చైనా యూనిట్రీ రోబో టిక్స్ నుంచి రోబో కుక్కలు

చైనా యూనిట్రీ రోబో టిక్స్ నుంచి రోబో కుక్కలు

ఆర్డరేయండి చాలు.. ముందుకు దూకేస్తం, దండెత్తుతాం అన్నట్టు పోజిస్తున్నయ్​ కదా ఈ రోబో కుక్కలు. అవును మరి, ఆర్డరే తరువాయి ఈ కుక్కలకు. చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్​ అనే సంస్థ ఈ రోబో కుక్కలకు టెక్నాలజీతో ప్రాణం పోసింది. వాటికి ట్రైనింగ్​ కూడా ఇచ్చింది. ఆర్డర్​ వేయగానే అన్నీ ఒకేసారి రియాక్ట్​ అయ్యేలా వాటికి మస్తు శిక్షణనిచ్చింది. దానికి సంబంధించిన వీడియోను ఓ యూజర్​ ట్విట్టర్​లో పోస్ట్​ చేయడంతో అది కాస్తా వైరల్​ అయిపోయింది. జోకులైతే మామూలుగా పేలలేదనుకోండి! అమెరికా మీద దండెత్తేందుకు చైనా బహుశా ఈ టెక్నాలజీని తయారు చేస్తోందేమో అంటూ సెటైర్లు పేలాయ్​. స్కైనెట్​ లోగో ఎక్కడంటూ ఒకరు..ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​లో అమెరికాకు చైనా ఎంత దూరం.. 12 గంటలు అంటూ ఇంకొకరు.. బ్లాక్​ మిర్రర్​, టెర్మినేటర్​ సినిమాలు గుర్తొస్తున్నాయని మరొకరు రిప్లైలు ఇచ్చారు. 

జోకుల మాటెలా ఉన్నా.. ఈ రోబో కుక్క సత్తా మాత్రం మూమూలుది కాదు. మీరు ఒక సెకనుకు ఎంత దూరం నడవగలరు.. మహా అయితే రెండడుగులు వేయగలరేమో! కానీ, ఈ రోబో కుక్క ఒక్క ఉదుటున 10 అడుగుల దూరం పోతుంది. గంటలో 11 కిలోమీటర్లు నడిచి వెళ్తుంది. 12 కిలోల బరువుండే ఈ రోబో కుక్క 5 కిలోల బరువును ఈజీగా మోసుకెళ్తుంది. ప్రస్తుతానికి వాటితో ఎలాంటి హాని లేదని, కేవలం ఫ్యాక్టరీల్లో పనుల కోసం మాత్రమే తయారు చేశామని కంపెనీ చెప్తోంది. నిరుడు నిర్వహించిన కన్జ్యూమర్​ ఎలక్ట్రానిక్స్​ షోలో వాటిని కంపెనీ ప్రెజెంట్​ చేసింది. ఇంతకీ దీని పేరు చెప్పలేదు కదూ! వాటి రూపుకు తగ్గట్టే.. ‘‘ఏలియన్​గో’’ అని పెట్టారు మరి!!