మధుమేహంతో చాలా కాలం బాధపడే వారికి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. శరీరంలోని పలు అవయవాలపై ఎఫెక్ట్ పడుతుంది. డయాబెటిస్ ముదిరితే గుండె, కిడ్నీతో పాటు కంటి సమస్యలు ఏర్పడుతాయి. దీంతో షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకునేందుకు బాధితులు టాబ్లెట్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన సెల్ థెరపీతో టాబ్లెట్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్ల బాధ తప్పే అవకాశం ఉంది. చైనా సైంటిస్టులు సెల్ థెరపీతో డయాబెటిస్ నయం చేశారు.
Chinese team reports patient’s diabetes cured with cell therapy in world first https://t.co/M4iqnM0NBr
— South China Morning Post (@SCMPNews) May 27, 2024
సెల్ థెరపీ ద్వారా డయాబెటిక్ పేషెంట్లలోని పెరిపెరల్ బ్లడ్ మోనో న్యూక్లియర్ సెల్స్ ను సీడ్ సెల్స్ గా మారుస్తారు. ప్యాంక్రియాట్ ఐలెట్ సెల్స్ రీ క్రియేట్ చేశారు. ఈ ప్రక్రియ ద్వారా డయాబెటిస్ ను కంట్రోల్ చేశారు. ఈ విధానం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని వైద్యులు వెల్లడించారు. అయితే, ఈ కొత్త విధానానికి సంబంధించి తొలి దశ ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఇంకా కొన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి. అవి కూడా సక్సెస్ అయితే, ఈ విధానం అమల్లోకి రానుంది.
గత 25 ఏళ్లుగా చైనా వైద్యులు సెల్ థెరపీ పై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. డయాబెటిస్ తో బాధపడుతున్న ఓ 59 ఏళ్ల బాధితుడిపై ఈ ప్రయోగం మొదలు పెట్టారు. ఇదే వ్యక్తికి 2017లో షుగర్ కారణంగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల నుంచి ఈ పరిశోధన విస్తృతం చేశారు. సెల్ థెరపీ ద్వారా అతడికి చికిత్స కొనసాగించారు.
ఈ ట్రీట్మెంట్ మొదలు పెట్టిన తర్వాత సుమారు 10 నుంచి 11 వారాల తర్వాత ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం కనిపించలేదు. షుగర్ కంట్రోల్ కోసం టాబ్లెట్లు కూడా వేసుకోలేదు. సెల్ థెరపీ మొదలు పెట్టిన తర్వాత డయాబెటిక్ పేషెంట్ లో ప్యాంక్రియాటిక్ ఐలెట్ పని తీరు మెరుగు పడినట్లు పరిశోధకులు గుర్తించారు. తర్వాత పూర్తిగా అతను మధుమేహాం నుంచి కోలుకున్నాడు.