘2008 నుంచి 17 సమిట్స్ జరిగాయి. 2018 నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా అన్ని దేశాలు హాజరుకాలేదు” అని చెప్పాయి. ఇండియా, కెనడా, జర్మనీ, ఇటలీ, సౌత్ కొరియా, టర్కీ (తుర్కియే), బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ మాత్రమే ప్రతి సమిట్‌కు తమ దేశాధినేతను పంపాయని వివరించాయి.
డిసప్పాయింట్ అయ్యా: బైడెన్
జీ20 సమిట్‌కు జిన్‌పింగ్ రావడంలేదన్న అంశంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. డెలావేర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘డిసప్పాయింట్ అయ్యా. కానీ నేను అతడిని కలవబోతున్నా” అని చెప్పారు. అయితే ఎప్పుడు, ఎక్కడ జిన్‌పింగ్ ను కలుస్తారనేది చెప్పలే.ఇండోనేసియాలో జరిగిన జీ20 సమిట్‌లో చివరిసారి కలిశారు.