- రైతులకు సాగునీటితోపాటు క్వాలిటీ విత్తనాలూ అందిస్తం: చిన్నారెడ్డి
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లో 500 టీఎంసీలు సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. ప్రస్తుతం 299 టీఎంసీలు మాత్రమే ఇస్తున్నారని, 500 టీఎంసీల సాగు నీరు రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. కృష్ణా జలాల సాధన కోసం సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని తెలిపారు. శుక్రవారం అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ వర్సిటీ ఆడిటోరియంలో అగ్రికల్చర్ డైరీని ఆవిష్కరించి, అగ్రికల్చరల్ ఆఫీసర్స్ వెబ్ సైట్‌ను చిన్నారెడ్డి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు, సాగు నీరు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. సారవంతమైన నేల సాగుకు అవసరమయ్యే నీరు, క్వాలిటీ విత్తనాలు అందిస్తే రైతులు బంగారు పంటలు పండిస్తారని తెలిపారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నేతృత్వంలో కృషి జరుగుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అగ్రికల్చర్సెక్టార్కు రూ.54 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.
రాబోయే రాష్ట్ర బడ్జెట్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలను తిరిగి ప్రారంభించే ఆలోచనలో సీఎం ఉన్నారని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్, పనిముట్లపై సబ్సిడీలు, పంటల బీమా పథకాలను పునఃప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాలతో దేశంలోనే అధిక వరి ఉత్పత్తులను పండించిన రాష్ట్రంగా తెలంగాణ ప్రసిద్ధికెక్కిందన్నారు.
50 లక్షల ఎకరాల పత్తి సాగు చేసిన ఘనత తెలంగాణకే దక్కిందన్నారు. అగ్రికల్చర్డిపార్ట్మెంట్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ప్రమోషన్లు సైతం ఇస్తుందన్నారు. భూసార పరీక్షలు నిర్వహించడంతో పాటు వర్మి కంపోస్ట్ ఎరువుల తయారీకి పశువుల పెంటను వాడుకునే విధంగా రైతులను చైతన్యం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ప్రతినిధులు, సైంటిస్ట్‌లు పాల్గొన్నారు.