ఆర్డీఎస్ కు నీళ్లిచ్చేందుకే చిన్నోనిపల్లి రిజర్వాయర్​

ఆర్డీఎస్ కు నీళ్లిచ్చేందుకే చిన్నోనిపల్లి రిజర్వాయర్​
  • ఆర్డీఎస్ కు నీళ్లిచ్చేందుకే చిన్నోనిపల్లి రిజర్వాయర్​
  • తుమ్మిళ్లలో రిజర్వాయర్లు కట్టలేకే పాత దానిని ముందేసుకున్న సర్కారు
  •     సీడబ్ల్యూసీ క్లియరెన్స్ లేకుండానే పనులు
  •     నీళ్లు నింపితే మరో ర్యాలంపాడు కావడం ఖాయం

గద్వాల, వెలుగు: తుమ్మిళ్ల లిఫ్ట్​ నుంచి ఆర్డీఎస్​కు నీళ్లు ఇచ్చేందుకు 3 రిజర్వాయర్లు నిర్మించేందుకు భారీగా నిధులు అవసరం ఉండడంతో ప్రభుత్వం చిన్నోనిపల్లి రిజర్వాయర్​ను తెరపైకి తెస్తోంది. ఆర్డీఎస్​ రైతులను ప్రసన్నం చేసుకొనేందుకు సీడబ్ల్యూసీ క్లియరెన్స్​ లేకుండానే పోలీసుల పహారా నడుమ పనులు చేపడుతోంది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా గట్టు మండలం చిన్నోనిపల్లి విలేజ్  దగ్గర నిర్మిస్తున్న రిజర్వాయర్  నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2005లో సర్వే చేసి 2006లో భూసేకరణ పూర్తి చేశారు. 2007లో పనులు స్టార్ట్  చేసి, 80 శాతం పనులు కంప్లీట్ చేశారు. ఈపీసీ విధానం ద్వారా కాంట్రాక్టర్లు పనులు చేయడంతో క్వాలిటీ లేకుండా పోయిందనే ఆరోపణలున్నాయి. 

నీళ్లు నింపితే మరో ర్యాలంపాడే..

చిన్నోనిపల్లి రిజర్వాయర్  పనులు కంప్లీట్ చేసి నీళ్లు నింపితే మరో ర్యాలంపాడు కావడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2007లో 1.5 టీఎంసీల సామర్థ్యంతో రూ.39 కోట్లతో ఈపీసీ విధానం ద్వారా పనులు చేపట్టారు. రూ. 32 కోట్ల వర్క్స్​ కంప్లీట్ కాగా, మరో రూ.7 కోట్ల పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఎలాంటి పర్యవేక్షణ లేకుండా కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా డిజైన్ చేసి బండ్  నిర్మాణానికి ఒక ట్రిప్పు నల్ల మట్టి కూడా వాడకుండా నాసిరకంగా పనులు చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఇబ్బందులు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా పనులు చేయకుండా వదిలేయడంతో కంప, తుమ్మ చెట్లు మొలిచి కట్ట బలహీనంగా మారిందని రైతులు చెబుతున్నారు. ఎక్కడపడితే అక్కడ గుంతలు తవ్వడం, రివిట్ మెంట్ తొలగించడం, ఇలా పనులన్నీ అస్తవ్యస్తంగా మారాయి.

ఆర్డీఎస్ కు లింకు చేసే కుట్ర..

నిర్వాసిత రైతులు ఆరోపణలు చేస్తున్నట్లు చిన్నోనిపల్లి రిజర్వాయర్ నుంచి ఆర్డీఎస్ కు నీళ్లు ఇచ్చే కుట్ర బహిర్గతం అవుతోంది. శనివారం ఆర్డీవో ఆఫీస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇరిగేషన్ ఈఈ రహీముద్దీన్  డి25 కాలువ ద్వారా 12 వేల ఎకరాలకు చిన్నోనిపల్లి రిజర్వాయర్  నుంచి నీళ్లు ఇస్తామని స్పష్టంగా చెప్పారు. సీడబ్ల్యూసీ క్లియరెన్స్ లేకుండా ఒక ప్రాజెక్టు నుంచి మరో ప్రాజెక్ట్ కు నీళ్లు ఇవ్వడం వాయిలెన్స్​ ఆఫ్  బచావత్  ట్రిబ్యునల్ కింద నేరంగా మారే అవకాశం ఉంది. క్లియరెన్స్  లేకుండా నీళ్లు ఇస్తే పెద్ద నేరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

‘తుమ్మిళ్ల’లో రిజర్వాయర్లు కట్టలేకనే..

ఆర్డీఎస్  చివరి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం తుమ్మిళ్ల లిఫ్ట్​ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగానే 2017లో రూ.783 కోట్లతో తుమ్మిళ్ల లిఫ్ట్  పనులకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. లిఫ్ట్​లో భాగంగా రాజోలి మండలం తుమ్మిళ్ల దగ్గర రూ.162 కోట్లతో పంప్ హౌస్  నిర్మాణాన్ని చేపట్టారు. ఒక పంపును పూర్తి చేసి 2018లో హడావుడిగా ఆర్డీఎస్ కాలువలకు నీటిని విడుదల చేశారు. కానీ రిజర్వాయర్లు లేకపోవడంతో తరచూ పంపింగ్  బంద్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆర్డీఎస్  రైతులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. అలంపూర్ నియోజకవర్గంలోని రైతుల ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం చిన్నోనిపల్లి రిజర్వాయర్  ద్వారా నీటిని నిలిపే ప్లాన్ తో ముందుకు వచ్చింది. పంప్ హౌస్ మాత్రమే నిర్మించిన ప్రభుత్వం మల్లమ్మ కుంట, జూలకల్లు, వల్లూరు రిజర్వాయర్లను కడతామని చెప్పి ఇప్పటివరకు కట్టలేదు. ఈ మూడు రిజర్వాయర్లు కంప్లీట్  కావాలంటే రూ.500 కోట్లకు పైగా నిధులు కావాలి. భూసేకరణ కూడా చేయకపోవడంతో ఆ పనులు చేయలేక, ఇప్పటికే భూసేకరణ చేసి రెడీగా ఉన్నా చిన్నోనిపల్లి రిజర్వాయర్ ను కంప్లీట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసమే పోలీస్  ప్రొటెక్షన్ తో నిర్వాసితులను భయభ్రాంతులకు గురి చేసి పనులు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తుమ్మిళ్ళ ప్రాజెక్టును తుంగలో తొక్కి చిన్నోనిపల్లి రిజర్వాయర్  ద్వారా ఆర్డీఎస్ కు నీళ్లు ఇచ్చే ప్లాన్ కు ప్రభుత్వం స్కెచ్ వేసినట్లు స్పష్టమవుతోంది. 

అన్ని టెస్టులు చేశాకే నీటిని నింపుతాం..

అన్ని టెస్టులు చేశాకే చిన్నోనిపల్లి రిజర్వాయర్ లో నీటిని నింపుతాం. చిన్నోనిపల్లి రిజర్వాయర్ నుంచి ప్రత్యక్ష ఆయకట్టు లేదు. సప్లిమెంటరీ ద్వారా నెట్టెంపాడు పరిధిలోని 3,000 ఎకరాలకు, ఆర్డీఎస్  పరిధిలోని 12 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా డిజైన్ చేశాం.
- రహీముద్దీన్, ఇరిగేషన్  ఈఈ