
Trump Vs China: ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ప్రపంచ దేశాలపై ప్రకటించిన టారిఫ్స్ పెద్ద ఆర్థిక ఉత్పాతానికి దారితీస్తుందని ఆర్థిక వేత్తల ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా దేశాలు అమెరికాతో వ్యాపార ఒప్పందాలకు క్యూ కట్టడంతో ట్రంప్ 75 దేశాలపై 90 రోజుల పాటు టారిఫ్స్ రిలీఫ్ ప్రకటించారు. అయితే ప్రతీకార సుంకాలు ప్రకటించిన చైనా విషయంలో మాత్రం ఎలాంటి కనికరం చూపటం లేదు అమెరికా. అయితే బేస్ 10 శాతం సుంకాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో ఏదేశం పైనా విధించిన స్థాయిలో అత్యధికంగా 125 శాతం చైనా వస్తువులపై సుంకాలను ప్రకటించారు. ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోవటంతో చైనాలోని వ్యాపారులు, తయారీదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితులకు అనుగుణంగా గ్లోబల్ సప్లై నెట్వర్క్ మార్పులకు గురవుతోంది. దీంతో అమెరికాలో చైనా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు డిమాండ్ భారీగా పడిపోయింది.
దీంతో చైనాలోని అనేక ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో ఉపయోగించే పార్ట్స్ తయారీ సంస్థలు ప్రస్తుతం భారతీయ సంస్థలకు తగ్గించిన రేట్లకు ఆఫర్ చేస్తున్నారు. దీంతో భారతదేశంలో టీవీలు, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్ల తయారీదారుల లాభాలు 2-3 శాతం పెరగవచ్చని తెలుస్తోంది. దీనిలో కొంత కస్టమర్లకు అందించటం ద్వారా చాలా కంపెనీలు తమ అమ్మకాలను పెంచుకోవాలని చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్ లో 75 శాతం చైనా నుంచి దిగుమతి చేసుకున్నవి కావటంతో కంపెనీలకు ప్రయోజకరంగా ఉంటుందని తెలుస్తోంది.
అమెరికా నుంచి ఆర్డర్ల మందగమనంతో చైనా సంస్థల వద్ద మంచి తగ్గింపులను కోరటానికి భారత కంపెనీలకు అవకాశం లభించిందని గోద్రేజ్ ఎంటర్ ప్రైజెస్ హెడ్ కమల్ నంది అన్నారు. భారత కంపెనీలు సహజంగా 2-3 నెలలకు సరిపడా పార్ట్స్ స్టాక్ చేస్తాయి. కానీ చైనా సంస్థలు అధిక స్టాక్స్ తో ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇది భయాలకు దారితీస్తున్నందున 5 శాతం వరకు తగ్గింపులను భారత సంస్థలు పొందుతున్నాయి. దీంతో అమెరికాతో 127 బిలియన్ డాలర్ల మేర వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉందని చైనా కంపెనీలు భావిస్తున్నాయి.
చైనాకు ఇండియాలోనూ ఎదురుదెబ్బ..
ప్రస్తుతం ఇండియాలో ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహకాలతో పాటు బీఐఎస్ అనుమతులకు అనుగుణంగానే ఎలక్ట్రానిక్ పార్ట్స్ దిగుమతి చేసుకోవాల్సి ఉన్నందున చైనా వ్యాపారులు తక్కువ డిమాండ్ చూస్తున్నారు. దీంతో ఇండియాలోకి తమ ఉత్పత్తులను డంప్ చేసేందుకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీ పథకాన్ని ప్రకటించిన తర్వాత.. 2030 నాటికి దేశీయ విడిభాగాలు, సబ్-అసెంబ్లీ తయారీ 145-155 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ అంచనా వేసింది.